‘పలాస’… ఇది బడుగు బతుకుల ఆత్మఘోష! తెలుగు తెరపై కంఠశోష!! – ‘Palasa… 1978’ Movie Review & Rating

1064

కొత్త తరహా సినిమాలు రావాలని కోరుకుంటూ ఉంటాం. మనదైన తెలుగు భాష, యాస, ఘోష చూపించే సినిమాలు రావట్లేదని కోపగించుకుంటూ ఉంటాం. మన జీవితాన్ని సినిమా ప్రతిబింబించి ఎన్నాళ్ళు అయిందంటూ పళ్ళు బిగించుకుంటూ ఉంటాం. అలాంటిది… ఉన్నట్టుండి మన నేటివిటీతో… ఎప్పుడూ ఎక్కువగా చూడని ఉత్తరాంధ్ర… శ్రీకాకుళం తాలూకు మట్టివాసనతో మన సినిమా వస్తే? అదీ ఓ కొత్త దర్శకుడి తొలి చిత్రమైతే? తాజా ‘పలాస… 1978’ చిత్రం అచ్చంగా అలాంటి అనుభవమే. మరి, ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం వెతుకులాడితే…?

………………………………….

చిత్రం – ‘పలాస… 1978’, తారాగణం – రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్దన్, లక్ష్మణ్, శ్రుతి, జగదీశ్, పాటలు – భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల్, సంగీతం – రఘు కుంచె, కెమెరా – అరుళ్ విన్సెంట్, కూర్పు – కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ – తమ్మారెడ్డి భరద్వాజ, కో- ప్రొడ్యూసర్ – మీడియా 9 మనోజ్, నిర్మాత – ధ్యాన్ అట్లూరి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం – కరుణకుమార్, నిడివి – 144 నిమిషాలు, రిలీజ్ తేదీ – 6 మార్చి 2020

…………………………………..

            కొన్ని సినిమాలు శరీర అవయవాలను కదిలిస్తాయి. కొద్ది సినిమాలు మనసును కదిలిస్తాయి. కానీ, అధిక శాతం సందర్భాలలో మెదడుకు… మరో మాటలో బుద్ధికీ, ఆలోచనకూ పని పెట్టవు. అతి కొద్ది సినిమాలు మాత్రమే మనసునూ, మెదడునూ కూడా ఎంగేజ్ చేస్తాయి. చూసిన దృశ్యాలు, అవి సృష్టించిన భావాల తాలూకు ఉద్వేగాల నుంచి అంత తొందరగా బయటకు రానివ్వవు. తేనెతుట్టె కదిలినట్టుగా మెదడులో ఎన్నో ఆలోచనలు, మరెన్నో ప్రశ్నలు రేగుతాయి. ఇటీవలి కాలంలో అలా చేసిన చిత్రం – ‘పలాస… 1978’.

తెలిసిన వ్యధే..! ఊరూరా జరిగిన కథే!!

        కథగా చెప్పాలంటే, ఉత్తరాంధ్రలోని పలాస గ్రామం. ఆ గ్రామంలో చిన్న షావుకారు గురుమూర్తి (కీలక పాత్రలో సంగీత దర్శకుడు రఘు కుంచె), అతని సన్నిహితుడు – మాజీ నక్సలైటు గణప వాసు. వారు కనిపించకుండా పోతారు. వారి అపహరణ/ హత్యల వెనుక ఉన్నది ఒకప్పటి పలాస రౌడీ మోహనరావు (రక్షిత్ అట్లూరి) అని అనుమానం. కానీ, ఆ మోహనరావు అప్పటికి పాతికేళ్ళ క్రితమే ఎన్ కౌంటర్ అయ్యాడని పోలీసు రికార్డు. అసలింతకీ ఏం జరిగింది. ఆ రౌడీ మోహనరావు ఎవరు, అతని కథేమిటి అన్న ఫ్లాష్ బ్యాక్ తో అసలు కథ మొదలు.

            పలాస దగ్గరి అంబుసోలిలోని దళిత కాలనీ నేపథ్యంలో నడిచే కథ ఇది. అక్కడి దళితులు షావుకార్ల జీడిపప్పు పిక్కలు ఒలిచే పనిలో భాగమై, బతుకు సాగిస్తుంటారు. అవసరానికీ, అంగబలానికీ వాళ్ళను వాడుకున్నా… పియ్యెత్తే జాతి వాళ్ళంటూ వారిని అధికారానికి దూరంగానే ఉంచడం అక్కడి రివాజు. వేర్వేరు రాజకీయ పార్టీలలో ఉన్న అన్నదమ్ములు పెద్ద షావుకారు లింగమూర్తి (జనార్దన్)కీ, చిన్న షావుకారు గురుమూర్తి (రఘు కుంచె)కూ మధ్య కుటుంబ తగాదాలు. అధికారం కోసం పోరాటాలు సాగుతుంటాయి.

అగ్రవర్ణాల పోరులో దళిత కాలనీకి చెందిన యువకులు కూడా తెలియకుండానే పావులు అవుతారు. పద్యాలు పాడే ముసలాయన సుందరరావు (సమ్మెట గాంధీ) కొడుకులు రంగారావు (ఆ మధ్య ‘జార్జిరెడ్డి’ చిత్రంలో దుష్టపాత్ర లలన్ సింగ్ గా నటించిన తిరువీర్), మోహనరావు (రక్షిత్) అణగారిన వర్గాలకు చెందినవారు. గజ్జె కట్టి, డప్పు కొట్టి, పాటలు పాడుతూ, ప్రోగ్రాములు ఇస్తూ ఆ ప్రాంతంలోని జనానికి వినోదం పంచి, నాలుగు పైసలు సంపాదించుకుంటూ ఉంటాడు మోహనరావు. అనుకోని పరిస్థితుల్లో… అగ్రవర్ణాల దురహంకారంపై గొంతు విప్పాల్సి వస్తుంది. ఫలితంగా, ఊళ్ళోని పెద్ద షావుకారుకూ, అతని చేతి కింది మనిషి అయిన తమ జాతివాడు బైరాగికీ చెడు అవుతాడు. అనుకోకుండా హత్య చేసి, తానే ఊరికి పెద్ద రౌడీ అవుతాడు. పెద్ద షావుకారు మీద కోపంతో అతణ్ణి తన పంచన చేర్చుకుంటాడు చిన్న షావుకారు.

అటు ఆ షావుకారు అన్నదమ్ముల కుటుంబాల పగలు, ప్రతీకారాలలో, ఇటు మోహనరావు అన్నదమ్ములు, ఆ కుటుంబం ఎలా నలిగిపోయింది, ఏమైందన్నది జరిగిన కథ. ఆ కథ తాలూకు పర్యవసానంగా ఇప్పుడీ చిన్న షావుకారు, తదితరులు కనిపించకుండా పోయారు. పాతికేళ్ళ క్రితం జరిగిన సంఘటనలకూ, ఇప్పటి ఘటనకూ ఏమిటి ముడి అన్నది పతాక సన్నివేశాలు.

చివర కాస్తంత ప్రబోధమే అయినా…

చివరి దాకా కదలకుండా ఆసక్తిగా కూర్చోబెట్టే ఈ చిత్రంలో ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, వాటి స్వభావాల చిత్రణతో క్రమంగా ఆ జీవితాల్లోకి మనల్ని నడిపిస్తాడు దర్శకుడు. ఆ మొత్తం అమితంగా ఆకట్టుకుంటుంది. కథకు కీలకమైన ఘట్టాలు, అసలు ఈ కథ చెప్పడానికి తాత్త్విక భూమిక అంతా సెకండాఫ్‌లో వస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే బావి దగ్గర దళితులను మంచినీళ్ళు తోడుకోనివ్వని సన్నివేశం, సినిమా హాలు దగ్గర టికెట్టు అడిగితే దళిత యువతిని పక్కలోకి రమ్మనే షావుకారు కొడుకు సన్నివేశం లాంటివి కావాల్సిన ఇంప్యాక్ట్ ను సృష్టించిన ఎఫెక్టివ్ సీనుల్లో కొన్ని. అయితే, సినిమా చివరకు వచ్చేసరికి కొంత ప్రబోధాలు, ఉపన్యాసాలు హోరెత్తాయా అని కొందరికి అనిపించవచ్చు. కానీ కథకు అసలు ఆయువుపట్టు ఆ భాగమే. ప్రేక్షకులను ఆలోచనల్లోకి నెట్టేది ఆ భాగమే. దాన్ని అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం చేసి ఉంటే ఎలా ఉండేదన్నది మరో చర్చ. ఏమైనా, దాని కోసం ఈ తొలి చిత్ర దర్శక, రచయితను మరీ తప్పు పట్టలేం.

చాలా సందర్భాల్లో దర్శకుడిలోని రచయిత మేల్కొని, ఆలోచింపజేసేలా పవర్ ఫుల్ డైలాగులు రాశారు. ”నిలబడి ఉన్నోడు కానకుండా… ఆడి ముడ్డి కింద సెడ్డీ లాగీడమే యాపారం” (పెద్ద షావుకారు పాత్ర), ”ప్రెపంచల యుద్దాలన్నీ ముండ కోసం – పదవి కోసం జరిగేయి” లాంటి డైలాగులకు చప్పట్లు కొట్టకుండా ఊరుకోలేం. కథాకాలమైన 1978 నుంచి 1982 – 1990ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా, ఎన్టీఆర్ ‘బొబ్బిలిపులి’ చిత్రం విడుదల, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి పరిస్థితులనూ, దూరదర్శన్ వార్తలనూ సినిమాలో చక్కగా వాడుకున్నారు. కథకూ, సినిమాకూ మరింత సహజత్వం, బిలీవబిలిటీ తేవడానికి అవి తోడ్పడ్డాయి. వాస్తవిక సంఘటనలను కథగా అల్లుకున్నందుకు వెండితెరపై ఆ రకంగా న్యాయం చేశారు.  

వెంటాడే ఆ పాత్రలు… పాత్రధారులు…

        గతంలో ‘లండన్ బాబులు’ చిత్రంలో నటించిన రక్షిత్‌కు ఇది మంచి బ్రేక్ అనే చెప్పాలి. విజయవాడ ప్రాంతానికి చెందిన ‘స్వీట్ మ్యాజిక్’ ఆతిథ్యశాల తాలూకు యజమాని కుమారుడైన రక్షిత్ ఈ పాత్రకు బాగా నప్పాడు. ఆ పాత్రను పూర్తిగా ఒంటపట్టించుకొని మరీ చేశాడు. అతని ప్రియురాలు, ఆ తరువాత భార్య లక్ష్మిగా నక్షత్ర, అతని అన్నయ్య రంగారావు పాత్రలో తిరువీర్, చివరకు పోలీసు ఇన్ స్పెక్టర్ సెబాస్టియన్ పాత్రధారి, ఇంకా ఇతరులు ఆ పాత్రలకు సరిగ్గా సరిపోయారు. సినిమా చూస్తున్నట్టు కాక జీవితాన్ని చూస్తున్న అనుభవాన్ని కలిగించారు. పెద్ద షావుకారు పాత్రలో జనార్దన్ నటన ఓ హైలైట్. చిన్న షావుకారు పాత్రతో రఘు కుంచెలో దాగున్న మంచి నటుడు బయటకొచ్చాడు.

        నిజానికి, ఈ చిత్రంలో నటించిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ పాత్రధారి (నటుడు సుబ్బారావు), రౌడీ బైరాగి లాంటి కొందరు సరిగ్గా ఏణ్ణర్ధం క్రితం వచ్చిన ‘కేరాఫ్ కంచరపాలెం’ (2018 సెప్టెంబర్ 7న రిలీజ్) చిత్రంలో ఆకట్టుకున్నవారే. హీరో పాత్రకు తండ్రిగా, నాటక పద్యాల సుందరరావు పాత్రలో సమ్మెట గాంధీ, పెద్ద షావుకారు భార్య పాత్రలో మరో చిన్నపాత్రల సినీనటి (‘మిర్చి’ మాధవి) – ఇలా కొన్ని తెలిసిన ముఖాలను మినహాయిస్తే, సినిమాలో అధిక శాతం కొత్త ముఖాలే. అయితే, పెద్ద షావుకారు వేషం కట్టిన జనార్దన్ మొదలు దండాసిగా నటించిన లక్ష్మణ్ దాకా ఆ పాత్రలు, పాత్రధారులు అందరూ ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. అది చాలా అరుదైన విషయం. స్థానిక కళాకారులనూ, నాటకాలవాళ్ళనూ తీసుకొని, అంతగా శిక్షణనిచ్చి, సినిమా రూపొందించడం దర్శకుడి ఓర్పుకూ, నేర్పుకూ, అంకితభావానికీ నిదర్శనం.

ప్రాణం పోసిన కెమెరా… నేపథ్య సంగీతం…

        సాంకేతిక విభాగాల పనితనం కూడా ‘పలాస’కు బాగా పనికొచ్చింది. ముఖ్యంగా కెమెరామ్యాన్ అరుళ్ విన్సెంట్ ఈ చిత్రంలోని దృశ్యాలకు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నమైన కొత్త రంగు, రుచి, వాసన తెచ్చారు. సినిమాలో ఆయన కృషి చాలా ఉంది. ఇక, కెమెరాలో బంధించిన ఆ దృశ్యాలు తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకులలో తెలియని ఉద్విగ్నత కలిగేలా ప్రాణం పోసిన వ్యక్తి – నిస్సంశయంగా సంగీత దర్శకుడు రఘు కుంచె. జానపద వాద్యాల మొదలు దేశీయ సంగీత పరికరాలను విరివిగా వినియోగించి, (దాదాపు 40 రోజుల పైగా) ఆయన రీరికార్డింగ్ చేసిన తీరు కీరవాణి లాంటి పెద్ద సంగీత దర్శకులనూ, వారి ప్రతిష్ఠాత్మక చిత్రాల నేపథ్య సంగీతాన్నీ స్ఫురణకు తెచ్చింది. అలా ఈ ‘పలాస’కు ఈ రెండు సాంకేతిక విభాగాలూ పెద్ద బలం.

ఉత్తరాంధ్ర జానపద శైలికి తాజా నీరాజనం

టైటిల్‌కు తగ్గట్టే ఆ శ్రీకాకుళం ప్రాంతం, అక్కడి స్థానిక కళాకారులు, కళారూపాలను ఈ చిత్రంలో తెరపైకి తెచ్చారు. ఆ పాటలు, మాటలు, ఆటలు మనల్ని మళ్ళీ ఉత్తరాంధ్ర మారుమూలల్లోకి తీసుకుపోతాయి. భాస్కరభట్ల రాసిన ‘ఏ ఊరు ఏ ఊరు…’ (గానం – విజయలక్ష్మి, రాజు జముకు అసిరయ్య), అలాగే లక్ష్మీభూపాల్ రాసిన ప్రణయ గీతం ‘ఓ సొగసరి’ (గానం – ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పసల బేబీ)  ఆకట్టుకుంటాయి. ఉత్తరాంధ్ర జానపద శైలిని ప్రతిబింబించిన ‘పక్కన పడ్డాది చూడరో పిల్లా… నాది నక్కిలీసు గొలుసు…’ (గానం – రఘు కుంచె) వింటున్నా, చూస్తున్నా కొత్త హుషారు తెప్పిస్తుంది. ‘బావొచ్చాడే లప్పా బావొచ్చాడే…’ (గానం – అదితి భావరాజు) పాట మాస్‌కు నచ్చే పాట. ఈ హుషారైన జానపదశైలి గీతాలతో పాటు సెకండాఫ్ లో సందర్భాన్ని చూసుకొని, ఎక్కడైనా కరుణ రసాత్మక ఉత్తరాంధ్ర గీతం పెట్టినా బాగుండేదేమో అనిపిస్తుంది. విడిగా ఆల్బమ్ లో విన్న కొన్ని పాటలు నిడివి సమస్య వల్ల సినిమాలో కోతకు గురైనట్టున్నాయి. మొత్తానికి, రైలులో పాడుకొనే అంధ గాయకుడి దగ్గర నుంచి మామూలు పనిపాటలతో బతుకుతూ, ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన గాయని పసల బేబీ దాకా… మట్టిలో మాణిక్యాలతో ఈ పాటలు పాడించడం విశేషం.

ఇది… మరో ‘రంగస్థలం’! ఇంకో ‘అసురన్’!!

దళితుల అణచివేత, అగ్రవర్ణాల దురహంకారం, వారి రాజకీయాలు – వగైరా సమాజంలోనూ, వాటి చిత్రణ సినిమాల్లోనూ కొత్త కాదు. కాకపోతే, శ్రీకాకుళం నేపథ్యం, అక్కడి వాస్తవిక పరిస్థితుల చిత్రణ – ఈ కథను మరో మెట్టు పైకి తీసుకెళ్ళింది. పరువు హత్య అంశాన్ని తీసుకొని, ఇలాంటి నేపథ్యంలోనే వచ్చిన కమర్షియల్ చిత్రం ‘రంగస్థలం’ కానీ, త్వరలో వస్తున్న హీరో వెంకటేశ్ ‘నారప్ప’కు మూలమైన తాజా తమిళ సంచలనం ‘అసురన్’ కానీ – ఇలాంటి తరహా ఇతివృత్తాలనే చూపించాయి. ‘రంగస్థలం’ కొంత పైపూతలతో చెబితే, పంటలను పాడు చేసే అడవి పందులను వేటాడే మనుషుల కథగా తమిళ కల్ట్ క్లాసిక్ ‘అసురన్’ ఆ సంగతినే  పూర్తి రస్టిక్ ‌గా చెప్పింది. చాలా కాలం క్రితమే స్క్రిప్టు సిద్ధమై, నిర్మాణం జరిగాక కూడా రిలీజుకు నెలల తరబడి వేచి చూసిన ‘పలాస’ చిత్రాన్ని చూస్తున్నప్పుడు సరిగ్గా మనకు ‘రంగస్థలం’, ‘అసురన్’ లాంటివి గుర్తొస్తాయి. అయితే, దేని ఎమోషన్ దానిదే. దర్శకులు సుకుమార్, తమిళ వెట్రిమారన్‌ల సినీ అనుభవం లేకపోయినా దర్శకుడిగా మారిన కథా రచయిత కరుణకుమార్ తన జీవితానుభవాన్ని నిజాయతీగా తెరపైకి తెచ్చారు. చూసినంత సేపూ ఆ పాత్రల మానసిక స్థితిలో మమేకమయ్యేలా చేశారు.

తెలుగు తెరపై… ఇంత రియలిస్టిక్ చిత్రణా?

దళితుల జీవితాలపై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ అంశంపై మరోసారి ఫోకస్ లైట్ వేయడానికీ, అంబేద్కర్ ఆలోచనా ధారను వెండితెరపై ముందుకు తీసుకువెళ్ళడానికి ఇప్పటికీ తమిళంలో పా. రంజిత్ లాంటి దర్శకులు (రజనీకాంత్‌తో ‘కబాలి’, ‘కాలా’ లాంటి ఇటీవలి చిత్రాలు తీసిన దర్శకుడు) కృషి చేస్తున్నారు. తెలుగులో ఆ కృషి ఇటీవల అరుదైపోయిన సందర్భంలో కరుణకుమార్ పెట్టిన పొలికేక – ‘పలాస’. వర్ణవివక్ష, బలహీన వర్గాల అణచివేత, బానిసల లాంటి విశ్వాసపాత్రుల బతుకులు, అన్నదమ్ముల ప్రేమ, అంతలోనే పొరపొచ్చాలు, ప్రేమ, పరాయి స్త్రీలపై మోజు, అంటరానివారని అంటూనే వారిని ఉంచుకోవడానికి అడ్డురాని షావుకార్ల కుల వివక్ష, హింస, హత్యలు, పగలు, ప్రతీకారాలు, ఎత్తులు పైయెత్తులు, కులం – జాతి విషయం వచ్చేటప్పటికి మారిపోయే మానవ స్వభావాలు, అనుబంధాల లాంటివి చూసినప్పుడు ఇదో మానవ జీవిత ఇతిహాసంగా అనిపిస్తుంది. ఏ మహాభారత కథో చదువుతున్నామనిపిస్తుంది. అచ్చంగా ఓ మంచి నవలను తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. శ్రీకాకుళం ప్రాంతంలోని ఆ ఊళ్ళ పేర్లు, కాళింగులు, కాపులు, వెలమల ప్రస్తావన, శ్రీకాకుళం యాసలోని ఆ మాటలు, ఆ చిత్రణ చాలా రియలిస్టిక్ ‌గా అనిపిస్తుంది. వాస్తవిక చిత్ర ధోరణికి ఇది ఓ తాజా ఉదాహరణగా నిలుస్తుంది. సినీ ప్రేమికులకు తెలిసేలా చెప్పాలంటే – అన్ని రకాల పోలికలూ లేకపోయినా, ఇవాళ ‘పలాస’ను తెలుగు సమాజపు ‘అసురన్’ అని అభివర్ణించవచ్చు.

బాక్సాఫీస్ బేతాళ ప్రశ్నలు…

విడుదలకు కష్టాలు ఎదుర్కొని, చివరకు మీడియా 9 మనోజ్ కు థియేట్రికల్ రైట్స్ ఇచ్చి, సురేశ్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా విడుదల కావడం – మన తెలుగు సినిమా బాక్సాఫీస్ వాస్తవాలకు ప్రతీక. మరి, అప్పటి చుండూరు, కారంచేడు, పదిరికుప్పం ఘటనల నుంచి ఆ మధ్య శ్రీకాకుళం దగ్గరి లక్ష్మింపేట దళితుల ఊచకోత దాకా ఎన్నో నిజజీవిత చేదు వాస్తవాలున్న మన సమాజం… ఇప్పటికీ ఈ ‘పలాస’ లాంటి పచ్చి నిజాన్ని, వెండితెరపై తన వికృత నెత్తుటి స్వరూపాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నదా? వినాయకుడి తలను అతికించడానికే తప్ప, ఏకలవ్యుడి బొటనవేలు అతికించే దేవుడు ఏడీ, లేడేమిటన్న ప్రశ్నను మనకు మనం వేసుకోవడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నామా? ఏ మార్పుకైనా చదువు, జ్ఞానం అవసరమంటున్న ఇలాంటి సినిమాల్ని చూడాల్సిందీ, మారాల్సిందీ ఎవరు – కేవలం దళితులా, సమస్త దళితేతరులా? కరోనా వైరస్ కన్నా తీవ్రంగా బాధిస్తున్న కనిపించని కుల వైరస్ బాధిత సమాజంలో… వెక్కిరిస్తున్న బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి బేతాళ ప్రశ్నలెన్నో!

……………….

బలాలు

  • సహజత్వానికి దగ్గరగా ఉంటూ, ప్రాంతీయ తెలుగు భాష, సంస్కృతితో మనదైన నేటివిటీని తెరపైకి పట్టుకురావడం.
  • కథలోనూ, కథనంలోనూ ఉన్న నిజాయతీ, కమర్షియల్ సినిమాటిక్ లైసెన్స్ కోసం పంథా మార్చకపోవడం
  • కెమెరా వర్క్, సంగీతం, మరీ ముఖ్యంగా సహజమైన జానపద సంగీత వాద్యాలతో సంగీత దర్శకుడు రఘు కుంచె అందించిన నేపథ్య సంగీతం. ఉత్తరాంధ్ర జానపద శైలి గీతాలు.
  • ఫస్టాఫ్‌. అలాగే, సెకండాఫ్‌ లోని ఆలోచన రేకెత్తించే సన్నివేశాలు, డైలాగులు.

బలహీనతలు

  • చేదు నిజాలనూ, హత్యా రాజకీయాలనూ, హింసనూ పచ్చిగా చూపించడం. అది కుటుంబ ప్రేక్షకులనూ, అన్ని ప్రేక్షక వర్గాలనూ ఆకర్షించకపోవచ్చు.
  • సినిమా ఎంగేజింగ్‌గా సాగినా, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ కోసం వెతికితే ఎదురయ్యే నిరాశ.
  • సెకండాఫ్ చివరలో కాస్తంత సుదీర్ఘమనిపించే కులాలు, వర్గాల చర్చ.
  • దళిత, అంబేద్కరిజమ్ సిద్ధాంతాలకు మెయిన్ స్ట్రీమ్‌ తెలుగు సినిమాలోనూ, ప్రేక్షక వర్గాలలోనూ ఉన్న పరిమితులు.

…………………

పంచ్ లైన్ –

        ‘పలాస…1978’… ఇది బడుగు బతుకుల ఆత్మఘోష. తెలుగు తెరపై అరుదైన కంఠశోష.

రేటింగ్ – 3.25/ 5