‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనాల్సిన మాటలేనా ఇవి?

343
World Famous Lover movie teaser review
World Famous Lover movie teaser review

”ఐ డిడ్ నాట్ జస్టిఫైడ్ యువర్ లెగ్స్!”
ఇది ఒక తెలుగు సినిమాలోని డైలాగ్ అంటే ఎవరైనా నమ్మగలరా?
అవును. ఇప్పుడు నమ్మి తీరాలి.
కావాలంటే, ఈ ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవానికి రిలీజ్ కానున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ చూడండి.


విజయ్ దేవరకొండ హీరోగా, ఐశ్వర్యా రాజేశ్, రాశీఖన్నా, క్యాథరిన్ థ్రెసా, ఇసబెల్లా లితే హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. సీనియర్ నిర్మాత – ‘క్రియేటివ్ కమర్షియల్స్’ అధినేత కె.ఎస్. రామారావు నిర్మించగా, సిన్సియర్ కథాంశాల దర్శకుడు క్రాంతిమాధవ్ రూపొందించిన ఈ సినిమా టీజర్ చూడగానే ఎవరైనా షాక్‌కు గురికాక తప్పదు.


”ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు… ప్రేమంటే ఒక శాక్రిఫైజ్. ప్రేమంటే ఒక దైవత్వం ఉంటుంది. ఆ ఫీల్ నీకు అర్థం కాదు” అనే డైలాగులు వినిపిస్తుండగా హీరో విజయ్ దేవరకొండను చూపిస్తూ, సాగిన దృశ్యాలు వీక్షకులను మళ్ళీ పాత జ్ఞాపకాలలోకి తీసుకువెళుతుంది. రెండున్నరేళ్ళ క్రితం విడుదలై, సంచలనం రేపిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని ఈ టీజర్ మరోమారు గుర్తుకుతెచ్చింది. అసభ్యత, అశ్లీలం మొదలు పురుషాధిక్య భావజాలం దాకా అనేక అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ రేపిన ఆ సినిమా తాలూకు దృశ్యాలు, అదే నేపథ్య సంగీతాన్ని ఈ కొత్త సినిమా ట్రైలర్ స్ఫురణకు తెస్తోంది. ఇంకా చెప్పాలంటే, పాత రీరికార్డింగే మరోసారి విన్నట్లూ అనిపించింది. ప్రేమంటే… ఎంత గొప్పదో చెప్పే డైలాగులతో పాటు, హీరోకు ఒకరికి నలుగురితో ఉన్న దైహిక సాన్నిహిత్యాన్ని కూడా ఈ టీజర్ చూపించింది.


ప్రేమ గురించి ఎన్ని గొప్ప డైలాగులు వినిపించినా, ఈ దృశ్యాలు చూస్తుంటే అటు హీరో మొదలు ఇటు దర్శక, నిర్మాతల దాకా అందరూ అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ నుంచి బయటపడలేదేమో అనిపిస్తోంది. మరి, ఈ వరల్డ్ ఫేమస్ లవర్ కూడా అర్జున్ రెడ్డి బాటలో నడుస్తాడేమో చూడాలి. ప్రేమంటే రెండు మనసుల మధ్య అనుబంధం కాక, రెండు రెళ్ళు నాలుగు కాళ్ళ మధ్య జస్టిఫికేషన్ అనుకొనే ఇలాంటి క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్లు తెలుగు సినిమాకే కాదు… సమాజానికి కూడా ఏం మేలు చేస్తాయో? ఈ క్రియేటివిటీ ఏ కమర్షియలిజమ్ కోసమో?
……………………