మొత్తానికి… హీరో దొరికేశాడు!

56
Nagarjuna

‘ఆపరేషన్ గరుడవేగ’ చిత్రం సూపర్ హిట్ చిత్రం. మరి, ఆ తరువాత ఆ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఏమయ్యారు? ఇంతకాలంగా ఆయన నుంచి ఏ సినిమా రాలేదేమిటి? ఎట్టకేలకు ఇప్పుడొస్తోంది.


‘ఆపరేషన్ గరుడవేగ’ తరువాత గడచిన రెండేళ్ళ పైచిలుకుగా ప్రవీణ్ సత్తారు నుంచి మరో కొత్త సినిమా ఏమీ రాలేదు. నిజానికి, ఆ సూపర్ హిట్ సినిమా తరువాత హీరో రామ్‌తో ప్రవీణ్ ఓ సినిమా చేయాల్సింది. ఆ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకొంది. విదేశాలకు వెళ్ళి లొకేషన్లు కూడా వెతికి వచ్చారు. కానీ, ఇంతలో ఏమయ్యిందో ఏమో… స్పై థ్రిల్లర్ లాంటి కథాంశంతో రావాల్సిన ఆ చిత్రం కాస్తా అటకెక్కింది. అనుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ అవుతుండడంతో, ఆ ప్రాజెక్టును దర్శకుడు, హీరో పక్కన పెట్టేశారు. దాంతో, ‘గరుడవేగ’ లాంటి హిట్ తరువాత కూడా ప్రవీణ్‌ కొత్త సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది.


ఇంతలో ‘బాహుబలి’ చిత్ర నిర్మాతలు బాహుబలికి ప్రీక్వెల్‌గా రూపొందిస్తున్న భారీ వెబ్ సిరీస్‌ ‘శివగామి’ చేసేందుకు ప్రవీణ్ సత్తారుకు ఛాన్స్ దక్కింది. ఆ వెబ్ సిరీస్ తీయడంలో ఆయన బిజీగా ఉండిపోయారు. అయితే, మరోపక్క నాని, నితిన్ లాంటి యువ హీరోలతో కొత్త సినిమా చేసేందుకు కూడా ప్రవీణ్ ప్రయత్నం చేయకపోలేదు. హిందీ హిట్ చిత్రం అంధా ధున్ తెలుగు రీమేక్ కోసం నితిన్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ప్రవీణ్‌కే ఇవ్వాలని కూడా ఆ మధ్యలో అనుకున్నారు. కానీ, అదేమిటో… ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాంతో, అనివార్యంగా గరుడవేగ రిలీజైన గడచిన ఇరవై ఏడు నెలలుగా ఆయన సినిమా డైరెక్షన్‌కు పెద్ద బ్రేకే పడింది.
ఇది ఇలా ఉండగా, ఇన్నాళ్ళకు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ సత్తారు మెగాఫోన్ పట్టే అవకాశం వచ్చింది. ఆయన చెప్పిన ఓ కథకు సీనియర్ హీరో నాగార్జున ఓకె చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం యువ దర్శకుడు సాల్మన్ దర్శకత్వంలో మ్యాట్సీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందుతున్న వైల్డ్ డాగ్ చిత్రం చేస్తున్నారు నాగ్. ఆ సినిమా అయిపోగానే ఆయన, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దే పనిలో ప్రవీణ్ ఉన్నారు.

విచిత్రం ఏమిటంటే… పవన్ కల్యాణ్‌కు ఒకప్పుడు సన్నిహితుడైన శరత్ మరార్, అలాగే ప్రముఖ సినీ పంపిణీ సంస్థ ఏషియన్ ఫిల్మ్స్ సారథి సునీల్ నారంగ్‌లు కలసి ఈ కొత్త చిత్రాన్ని నిర్మిస్తుండడం. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించి మరింత సమాచారం అధికారికంగా వెల్లడి కావడానికి మరికొంత సమయం పడుతుంది.

మొత్తానికి, చందమామ కథలు లాంటి విభిన్న తరహా చిత్రం అందించిన యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు పాపం… యువ హీరోల బదులు వయసు మీద పడ్డ ముసలి హీరోలే ఎదురుపడుతున్నారు. అప్పట్లో… ‘గరుడవేగ’కు రాజశేఖర్, ఇప్పుడేమో ఈ కొత్త ప్రాజెక్టు నాగార్జునలతో చేయాల్సి వచ్చింది. అప్పుడు రాజశేఖర్ లానే ఇప్పుడు నాగ్ కూడా సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. మరి, హీరోల వయసు మాటెలా ఉన్నా… మంచి కాన్సెప్టులతో విజయాలు సాధించే ప్రవీణ్ సత్తారు ఈసారి నాగార్జున ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేయగలుగుతారా? నాగార్జున ఆశిస్తున్నదీ అదే మరి!