నానక్ రామ్ గూడాలో ఓ సీనియర్ నటుడి కొత్త స్టూడియో?

530

నానక్ రామ్ గూడా! పదిహేను, ఇరవై ఏళ్ళ క్రితం హైదరాబాద్ నగరానికి శివారు కింద లెక్క. గతంలో అక్కడ షూటింగ్ అంటే, సినిమా వాళ్ళకు, మరీ ముఖ్యంగా చిన్నా చితకా ఆర్టిస్టులకు వేరే ఊరు ప్రయాణమంత పని. కానీ, ఇప్పుడు అది నగరానికి నడిబొడ్డు. ప్రముఖ నిర్మాత రామానాయుడు గారు నిర్మించిన నానక్ రామ్ గూడా రామానాయుడు స్టూడియో పుణ్యమా అని ఆ ప్రాంతమంతా పక్కా సినిమా ప్రాంతమైంది. ఆ పక్కనే చిత్రపురి కాలనీ కూడా రావడంతో మధ్యశ్రేణి సినిమా ఆర్టిస్టులకూ, టెక్నీషియన్లకూ అదో అడ్డా అయింది. పక్కనే ఔటర్ రింగ్ రోడ్ రావడంతో మంచి కమర్షియల్ ఏరియా గానూ మారింది.

        జీవనోపాధి పోయిన బాధలో…

        అయితే, ఇప్పుడు అదే పెద్ద ఇబ్బంది అయింది. రామానాయుడు కుమారుడు డి. సురేశ్ బాబు వాళ్ళ నాన్న గారు కట్టించిన నానక్ రామ్ గూడా స్టూడియోను ఏకంగా మూసేస్తున్నారు. దాన్ని పక్కా వాణిజ్య భవన సముదాయంగా మార్చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సినిమా వాళ్ళకు ప్రస్తుతం ఆలవాలమైన నానక్ రామ్ గూడా, మణికొండ లాంటి ప్రాంతాల్లో ఉన్నవాళ్ళందరికీ చెప్పుకోలేని బాధగా మారింది. నిత్యం సినిమా షూటింగులుండే నానక్ రామ్ గూడా స్టూడియో పోతుండడంతో దగ్గరలోని జీవనోపాధి పోయిందనే భావన కలిగింది.

        అయితే, అలా బాధపడుతున్నవాళ్ళందరికీ ఇప్పుడు ఓ చిన్న ఉపశమనం. నానక్ రామ్ గూడాలో రామానాయుడు స్టూడియో కనుమరుగైనా, త్వరలోనే మరో కొత్త స్టూడియో ఆ చుట్టుపక్కలే రానుందట. ఓ ప్రముఖ సినీ నటుడు సువిశాలమైన తన సొంత స్థలంలో, ఒక సొంత స్టూడియో కట్టనున్నారట. అందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

తల్లి పేరు మీద తనయుడి ప్రణాళిక

        ఫిల్మ్ నగర్ వర్గాల కథనం ప్రకారం… మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడూ, సీనియర్ నటుడూ అయిన వి.కె. నరేశ్ కొత్తగా స్టూడియో కట్టనున్నారు. నానక్ రామ్ గూడా ప్రాంతంలో ఉన్న విశాలమైన తన సొంత స్థలంలో ఆయన ఆ స్టూడియో కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది మరణించిన తన తల్లి – సినీనటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మల పేరు మీద ఆయన ఆ స్టూడియో కట్టనున్నారని భోగట్టా. ఆ స్టూడియోలో అన్ని రకాల వసతులూ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. పెద్ద సంఖ్యలో భూములు, అంతకు మించి వేల కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చివెళ్ళిన తల్లి పేరును శాశ్వతంగా నిలబెట్టడానికి నరేశ్ ఈ పని చేస్తున్నారని తెలుస్తోంది.

        మళ్ళీ ఓ కొత్త ఆశ…

ఎంత త్వరగా ఈ ఆలోచన కార్యరూపం ధరిస్తుందో కానీ, ఆ కొత్త స్టూడియో వస్తే, సినిమా రంగంపై ఆధారపడ్డ అనేకమంది నానక్ రామ్ గూడా, మణికొండ పరిసరాల్లోని బడుగు జీవులకు ఓ పెద్ద ఊరట లభిస్తుంది. వాళ్ళ రోజు వారీ జీవనోపాధికి మళ్ళీ ఓ మార్గం దొరికినట్టవుతుంది. నరేశ్ గారూ… వింటున్నారా. అందరూ మీ నోట అధికారికంగా, ఆ చల్లని మాట వినడం కోసం ఎదురుచూస్తున్నారు. శుభస్య శీఘ్రం.