వెండితెరపై వెబ్ సిరీస్ థ్రిల్లర్… ‘హిట్’ – ‘Hit’ movie review and rating

212

         సరైన పద్ధతిలో రాసుకొని, సరిగ్గా తీయాలే కానీ… క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఎప్పుడూ ఆసక్తిగా అనిపిస్తాయి. తరువాత ఏం జరగబోతోంది? అసలు నేరస్థుడు ఎవరై ఉంటాడు? లాంటి ప్రశ్నలు హాలులో కూర్చొని, సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఆద్యంతం వెంటాడుతూనే ఉంటాయి. దర్శకుడు ఆ సస్పెన్స్ ను కొనసాగిస్తూ, ప్రేక్షకులకు జవాబులు ఓ పట్టాన అంతు చిక్కకుండా ఆ పజిల్స్ అలా కొనసాగుతూ ఉండేలా చూస్తే చాలు. ఆ చిక్కుప్రశ్నలకు జవాబులను ఎవరికి వారు ఎప్పటికప్పుడు అలా ఊహించుకొనేలా చూస్తే, ప్రేక్షకులు హాలులో లాక్ అయిపోతారు. సినిమా బాగుందనే అభిప్రాయంతో హాలులో నుంచి బయటకు వస్తారు. అందుకు కావాల్సిందల్లా ఓర్పుగా కథ, సన్నివేశాలు రాసుకోవడం! వాటిని నేర్పుగా, ఆసక్తి కొనసాగేలా తీయడం!! ఆ రెండు విషయాలలో కొంత మెరుగైన పనితనం చూపించిన చిత్రం ‘హిట్… ది ఫస్ట్ కేస్’. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ లక్ష్యాన్ని బలంగా ఛేదించిందా? ఆ సత్తా ఈ సినిమాకు ఉందా? ఏ మేరకు ఆకట్టుకుంటుంది అన్నది శేషప్రశ్న.

………………………….

చిత్రం – ‘హిట్… ది ఫస్ట్ కేస్’, తారాగణం – విష్వక్ సేన్, రుహానీ శర్మ, చైతన్య సాగిరాజు, భానుచందర్, మురళీశర్మ, బ్రహ్మాజీ, హరితేజ, పాటలు – కృష్ణచైతన్య, సంగీతం – వివేక్ సాగర్, కెమెరా – ఎస్. మణికంఠన్, ఎడిటింగ్ – గ్యారీ బిహెచ్, సమర్పణ – హీరో నాని, నిర్మాత – ప్రశాంతి తిపిర్నేని, రచన – దర్శకత్వం – డాక్టర్ శైలేష్ కొలను, రిలీజ్ తేదీ – 28 ఫిబ్రవరి 2020

…………………………..

          కథగా చెప్పాలంటే… ‘హిట్… ది ఫస్ట్ కేస్’ ఒక క్రైమ్ ఇన్ వెస్టిగేషన్‌తో ముడిపడిన మిస్టరీ థ్రిల్లర్.

ఓ పోలీసోడి ప్రేమకథకు… దర్యాప్తు కోణం

          పోలీసు ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు (విష్వక్ సేన్) తన పాత జ్ఞాపకాలతో బాధపడుతూ, కొద్దిగా డిప్రెషన్‌లో ఉంటాడు. ఆత్మహత్యలను నివారించే పోలీసు బృందం ‘హోమిసైడ్ ఇంటర్ వెన్షన్ టీమ్’ (హిట్)లో పనిచేస్తుంటాడు. అతని ప్రేయసి నేహ (రుహానీశర్మ) ఫోరెన్సిక్ విభాగంలో షిండే (బ్రహ్మాజీ) తదితరులతో కలసి పనిచేస్తుంటుంది. డిప్రెషన్‌లో పడ్డ హీరో ఆరు నెలలు సెలవు పెట్టి, ఉద్యోగానికి దూరంగా ఉండాలనుకుంటాడు. ఇంతలో అనుకోకుండా అతని ప్రేయసి కనిపించకుండా పోతుంది. ఆమె కోసం చేసే వెతుకులాటలో ఒక కాలేజీ విద్యార్థిని ప్రీతి మిస్సింగ్ కేసు కీలకమని అర్థమవుతుంది. పోలీసు ఉన్నతాధికారి విశ్వనాథ్ (భానుచందర్) అనుమతితో ఆ కేసును చేపడతాడు. ఇంతకీ ఆ ప్రీతి ఏమైంది, ఆమెకూ పోలీసైన హీరో లవర్ మిస్సింగ్‌కీ సంబంధం ఏమిటి, ఈ చిక్కుముడులను హీరో ఎలా విప్పాడు, ఈ క్రమంలో బయటపడ్డ నిజాలేమిటి వగైరా అంతా మిగతా సినిమా.

డైరెక్టరైన డాక్టర్… ఆ జర్నలిస్టు మనుమడే!

          హీరో నాని నిర్మాతగా మారి, తన వాల్ పోస్టర్ సినిమా పతాకంపై తీసిన రెండో సినిమా ఇది. గతంలో ‘అ!’ చిత్రానికి లాగే దీనికీ వినూత్నమైన కథ, కథనం ఉండే ప్రాజెక్టును ఎంచుకున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ లతో పాటు ముఖ్యంగా ఇటీవల వచ్చిన నెట్ ఫ్లిక్స్ లాంటి ఒ.టి.టి. ప్లాట్ ఫారమ్ లలోని వెబ్ సిరీస్ ల ప్రభావంతో తెలుగు సినిమా కూడా క్రమంగా మారుతోంది. అందుకు ఇలాంటి సినిమాలే ఒక నిదర్శనం.

          పాత్రల పరిచయం, వాటి తాలూకు ప్రవర్తనల ఎస్టాబ్లిష్‌మెంట్‌కే బోలెడంత సమయం తీసుకొన్న ఈ సినిమాలో ఫస్టాఫ్ బాగుంటుంది. సెకండాఫ్‌ కాసేపు బాగున్నా… క్రమంగా ఎక్కడో పట్టు జారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే, దర్శకుడికి ఇదే మొదటి సినిమా అంటే నమ్మలేం. ఒకప్పటి సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ కొలను బ్రహ్మానందరావు (‘చిత్రసీమ’ ఫేమ్) పేరు పాతకాలం వాళ్ళకు సుపరిచితమే. ఆయన మనుమడే ఈ చిత్ర దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను. కంటి డాక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. అయితే, ఎక్కడా ఇది కొత్త దర్శకుడు చేసిన చిత్రంలా అనిపించకపోవడం విశేషం. ఆయన స్క్రిప్టు రాసుకున్న విధానం, తీసిన తీరు కూడా బాగున్నాయి.

తెరపై కనిపించే వివిధ విభాగాల సమష్టి కృషి…

          కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్ విభాగాలు అన్నీ సమర్థంగా పనిచేశాయని తెరపై అర్థమవుతూనే ఉంటుంది. ఈ సినిమాకు మరో ముఖ్యమైన విభాగం – సంగీతం. చివరలో రోలింగ్ టైటిల్స్ సందర్భంగా వచ్చే పాట మినహా మరెక్కడా పాటే లేని ఈ మిస్టరీ థ్రిల్లర్‌కు నేపథ్య సంగీతం ప్రాణం. అందుకు తగ్గట్టే ప్రతి సన్నివేశంలో ప్రేక్షకుల ఉత్కంఠ పెరిగేలా సంగీతం అందించాలని మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ కృషి చేశారు. అయితే, కొన్ని కొన్ని చోట్ల మాత్రం కెమెరా తీత, శబ్దాల మోత అతిగా అనిపిస్తే, ప్రేక్షకుల తప్పు కాదు. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి దాకా సైలెన్స్ గ్యాప్ లేకుండా ఆర్.ఆర్. అవసరం లేదని సంగీత దర్శకుడు గ్రహించాలి. అయితే, మొత్తం మీద కథనంలోని వేగాన్నీ, సస్పెన్స్ నూ కొనసాగించడంలో ఆర్.ఆర్. సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి.

సెకండాఫ్ చివరకొచ్చేసరికి… కొద్దిగా…

          అయితే, కొత్త దర్శకుడి ఫస్ట్ సినిమా అయిన ఈ చిత్రంలో లోపాలు లేకపోలేదు. వానలో ఫైట్, హీరోకు వచ్చే పాత జ్ఞాపకాలు, ప్యానిక్ ఎటాక్స్ లాంటివి పదే పదే వచ్చి విసిగిస్తాయి. అలాగే, హీరోకూ, హీరోను ద్వేషించే పోలీసాఫీసర్ అభిలాష్ పాత్రకూ మధ్య ఘర్షణ, కొట్టుకోవడం లాంటివి సినిమాటిక్ అని సర్దుకోవాల్సిందే. సెకండాఫ్ చివరలోనే సస్పెన్స్ అంతా విడమర్చి, జరిగిన కథ ఏమిటో చెప్పే ప్రయత్నం వల్ల చివర కాసేపు పట్టు సడలింది. హైదరాబాదీ కుర్రాడు విష్వక్‌సేన్ చూడడానికి బాగున్నా, బాగానే పాత్రకు నప్పినా, ప్రత్యేకించి అద్భుతంగా చేశారనడానికి ఏమీ లేదు. మరీ ముఖ్యంగా, ఎమోషన్స్ పండించాల్సిన సన్నివేశాలు వచ్చేసరికి తెలియకుండానే తేలిపోయారు. అలాగే, క్రైమ్ ఇన్ వెస్టిగేషన్ ముడిపడిన థ్రిల్లర్ కావడంతో, మిగిలిన పాత్రలకు కూడా అద్భుత అభినయ ప్రదర్శన లేదు, ఉండదు. కాకపోతే, నేరస్థుడు ఎవరు అనే సస్పెన్స్ ముడి విప్పడానికి ప్రేక్షకులు ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తారు కాబట్టి, ప్రతి చిన్న పాత్రా ఎంతో కొంత రిజిస్టర్ అవుతుంది.

ఏమైనా, మంచి ప్రయత్నంగా మెచ్చుకోవడం వరకు ఓకే అయిన ఈ సినిమా చివరలో సీక్వెల్‌ను సూచిస్తూ, ముగుస్తుంది. ‘హిట్… ది ఫస్ట్ కేస్’ లాగానే, ‘హిట్… ది సెకండ్ కేస్‌’ వచ్చే ఏడాది వస్తుందన్న ప్రకటన… సినిమా కన్నా వెబ్ సిరీస్ చూశామన్న అనుభూతికి అక్షరాలా మ్యాచ్ అవుతుంది.

బలాలు

          – మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో ఉండే సహజమైన ఉత్కంఠ

          – సినిమా మొదటి నుంచి చివరి దాకా ఎవరు నేరస్థుడనేది తెలియనివ్వని కథనం

          – సంగీతం (రీరికార్డింగ్), కెమెరా, ఎడిటింగ్ తదితర సాంకేతిక విభాగాలన్నీ సమష్టిగా చేసిన కృషి

          – రచనలో, తెరకెక్కించిన విధానంలో తొలి సినిమా దర్శకుడి వద్ద ఊహించని నేర్పు. నటీనటులు ఆ పాత్రలకు సరిగ్గా సరిపోవడం.

బలహీనతలు

          – వెండితెరపై సినిమాగా కన్నా వెబ్ సిరీస్ తరహాలో సాగడం.

          – హీరోకు వచ్చే ప్యానిక్ ఎటాక్స్, పాత జ్ఞాపకాల తాలూకు ఇబ్బందిని పదే పదే చూపించి విసిగించడం

          – సెకండాఫ్ చివరకు వచ్చే సరికి, కథలోని సస్పెన్స్ అంతా ఒకేసారి బయటపెట్టాల్సి రావడం. దాంతో, సస్పెన్స్ విడిపోయాక చివరి ఇరవై నిమిషాల సినిమా డ్రాగ్ అనిపించడం.

          – ఎస్సై ఇబ్రహీమ్ (మురళీశర్మ) పాత్ర కానీ, హీరో స్నేహితుడి పాత్ర కానీ తగినంత ప్రొయాక్టివ్‌గా తీర్చిదిద్దకపోవడం. పెయింటర్ షీలా (హరితేజ) పాత్రకు ఒక నిర్దిష్టమైన గ్రాఫ్ లేకపోవడం.

పంచ్ లైన్ – వెండితెరపై వచ్చిన వెబ్ సిరీస్

రేటింగ్ – 2.5 / 5