Jaanu Movie Review and Rating: మరీ ఇంత స్లో గానా… ‘జాను’ !

168
Jaanu movie
Jaanu Movie reveiw

లోటుపాట్ల మాటెలా ఉన్నా… కొన్ని కథల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. తెరపైకి వచ్చినప్పుడు కొన్ని సినిమాల్లోనూ అలాంటి ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. కానీ, ఆ మ్యాజిక్ మళ్ళీ మళ్ళీ తెరపై రీక్రియేట్ అవుతుందా, చేయగలమా? అదే సినిమాను రీమేక్ చేస్తూ, అదే కథతో, అచ్చం అలాగే తీసినా, అలాంటి భావోద్వేగాలే ప్రేక్షకులలో కలుగుతాయా? ఏమో…! ఇవన్నీ బేతాళప్రశ్నలు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించగా గుండెలు పిండేసిందంటూ, అందరూ సూపర్ హిట్‌గా నిలిపిన ’96’ చిత్రం ఇప్పుడు తెలుగులో శర్వానంద్, సమంతతో ‘జాను’గా వచ్చింది. దాంతో, ఇలాంటి ఆలోచనలు ఎన్నో మనసులో రేగుతాయి.

రేటింగ్ – 2.25 / 5

………………………….
చిత్రం – జాను, తారాగణం – శర్వానంద్, సమంత, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేశ్, అడిషనల్ డైలాగ్స్ – మిర్చి కిరణ్, సంగీతం – గోవింద్ వసంత, పాటలు – సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి, కెమెరా – మహేంద్రన్ జయరాజు, ఆర్ట్ – రామాంజనేయులు, కూర్పు – కె.ఎల్. ప్రవీణ్, కో- ప్రొడ్యూసర్ – హర్షిత్ రెడ్డి, నిర్మాతలు – రాజు – శిరీష్, రచన – దర్శకత్వం – సి. ప్రేమ్ కుమార్, రిలీజ్ తేదీ – 2020 ఫిబ్రవరి 7
………………………………

కథ చాలా చిన్నదే…

అనగనగా పదోతరగతిలో ఒకే సెక్షన్‌లో చదువుకుంటున్న ఓ అబ్బాయి (కె.రామచంద్రగా శర్వానంద్), సినీ గాయని జానకిలా బ్రహ్మాండంగా పాడే ఓ అమ్మాయి (ఎస్. జానకీదేవి అలియాస్ జానుగా సమంత). వాళ్ళ మధ్య ఆ వయసులో కలిగే తొలి ఆకర్షణ. అది ప్రేమగా హృదయంలో బలంగా నాటుకొందని అనుకుంటూ ఉండగానే, ఆ టెన్త్ క్లాస్ స్టూడెంట్లు ఇద్దరూ అనుకోకుండా విడిపోతారు. కుటుంబ ఇబ్బందులతో అబ్బాయి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. అమ్మాయి వైజాగ్ లో ఉండిపోతుంది. అలా వేర్వేరు ఊళ్ళలో పెద్దవుతారు. ఆ తరువాత చాలా ఏళ్ళు కలుసుకోరు. ఆ అమ్మాయికి వేరొకరితో పెళ్ళయి, ఒక పిల్ల కూడా. సింగపూర్‌లో భర్తతో ఉంటూ ఉంటుంది. అబ్బాయి ట్రావెల్ ఫోటోగ్రఫీలో పేరున్న ఫోటోగ్రాఫర్‌గా ఒంటరి జీవితం గడుపుతుంటాడు. దాదాపు 15 ఏళ్ళు (హీరోయిన్ మాటల్లో కొన్నిసార్లు చెప్పినట్టయితే 17 ఏళ్ళు) తరువాత స్కూల్ బ్యాచ్ మేట్ల రీయూనియన్‌లో కలుస్తారు. అప్పటికే పెళ్ళయిన హీరోయిన్, పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచారిగా, ఒంటరిగా మిగిలిపోయిన హీరో. ప్రేమను మరచిపోలేని ఆ పాత ప్రేమికులిద్దరూ తమ పాత కథను, కలుసుకోకపోవడానికి కారణాలనూ కలసి కలబోసుకుంటే ఎలా ఉంటుంది! అదే ‘జాను’.

చాలామందికి స్వీయ జీవితానుభవమైన మామూలు చిన్న అంశమే ఈ సినిమా కథ. కాకపోతే, దాన్ని రకరకాల సన్నివేశాలు, సుదీర్ఘ సంభాషణలు, అక్కడక్కడే తిరిగే కథాకథనంతో దాదాపు రెండున్నర గంటల సినిమా తీస్తే? ఇతివృత్తం రీత్యా ‘జాను’ సినిమాకు ఎంత బలం ఉందో, దాన్ని అంతసేపు, ఆశించినంత ఫీల్ లేకుండా చిత్రీకరించడంలో అంత బలహీనత కూడా వచ్చి చేరింది.

బాగున్నారు కానీ… ఆ మ్యాజిక్ ఏదీ?

అభాసు పాలు కాకుండా, అశ్లీలం అనిపించకుండా ఇలాంటి ఇతివృత్తాన్ని తెరపై చెప్పడం కత్తి మీద సామే. దాన్ని దర్శక, రచయిత సమర్థంగా నిర్వహించారు. అందులో సందేహం లేదు. శర్వానంద్, సమంతలకు ఇవి కొంత క్లిష్టమైన పాత్రలు. మెప్పించడానికి ఇద్దరూ బాగానే ప్రయత్నించారు. ఇద్దరూ బాగా చేశారని అనిపించినా, ఎందుకనో గుండెను తాకలేకపోయారు. సినిమా సినిమాకూ రకరకాల సౌందర్య చికిత్సలతో మారిపోయే సమంత ఈ సినిమాలోనూ కొత్తగా కనిపించింది. కానీ, ఎందుకో ఆమెలో మునుపటి మ్యాజిక్ కొంత మిస్సయిన ఫీలింగూ కలిగింది. రీయూనియన్ సీన్ లాంటి చోట్ల మరీ తెల్లటి మేకప్‌తో కొంత పరాయిభావన కలిగేలా ఉన్నారు.

వెన్నెల కిశోర్, మరీ ముఖ్యంగా హీరో – హీరోయిన్ల స్కూల్ ఫ్రెండ్ సుభాషిణి పాత్రధారిణి, అలాగే హీరో దగ్గర కెమేరా నేర్చుకొనే అమ్మాయి పాత్రధారిణి (వర్ష బొల్లమ్మ) లాంటి వారు బాగా చేశారు. క్యారెక్టరైజేషన్ రీత్యా జనంలో గుర్తింపు పొందుతారు. తనికెళ్ళ భరణి కనిపించిన కాసేపూ తెలంగాణ మాండలికంలో ముద్దుగా అనిపిస్తారు.

తప్పెక్కడ జరిగిందంటే…

ప్రధానంగా రెండు పాత్రల చుట్టూరానే కథ తిరగడం, మరీ స్లో నేరేషన్ ఈ సినిమాకు ప్రధాన శత్రువులు. సినిమా మొదలైన యాభై నిమిషాలకు కానీ హీరోయిన్ పేరు కానీ, ఆ పాత్రలో ఆమె తెర మీద కానీ కనిపించరు. గంటా ఇరవై నిమిషాలు దాటేశాక, అప్పుడే కథ కొద్దిగా రసపట్టులో పడుతోంది అనుకుంటున్న టైమ్‌లో ఉన్నట్టుండి ఇంటర్వెల్ కార్డు పడి, హతాశుల్ని చేస్తుంది. సెకండాఫ్ మొదలయ్యాక కూడా హీరో, హీరోయిన్ల రాత్రి జాగారంతో ఎంతసేపటికీ ఈ సీన్లు, సినిమా అవవేమిటి చెప్మా అనిపిస్తుంది.

కెమెరా వర్క్, నిర్మాణ విలువలు బాగానే ఉన్నా, కథనంలోనే ఉన్న అతి నిదానం వల్ల అవార్డు విజేత ప్రవీణ్ ఎడిటింగ్ కూడా కుంటుపడింది. అక్కడక్కడ నేపథ్య సంగీతంలో వాడిన వేణువు, పియానో లాంటివి బాగున్నాయి. కానీ, సినిమాలో చాలా సేపు డైలాగుల్లో మాటే తప్ప సంగీతం వద్దనుకోవడంతో, సన్నివేశాలు మరీ ఫ్లాట్ అయిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఒకే సందర్భానికి పొడిగింపుగా ఆరు పాటలూ అనిపించడం, అన్నీ ఒకే ధోరణిలో సాగడం, పాటలు పాడుకొనేలా లేకపోవడం మరో మైనస్.

జవాబులు లేని ప్రశ్నలెన్నో…

హీరోయిన్ ఉన్న ఊళ్ళో లేకుండా, తాను దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయినా, ఆమె గురించి అనుక్షణం తెలుసుకుంటూనే ఉన్నానంటూ, ఆమెకు ఎప్పుడు ఏ జబ్బు వచ్చిందో, ఎప్పుడు ఏ చీర కట్టిందో కూడా హీరో ఏకరవు పెడతాడు ఒక సీన్‌లో. ఆమె వెన్నంటే ఉండి ఆమెను గమనించానంటాడు. అంత చేసిన హీరో, తాను ప్రేమించిన అమ్మాయికి ఎందుకు ఎప్పుడూ ఎదురుపడడో, మనసులో మాట చెప్పలేకపోయినా కనీసం మనిషిగా ఎదురుపడడానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థం కాదు. ప్రేమించిన అమ్మాయితో మాట్లాడకపోతే పోయె… అదే క్లాసులో తమకు మధ్యవర్తిలా వ్యవహరిస్తూ, తాను చెల్లిగా భావించిన సుభాషిణి పాత్రతో కానీ, ఇతర స్నేహితులతో కానీ మాట్లాడడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి. అలాంటప్పుడు డిగ్రీ సెకండియర్‌లో మటుకు హీరోయిన్‌ను కలవాలని ఎందుకు కాలేజీకి వచ్చినట్టు. ఇలాంటి ప్రశ్నలు సగటు ప్రేక్షకులకు వస్తే, తప్పు పట్టలేం.

అలాగే, ప్రేమ గురించి ధైర్యంగా నోరు విప్పి చెప్పలేని హీరోను అంత గాఢంగా ప్రేమించిన హీరోయిన్ టీసీ తీసుకెళ్ళాడని తెలిసిన ఒక్కసారి తప్ప ఆ తరువాత ఎక్కడా అతని కోసం వెతికినట్టు కనిపించదు. ఈ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ అంతా ఏమైందో తెలీదు. పాటలు పాడడం మానేసి, జీవితంలో నవ్వును మరిచిపోయి, అశోకవనంలో సీతలా మారిపోవడానికే పరిమితమవుతుంది.

సినిమాలోని కీలకమైన ట్విస్టు కోసం చాలా కన్వీనియంట్‌గా ఆ ప్లాట్ అంతా అల్లుకున్నారనిపిస్తుంది. కాలేజీలో హీరోయిన్, హీరోల ఒక్క సీన్‌ను హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, చివరకు హీరోయిన్ ఊహల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం బాగానే ఉంది. కానీ, ఒక దశ దాటాక అప్పటికే ముందుకు కదలని కథతో సీట్లలో తామే అటూ ఇటూ కదులుతూ, మెసులుతున్న ప్రేక్షకులకు ముచ్చటగా మూడోసారి ఆ సీన్ వచ్చేసరికి, అనుభూతి బదులు అసహనం అనిపిస్తుంది. ఆ ప్రమాదం మల్టీప్లెక్స్ థియేటర్లలో సైతం కనిపించేస్తోంది.

ఈ తప్పులు ఎందుకు చేశారో…

1996 నాటి టెన్త్ క్లాస్ ప్రేమకథగా తమిళ మాతృక ’96’ వచ్చినట్టు ఆ టైటిల్‌ను బట్టే అర్థమైపోతుంటుంది. కానీ, ఈ తెలుగు రీమేక్‌ను ఎందుకనో 2002లో టెన్త్ క్లాస్, 2004లో ఇంటర్ పాసై అయిన బ్యాచ్ తాలూకు కథగా చూపించారు. కానీ, సినిమాలో చూపించిన ఆ సి.ఆర్.టి (క్యాథోడ్ రే ట్యూబ్) టీవీలు, దూరదర్శన్ చిత్రలహరి పాటల లాంటివన్నీ 2000కే దాదాపు దూరమై పోయిన సంగతులని మర్చిపోయారు. ఇక, ఆ టైమ్‌కు స్కూలు పిల్లలు ఇంకుపెన్నులు ఎక్కడ వాడుతున్నారో, లాస్ట్ వర్కింగ్ డే నాడు ఇంకులు జల్లుకోవడం ఎక్కడ ఉందో తెలియదు. ఈ టెన్త్ క్లాస్ కథకు విశాఖపట్నం లాంటిన నగరం కాకుండా, రూరల్ టచ్ ఉన్న కాకినాడ, భీమవరం లాంటి ఏ ద్వితీయశ్రేణి పట్నాన్నో ఎంచుకొని ఉంటే, కొంత మేక్ బిలీవబులిటీ వచ్చి ఉండేదేమో!

వెరసి… ‘జాను’ బాగుందని చెప్పలేం. అలాగని అసభ్యత లేని ఈ రేజర్ ఎడ్జ్ లవ్ స్టోరీని రొటీన్ బోరింగ్ కమర్షియల్ మాస్ మసాలా సినిమాలతో సరిసమానంగా చెత్త అనలేం. అక్కడక్కడి మెరుపులతో ఇదో సమ్మిశ్రిత అనుభూతి. ఆల్రెడీ తమిళ మాతృక చూసేసినవారికి, ఇది ఆ స్థాయిలో లేని వంటకం. అందుకే, ఎవరికి వారు చిన్ననాటి ఫీలింగుల కోసం వెతుక్కుంటూ… కొన్నిసార్లు తెరపై చూపిస్తున్నా లోపల నుంచి మనకు రావట్లేదేమిటా అని లోలోపల ఫీలవుతూ… ఆ మాటే గట్టిగా చెబితే శీలాన్ని శంకిస్తారేమోనని భయపడుతూ… ముందుకు కదలని కథ, కథనం చాలాసార్లు విసిగిస్తుంటే సీటులోనే ఆపసోపాలు పడుతూ… కదలకుండా చూడాల్సిన ఫీల్ గుడ్ సినిమా ‘జాను’.

కొసమెరుపు:

సినిమాహాలులో… పక్కన కూర్చున్న ఇద్దరి సంభాషణ…
ఒకడు… ‘ఏరా… టికెట్లు నువ్వే కొన్నావుగా’ అని అడిగాడు. ‘అవును. ఏం అన్నాడు’ రెండో అతను. ‘ఆ… ఏమీ లేదు. టికెట్‌తో పాటు చేతిలో ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ ఉన్న రిమోట్ ఇవ్వలేదా, నువ్వు హాలులోకి తేలేదా’ అని ముక్తాయించాడు మొదటి వ్యక్తి. అదీ ‘జాను’ పరిస్థితి.
………………………………

బలాలు…

– అనేకమందికి స్వీయానుభవమైన ఇతివృత్తం, భావోద్వేగం

– హిట్టయిన మాతృక, దాన్ని వీలైనంత యథాతథంగా అందించే ప్రయత్నం

– కష్టపడి నటించిన శర్వానంద్, సమంత

– హీరో క్లాస్ మేట్ అయిన సుభా పాత్ర, అలాగే హీరో దగ్గర కెమేరా నేర్చుకొనే అమ్మాయి పాత్ర, వాటిని అభినయించిన యాక్టర్ల ఈజ్ నెస్.
……..

బలహీనతలు…

– ఎంతసేపటికీ ఏ మాత్రం ముందుకు కదలని కథ

– అప్పటి ‘నా ఆటోగ్రాఫ్’ నుంచి ఇటీవలి ‘ప్రేమమ్’… దాకా అనేక సినిమాల రీవిజిట్ పాయింట్ అనిపించడం

– అన్ని పాటలూ ఒకే ధోరణిలో వెళ్ళడం, ఒకే పాటకు అయిదారు కొనసాగింపులా ఉండడం. పాటలేవీ పాడుకొనేలా లేకపోవడం.

– స్కూల్ ఎపిసోడ్ వచ్చే వీర స్లో ఫస్టాఫ్.

– పాత్రలు పెద్దయ్యాక ఎదురైన ఘర్షణతో సాగే సెకండాఫ్ కన్విన్సింగ్ గా కన్నా కన్వీనియంట్ స్క్రీన్ ప్లే అనిపించడం.

– తమిళ సినిమాకు అనువాదంగా మారిన డైలాగులేవీ గుండెకు హత్తుకోకపోవడం.
……..

పంచ్ లైన్

సారీ! అనుకున్నంత లేదు జాను…!!

……………………

రేటింగ్ – 2.25 / 5