Kaamyaab review and rating

188
kaamyaab movie review

ఊరు పేరు లేని న‌టుల‌తో తీసే చిన్న చిత్రాలు స‌గ‌టు ప్రేక్ష‌కుడిని ఆక‌ట్టుకోవ‌డం ఇప్ప‌టి ప‌రిస్థితుల్లో చాలా క‌ష్ట‌మే. క‌థ‌, క‌థ‌నాలు గొప్ప‌గా ఉన్నా కూడా గుర్తింపుకు నోచుకోవ‌డం మ‌రీ ట‌ఫ్. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కుడిని సినిమా హాల్‌కు ర‌ప్పించేంత‌గా మీడియాలో ప్ర‌చారం జ‌రిగితే అందులో ఏదో ఒక మ్యాజిక్ ఉండాల్సిందే. అలాంటి మ్యాజిక్‌ను సొంతం చేసుకొని తాజాగా హిందీలో సినీ విమ‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తున్న చిత్రం కామ్‌యాబ్‌. ఈ చిత్రానికి షారుక్ ఖాన్ దంప‌తులు నిర్మాతలు కావ‌డంతో సినిమాపై మ‌రింత‌ బ‌జ్ క్రియేట్ అయింది.

కామ్‌యాబ్ న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. పెద్ద‌గా గుర్తింపు లేని సీనియ‌ర్ యాక్ట‌ర్ సంజ‌య్ మిశ్రా కీల‌క పాత్ర‌ధారి. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఇషా త‌ల్వార్ మ‌రో పాత్ర‌లో క‌నిపిస్తారు. అంత‌కు మంచిపెద్దగా గుర్తుంచుకొనే నటీన‌టులు తెర‌మీద క‌నిపించ‌రు. పాత్ర‌లే క‌థ‌ను న‌డిపించేలా స్క్రిప్టును రాసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు హ‌ర్థిక్ మెహ‌తా త‌న ప్ర‌తిభ‌ను చాటుకొన్నారు. హిందీ మీడియాలో ప్ర‌శంస‌లు అందుకొంటున్న ఈ సినిమా క‌థ ఏమిట‌ని అడిగితే..

బాలీవుడ్ సుధీర్ (సంజ‌య్ మిశ్రా) సీనియ‌ర్ న‌టుడు. 499 సినిమాల్లో ప్రేక్ష‌కులను రంజింప చేసిన పాత్ర‌ల్లో న‌టించిన ఘ‌న‌త‌ను సొంతం చేసుకొంటారు. ఓ కార‌ణంగా సినిమాల‌కు దూరంగా ఉండాల్సి వ‌స్తుంది. మ‌ద్యానికి బానిస ఒంట‌రి ప్ర‌పంచంలో బ‌తుకుతుంటాడు. అలా సినిమాల నుంచి పూర్తి రిటైర్ అయ్యాడ‌నుకొనే ద‌శ‌లో మ‌ళ్లీ రీ ఎంట్రీకి ప్ర‌య‌త్నిస్తాడు.

సినిమాల‌ను వ‌దిలేసి శేష జీవితాన్ని గ‌డుపుతున్న సుధీర్ మ‌ళ్లీ ఎందుకు రావాల‌నుకొన్నాడు? సినీ వేషాల కోసం ప్ర‌య‌త్నాలు చేసే క్ర‌మంలో ఎలాంటి అవ‌మానాలు ఎదుర్కొన్నాడు? సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి కార‌ణ‌మైన త‌న కోరిక తీర్చుకొన్నాడా? సొంత కూతురుతో విభేదాలు రావ‌డానికి కార‌ణ‌మేమిటి? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే కామ్‌యాబ్ చిత్ర క‌థ‌.

సినీ ప్ర‌పంచానికి దూరంగా బ‌తుకున్న సుధీర్‌ను ఓ టెలివిజ‌న్ ఛానెల్ ఇంట‌ర్వ్యూ లాంటి ఆస‌క్తిక‌ర‌మైన‌ త‌తంగంతో క‌థ మొద‌లవుతుంది. కొన్ని ప‌రిస్థితులు సినిమా వైపు వెళ్లేలా ముందుకు తోస్తాయి. ఆ క్ర‌మంలో ఎదురైన ప‌రిస్థితులు, అవ‌మానాలు త‌న‌పై త‌న‌కే అస‌హ‌నం క‌లిగేలా చేస్తాయి. కూతురుతో విభేదాలు చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటాయి. అలాగే ప‌క్కింట్లో ఉండే ఔత్సాహిక సినీ తార (ఇషా త‌ల్వార్‌) పాత్ర కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మ‌న‌వ‌రాలితో కూడిన‌ క్లైమాక్స్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడిని క‌దిలించేలా ఉండటంతో సినిమా ఫీల్‌గుడ్ గా మారిపోతుంది.

కామ్‌యాబ్ చిత్రాన్ని పూర్తిస్థాయిలో భుజాన మోసింది సంజ‌య్ మిశ్రానే. ప్ర‌తీ ఫ్రేమ్‌లోను అద్భుతంగా న‌టించి, హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించి స‌త్తా చాటుకొన్నాడు. ప‌లు ర‌కాల గెట‌ప్స్‌లో క‌నిపించి వినోదాన్ని పండించ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యాడు. ఈ చిత్రానికి క‌ర్త, క‌ర్మ, క్రియ ఆయ‌నే చెప్ప‌డానికి సందేహం అక్క‌ర్లేదు.

కామ్‌యాబ్ సినిమాను ఫీల్‌గుడ్‌గా మ‌ల‌చ‌డంలో వంద‌శాతం క్రెడిట్ ద‌ర్శ‌కుడికే ద‌క్కుతుంది. మౌస‌మ్‌, లుటేరా, క్వీన్ చిత్రాల‌కు స్క్రిప్టు కోర్డినేట‌ర్‌గా ప‌నిచేసిన హ‌ర్థిక్ మెహ‌తా రాసుకొన్న క‌థ బాగుంది. క‌థ‌నం కూడా ఇంట్రెస్టింగ్ సాగుతుంది. ప‌లు సీన్లు వినోదంతోపాటు భావోద్వేగాన్ని పండించ‌డంలో త‌న మార్కు చాటుకొన్నారు.

సంజ‌య్ మిశ్రా యాక్టింగ్, ద‌ర్శ‌కుడు హ‌ర్ధిక్ మెహ‌తా క‌థ‌, క‌థ‌నాల‌కు Only reviews ఇచ్చే రేటింగ్ 2.75/5