World Famous Lover Review and Rating – అర్జున్‌రెడ్డి హ్యాంగోవర్‌లో… వీడు వరల్డ్ ఫేమస్ ‘వెబ్ సిరీస్’ లవర్

227
World Famous Lover
World Famous Lover movie review and rating

ప్ర‌పంచ ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా విజ‌య దేవ‌ర‌కొండ న‌టించిన World Famous Lover చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది. రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్య రాజేశ్‌, కేథ‌రీన్ త్రెసా, ఇజ‌బెల్లే లీటే త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రంపై యూత్‌లో విశేష‌మైన ఆస‌క్తి నెల‌కొన్న‌ది. ఈ సినిమాకు సంబంధించిన స‌మ‌గ్ర‌ రివ్యూ మీ కోసం…

రేటింగ్ – 2.25 / 5

                క్రేజు రావడం కష్టమే… కానీ, వచ్చిన క్రేజును నిలబెట్టుకోవడమే మరీ కష్టం. బహుశా హీరో విజయ్ దేవరకొండకు ఇప్పుడు ఆ సంగతి మిగిలినవాళ్ళందరి కన్నా బాగా తెలుసు. ‘పెళ్ళిచూపులు’తో అందరినీ ఆకర్షించి, ‘అర్జున్ రెడ్డి’తో ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయి, ‘గీతగోవిందం’ సూపర్ హిట్‌తో స్టార్‌గా స్థిరపడ్డ తెలంగాణ కుర్రాడు విజయ్ దేవరకొండ. కానీ, మధ్య మధ్యలోనూ, ఆ తరువాత కూడా వరుస ఫ్లాపులతో కుదేలయ్యాడు. ఆ మధ్య ‘డియర్ కామ్రేడ్’ కూడా నిరాశపరిచింది. మరి, ఈ తాజా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అయినా, ఇటీవలి ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేస్తుందా అన్నది ఇప్పుడు వస్తున్న సందేహం. 

………………………..

చిత్రం – ‘వరల్డ్ ఫేమస్ లవర్’, తారాగణం – విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్ థ్రెసా, ఇజబెల్లా లీటే, సంగీతం – గోపీ సుందర్, కెమెరా – జయకృష్ణ గుమ్మడి, కూర్పు – కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ – కె.ఎస్. రామారావు, నిర్మాత – కె.ఎ. వల్లభ, రచన – దర్శకత్వం – కె. క్రాంతిమాధవ్, రిలీజ్ తేదీ – 2020 ఫిబ్రవరి 14

………………………………

                ఇమేజ్ వచ్చాక, ఆ ఇమేజ్‌ను కాపాడుకొంటూనే ఆ చట్రం నుంచి బయటకు రావడం కూడా కీలకం. కానీ, ఒక వైపు పాపులారిటీ, మరోవైపు కావాల్సినంత వివాదం సంతరించిపెట్టిన ‘అర్జున్ రెడ్డి’ హ్యాంగోవర్ నుంచి ఆ హీరోతో పాటు ఇతర దర్శక, నిర్మాతలు కూడా బయటపడలేదేమో అని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చూశాక అనిపిస్తుంది.

                ఇదో వెబ్ సిరీస్ లవ్ స్టోరీ

                అనుకోకుండా పరిచయమైన గౌతమ్ (విజయ్ దేవరకొండ), కోటీశ్వరుడి (జయప్రకాశ్) కూతురు యామిని (రాశీఖన్నా) చదువుకొనే రోజుల నుంచి గాఢంగా ప్రేమించుకుంటారు. నాలుగేళ్ళ ప్రేమ తరువాత అమ్మాయి తండ్రి కాదనడంతో, అతని పరువు వీధికెక్కకుండా ఏణ్ణర్ధంగా సహజీవనం సాగిస్తుంటారు. రచయిత కావాలనే గౌతమ్ చిరకాల వాంఛకు యామిని ఎంత సహకరించినా, అతను రాయలేకపోతుంటాడు. పైపెచ్చు, యామినితో యాంత్రికంగా బతుకుతుంటాడు. బ్రేకప్ చెప్పేసి, యామిని వెళ్ళాక, రచయితగా తానేంటో ప్రూవ్ చేయాలని కథ రాయడం మొదలుపెడతాడు.  ఇల్లెందు బొగ్గుగనుల్లో పనిచేసే శీను (విజయ్ దేవరకొండ), అతని భార్య సువర్ణ (ఐశ్వర్యా రాజేశ్), వాళ్ళ సాఫీ సంసార జీవితంలో చొచ్చుకువచ్చిన వెల్ఫేర్ ఆఫీసర్ స్మిత (క్యాథరిన్ థ్రెసా)ల కథ రాస్తాడు. ఆ కథలోని మలుపూ అంతే ఆసక్తిగా ముగుస్తుంది. ఇటు నిజజీవితం, అటు రచయితగా ఆయన రాసే కథలోని జీవితాల పడుగుపేకగా సినిమా సాగుతుంది.

                ఇంటర్వెల్ అయ్యాక… యామిని కోసం రెసిషన్‌లో తాను ఉద్యోగం త్యాగం చేయకుండా ప్యారిస్‌కు వెళ్ళి ఉంటే ఏమయ్యేది అనేది గౌతమ్ రాసిన కథలోని రెండో ఎపిసోడ్. ఇది సెకండాఫ్‌లో వచ్చే లవ్ స్టోరీ అన్నమాట. ప్యారిస్‌లో విమాన పైలట్ ఈజా (ఇజబెల్లా లీటే)తో గౌతమ్ ప్రేమలో పడడం, ఆమె కోసం కళ్ళనే దానం చేయడం లాంటివి ఆ కథలో వస్తాయి. ఇదీ రచయితగా గౌతమ్ ఊహా ప్రపంచమే.

                తీరా నిజజీవితంలో యామినికి వేరేవాడితో పెళ్ళి చేస్తున్నారని తెలిసి, వాళ్ళ ఇంటికి వెళతాడు. తరువాత అనుకోని పరిస్థితుల్లో జైలు పాలవుతాడు. ఇంతలో హీరో రాసిన తన నిజజీవిత ప్రేమకథ సహా మిగతా రెండు ప్రేమకథల మేళవింపును హీరో స్నేహితుడు వరల్డ్ ఫేమస్ లవర్ అనే అసంపూర్తి నవలగా ప్రచురిస్తాడు. అది 5 మిలియన్ల కాపీలు అమ్ముడవుతుంది. రెండేళ్ళు జైలులో గడిపి, జనం మధ్యకు వచ్చిన హీరో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జనానికి ఆ నవల ముగింపు ఏమని చెప్పాడన్నది క్లైమాక్స్. ఆ నవల ముగింపుతో పాటు, అతని ప్రేమ జీవితానికి ఎలాంటి ముగింపు వచ్చిందన్నది ఆ పతాక సన్నివేశాల్లో చూడవచ్చు.

                బలమైన కారణం లేకుండానే…

                సినిమా అంతా చూశాక, ఇదొక వెబ్ సిరీస్‌లో ఎపిసోడ్లుగా వచ్చే లవ్ స్టోరీగా అయితే, బాగుండేదేమో అనిపిస్తుంది. అంతగా పరస్పరం ప్రేమించుకున్నా… తీరా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో హీరోయిన్ పట్ల హీరో అంత యాంత్రికంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో బలంగా చూపించలేదు. అలా కథకు బలమైన పునాది మిస్సయింది. ఆ బలం లేకుండా మిగతా పాత్రలు, వాటి ప్రవర్తనలను తీర్చిదిద్దడం సినిమాకు బలమైన లోపం.

                అనివార్యంగా వచ్చే అర్జున్ రెడ్డి పోలికలు…

                 ఈ సినిమా టైటిల్స్‌లో ఎందుకనో తన పేరును దేవరకొండ విజయ సాయిగా మార్చుకొని వేసుకున్న హీరోకు ఇలాంటి పాత్రలు కొత్త కాదు. ఒక విధంగా చెప్పాలంటే, ‘అర్జున్ రెడ్డి’ పాత్రచిత్రణకు ఇంకొక రకమైన కొనసాగింపు ఈ ‘వరల్డ్ ఫేమస్ లవర్‌’లోని పాత్ర. అలాగే, గౌతమ్‌గా హీరో వేషం, పాత్రచిత్రణ అన్నీ మరోసారి ‘అర్జున్ రెడ్డి’ని గుర్తు చేస్తాయి. హెయిర్ స్టయిల్ నుంచి ఆవేశంగా కొట్లాడడం, పెరిగిన గడ్డంతో ఛాతీ మీద ఏ ఆచ్ఛాదనా లేకుండా కనిపించడం లాంటివన్నీ పదే పదే ‘అర్జున్ రెడ్డి’ని గుర్తు చేస్తాయి. అది ఒక విధంగా ప్లస్ అయితే, మరో విధంగా పెద్ద మైనస్. అయితే, ఉన్నంత వరకు సహజంగా నటించడానికి, పాత్రలో ఒదిగిపోవడానికి విజయ్ దేవరకొండ ప్రయత్నించారు. చాలావరకు సక్సెస్ అయ్యారు.

                నలుగురు హీరోయిన్లున్నా…

                ఒకరికి నలుగురు హీరోయిన్లున్న ఈ సినిమాలో ఎక్కువగా గుర్తుండేది ఐశ్వర్యా రాజేశ్ పోషించిన ఇల్లెందులోని గృహిణి సువర్ణ పాత్ర. ఆ పాత్రలో ఆమె కనిపించిన విధానం, మాట్లాడిన తెలంగాణ మాండలికం ఆకట్టుకుంటాయి. ఆ కథకు ముగింపుగా వచ్చే సీన్ హైలైట్. కథాబలంతో నడిచే సినిమాలకూ, అభినయ ప్రధానమైన పాత్రలకూ దక్షిణాది డస్కీ కలర్ బ్యూటీగా ఐశ్వర్యా రాజేశ్ పేరు ఇక దర్శక, నిర్మాతలకు పదే పదే గుర్తుకురావడం ఖాయం. కథకు కీలకమైన గౌతమి పాత్రలో రాశీ ఖన్నా ఫరవా లేదు అన్నట్టే ఉన్నారు. ఇక, బొగ్గు గనుల్లో వెల్ఫేర్ ఆఫీసరైన మహారాష్ట్ర అమ్మాయి స్మితగా కనిపించే క్యాథరిన్ థ్రెసా, ప్యారిస్‌లో విమానపైలట్ ఈజాగా కాసేపు తెరపై వచ్చే నటి ఇజబెల్లా లీటే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి తగిన సీన్లు స్క్రిప్టులోనే లేవు. రచయిత అయిన హీరో పుస్తకం ప్రచురించే స్నేహితుడిగా ప్రియదర్శి, గౌతమి తండ్రిగా తమిళ నటుడు జయప్రకాశ్ (తెలుగు డబ్బింగ్ శుభలేఖ సుధాకర్) లాంటి మిగతా పాత్రలన్నీ నిడివితో సంబంధం లేకుండా కథలో ఊతం కోసం ఉన్నవే.

                ఫీలింగులున్నాయి… ఫీల్ లేదు!

                వాలెంటైన్స్ డే సంస్కృతి పెరిగిన తరువాత, ఈ ప్రేమికుల దినోత్సవానికి ప్రచారం బాగా పెరిగిన తరువాత… ఆ రోజున ఏదో ఒక మంచి ప్రేమకథను రిలీజ్ చేస్తే బాగుంటుందని సినిమా వర్గాల్లో ఆలోచన పెరిగింది. అందుకు తగ్గట్టే తెలుగు సినిమా ప్రియులకు ఈ వాలెంటైన్స్ డే కానుక… వరల్డ్ ఫేమస్ లవర్. దాదాపు ఏణ్ణర్ధం పైగా చిత్ర నిర్మాణంలో ఉన్న ఈ సినిమా… దర్శకుడు క్రాంతిమాధవ్‌ కెరీర్‌కు కూడా కీలకమే. ‘ఓనమాలు’ లాంటి మంచి చిత్రం తరువాత ఆయన తీసిన ‘ఉంగరాల రాంబాబు’ తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో, ఆయన ఈ కొత్త ప్రయత్నం మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమాకు ఎమోషనల్ లవ్ స్టోరీ రాసుకోవాలన్న ఆయన ఆలోచన, అందుకు చేసిన ప్రయత్నం కొంతవరకు బాగున్నాయి. కానీ, ఆ ఆలోచనను పర్ఫెక్ట్ కథగా మలచడంలో, స్లో అనిపించని స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఆయన కొంత తడబడ్డారు. ఈ సినిమాలో చూపించిన ప్రేమలో పాత్రల మధ్య ఫీలింగులే తప్ప, చూసే ప్రేక్షకులకు అడపాదడపా తప్ప, ఆద్యంతం అంత ఫీల్ రాకపోవడం అసలు ఇబ్బంది.

                క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన నిర్మాత కె.ఎస్. రామారావు తన కుమారుడు కె.ఎ. వల్లభను ముందుపెట్టి, ఈ చిత్రాన్ని నిర్మించారు. ఖర్చుకు వెనుకాడకుండా ప్యారిస్ లాంటి చోట్లా సినిమా తీశారు. విజయ్ దేవరకొండకు దక్షిణాది అంతటా ఉన్న క్రేజ్ రీత్యా, తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆ రకంగా సినిమాకు కావాల్సినంత నిర్మాణ విలువలు, బలమైన రిలీజ్ బ్యాకింగ్ దక్కాయి. కానీ, పరిమిత పాత్రలతో సుదీర్ఘ సమయం పాటు కథ నడవడం, పాటల సాహిత్యం, సినిమాలో కొన్ని చోట్ల డైలాగులు అడపాదడపా చాలా బాగున్నా అవన్నీ ఏ ముక్కకు ఆ ముక్కగా ఉండడం మరో ప్రధాన లోపం. నిర్మాణ విలువలు బాగున్నా, సుదీర్ఘంగా సాగే కథలోని లోపాలను అవి కప్పిపుచ్చలేవు కదా! వెరసి, ఇది వరల్డ్ ఫేమస్ వెబ్ సిరీస్ లవర్! కానీ, చూడాల్సింది డబ్బులిచ్చి టికెట్ కొన్న సినిమా ప్రేక్షకులు కదా!! అదే అసలు సమస్య.

                కొసమెరుపు –

                సినిమా చివరలో హీరోతో, హీరోయిన్ చెప్పే డైలాగు… “ఇంటికి రూటు గుర్తుందా?”

                నిదానంగా రెండున్నర గంటలు నడిచే సినిమా చూశాక, భారంగా బయటకొస్తున్న ఫ్రెండ్‌తో మరొకరు కాస్తంత కటువుగా, అచ్చంగా అదే మాట అంటున్నారు… “ఒరేయ్! ఇంటికి రూటు గుర్తుందా?” అవును మరి… నూటయాభై పెట్టి టికెట్ కొన్న ఆడియన్స్ చాలా నిరంకుశులు.

                బలాలు

                …………..

                – పాత్రే తాను అన్నట్టు సహజంగా అనిపించిన విజయ్ దేవరకొండ నటన.

                – సువర్ణ పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ అభినయం. ముఖ్యంగా ఆ ఎపిసోడ్ కథ ముగింపులో ఆమెకూ, హీరోకూ మధ్య జరిగే కళ్ళు చెమర్చే డైలాగ్ డ్రామా.

                – ఇల్లెందు దగ్గర బొగ్గు గనుల్లోని ఎపిసోడ్.

                – తెలుగు నేటివిటీకి దగ్గరైన వాతావరణం, తెలంగాణ మాండలికం వాడిన విధానం.

                బలహీనతలు

                ……………….

                – పాత్రల ప్రవర్తనకు తగ్గట్టు, ముఖ్యంగా హీరో ప్రవర్తనను జస్టిఫై చేసేంత బలమైన కారణం కథలో రాసుకోకపోవడం.

                – హీరో పాత్ర చిత్రణ ప్రేమికుడికీ, పిచ్చివాడికీ, డ్రగ్ ఎడిక్ట్‌కీ సమ్మిళిత రూపం అనిపించడం.

                – సంగీతం. కథలో భాగమైనా, ముక్కలు ముక్కలుగా వస్తూ, పాటలేవీ గుర్తుండేలా లేకపోవడం.

                – కథాగమనం మరీ నిదానంగా సాగడం.

                – ప్యారిస్ ఎపిసోడ్ ముగింపు కానీ, సినిమా ముగింపు కానీ కన్విన్సింగ్‌గా లేకపోవడం.

                పంచ్ లైన్ –

                పాత్రల ఫీలింగులెక్కువ… సినిమాలో ఫీల్ తక్కువ! వీడు వరల్డ్ ఫేమస్ వెబ్ సిరీస్ బాపతు లవర్!!

                రేటింగ్ – 2.25 / 5