Disco Raja Review – ఇది యమ ‘రిస్కే’… రాజా!

141
Disco Raja Movie Review
Disco Raja Movie Review

చిత్రం – డిస్కో రాజా, తారాగణం – రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్, తాన్యా హోప్, బాబీ సింహా, వెన్నెల కిశోర్, సత్య, అజయ్, మాటలు – అబ్బూరి రవి, సంగీతం – ఎస్. తమన్, కెమెరా – కార్తీక్ ఘట్టమనేని, నిర్మాత – రామ్ తాళ్ళూరి, దర్శకత్వం – వి.ఐ. ఆనంద్, రిలీజ్ తేదీ – 2020 జనవరి 24

కథలో పాయింట్ కొత్తగా ఉంటే చాలదు. దాన్ని చెప్పే విధానం కూడా కొత్తగానో, కనీసం కూర్చోబెట్టే విధంగానో ఉండాలి. అలా లేకపోతే ఎంతటి ‘డిస్కో రాజా’ అయినా… “చూడడానికి రిస్కే రాజా” అవుతుంది!

నిజానికి, కొందరు దర్శకులు అంతే. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్తది చెప్పాలనీ, కొత్తగా చెప్పాలనీ తపన ఉంటుంది. దర్శకుడి వి.ఐ. ఆనంద్‌కు అది స్వాభావిక లక్షణం. బహుశా, అందుకే కావచ్చు… మొదటి సినిమా హృదయం ఎక్కడ ఉన్నది (2014) నుంచి ఆయన ప్రతి సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా, ఏదో ఒక కొత్త అంశాన్ని స్పృశిస్తూ సాగుతూ ఉంటుంది. గతంలో సందీప్ కిషన్‌తో ‘టైగర్’ (2015), నిఖిల్‌తో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ (2016), అల్లు శిరీష్‌తో ‘ఒక్క క్షణం’ (2017) లాంటి వినూత్న చిత్రాలు ఆనంద్ ఖాతాలో ఉన్నాయి. ఆయన కొత్త చిత్రం రవితేజతో రూపొందించిన ‘డిస్కో రాజా’. ఇది ఓ సైన్స్ ఫిక్షన్‌తో కలగలిసిన ఓ యాక్షన్ సినిమా.

ఈనాటి సైన్సుకు… ఆనాటి పాత కథా?

ఎక్కడో లద్దాఖ్‌లో మంచులో ముప్ఫై అయిదేళ్ళ క్రితం కూరుకుపోయిన బ్రెయిన్ డెడ్ మనిషికి మళ్ళీ ప్రాణం పోసే ప్రయత్నం చేస్తారు ‘రీలివ్’ అనే బయో ల్యాబ్ సైంటిస్టులు. చిత్రంగా కుడివైపు గుండె ఉండే ఆ మనిషి ఎవరనేది ఒక ప్రశ్న. స్పృహలోకి వచ్చిన ప్రయోగశాలలోని ఆ సబ్జెక్ట్ తానెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. మరో పక్క ఢిల్లీలో అనాథలను పెంచుతూ వచ్చిన తండ్రి (సి.వి.ఎల్. నరసింహారావు) వద్ద పెరిగిన వాసు (కుర్ర రవితేజ)ది మరో కథ. రకరకాల ఉద్యోగాలు, సంపాదనతో ఆ కుటుంబానికి అండగా నిలవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంట్లో చెల్లెలి ఆపరేషన్ కోసం దాచిన పాతిక లక్షలను కొట్టేసిన తమ్ముడి కోసం వెతుకులాటలో… అతడు ఉన్నట్టుండి కనిపించకుండా పోతాడు. అతని కోసం అతని ప్రియురాలు (నభాగా నభా నటేశ్), సన్నిహితులు (‘సత్యం’ రాజేశ్ తదితరులు) వెతుకుతుంటారు. ఈ వ్యవహారంతో ఫస్టాఫ్ అంతా కథ కన్నా, పాత్రల పరిచయం, వాటి నేపథ్యాల పరిచయంతో గడిచిపోతుంది.

సైంటిస్టుల సాయంతో బతికిన వ్యక్తి ఒకప్పటి గ్యాంగ్ స్టర్ డిస్కో రాజ్ (పెద్ద రవితేజ) అని తెలుస్తుంది. మరోపక్క ఈ వాసుయే (చిన్న రవితేజ) అతని కొడుకని అర్థమవుతుంది. పాత రోజుల్లో పగతో రగిలిపోయిన బర్మా సేతు (బాబీ సింహా) గ్యాంగ్ ఏమో డిస్కో రాజ్‌ను చంపేయడానికి బయలుదేరుతుంది. ఇంతకీ గ్యాంగ్ స్టర్ డిస్కో రాజ్ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి, అతని పాత పగల కథేమిటన్నది ద్వితీయార్ధంలో వచ్చే సుదీర్ఘమైన రెట్రో లుక్ ఫ్లాష్ బ్యాక్. చెవుడు, మూగ అయిన తన తల్లి హెలెన్ (పాయల్ రాజ్ పుత్)ను మోసం చేసి, తమను అనాథగా వదిలేశాడనుకొని పెద్ద రవితేజనే చంపడానికి బయలుదేరతాడు చిన్న రవితేజ. ఈ గందరగోళాలన్నీ తీర్చి, ఆఖరకు అసలు శత్రువును కనిపెట్టి, వాళ్ళను హతమార్చడంతో ‘డిస్కో రాజా’ కథ ముగుస్తుంది.

కొత్త కథే… కానీ….

చనిపోయినవ్యక్తిని… బతికిస్తే? ఎప్పుడో ఓ ముప్ఫై అయిదేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తి ఇప్పుడు అదే, ఆ నాటి వయసుతోనే బతికొస్తో…? అతను, అతని కొడుకు ఒకేసారి ఎదురైతే? కాన్సెప్ట్ పరంగా ఇది కొత్తగా అనిపిస్తుంది. డిస్కో రాజా చిత్రానికి మెయిన్ లైన్ ఇదే. ఆ తండ్రికి ఒక ఫ్లాష్ బ్యాక్, ఈ కొడుకుకు ఒక సమకాలీన జీవితం – సమస్యలు ఉంటాయి. ఒకరికొకరు తెలియని ఇద్దరూ అనుకోకుండా ఎదురవడం, వారిద్దరి కోసం వేర్వేరుగా వెతుకున్న మనుషులతో కలవడం – ఇదీ ఆ మెయిన్ లైన్‌ చుట్టూ అల్లుకున్న పీచు మిఠాయి. ఈ పీచు మిఠాయిని ఆకర్షణీయంగా మలచడానికి దర్శక, రచయితలు నానాతంటాలు పడ్డారు. ఆ క్రమంలో వీలైనన్ని అతుకులు వేశారు. అతకని అంశాలనూ తీసుకొచ్చి, అతికించారు. మరీ ముఖ్యంగా, ఆ 1980ల నాటి ఫ్లాష్ బ్యాక్ మరీ దారుణంగా అనిపిస్తుంది. 1980ల రెట్రో లుక్ అంటే మరీ అంతంత జుట్టు, ఆ మీసకట్టుతో, అనాగరక ఆదిమానవులలా ఉన్నట్టు చూపించాల్సిన పనేమిటో అర్థం కాదు. ఆ ఎపిసోడ్ అంతా ప్రేక్షకుల సహనానికి అతి పెద్ద పరీక్ష. అయితే, ఈ సినిమా కథకు సీక్వెల్ కోసమో ఏమో, డిస్కో రాజ్ సహా విలన్ పాత్రలను కూడా సైంటిస్టులు బయో ల్యాబ్‌లో పరిశోధనలకు పెట్టినట్టు చూపించి, సినిమాకు ఎండ్ టైటిల్స్ వేశారు. మొదటి దానికి దిక్కు లేదు… మరొక భాగమా అని మనసులో అనుకుంటూ, అప్పటికే నీరసించిన ప్రేక్షకులు బతుకు జీవుడా అని హాలు నుంచి బయటకు వస్తారు.

చూస్తున్నది తమిళమా? హిందీనా..?

తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన వి.ఐ. ఆనంద్ ఒకప్పుడు ఎ.ఆర్. మురుగదాస్ లాంటి ప్రసిద్ధ డైరెక్టర్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన వ్యక్తి. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదివి, సినిమాల్లోకి వచ్చిన ఈ నలభై ఒక్క ఏళ్ళ సృజనశీలికి సినిమా మీద ప్రేమ అపారం. అందుకే, ఎప్పటికప్పుడు కొత్త తరహా కథ తెరపై చెప్పాలని తాపత్రయపడుతుంటారు. కానీ, కారణాలు ఏమైనా ఈ కథలో అది వెర్రితలలు వేసింది. అలవాటైనది కాబట్టి, మద్రాసు నేపథ్యాన్ని తీసుకున్నారో ఏమో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఆ రెట్రో లుక్‌లు, ఆ పాత కాలపు మద్రాసు సెట్టింగులు అతకనే లేదు. పైపెచ్చు, డబ్బింగ్, శాటిలైట్ హక్కుల మీద ఆశతోనో ఏమో… సినిమాలో చాలా చోట్ల తమిళాన్నీ, అలాగే ఒక పట్టాన ఇప్పటి జనం ఎవరూ కనెక్ట్ కాని పాత హిందీ సినిమా డైలాగులు, కొన్ని పాపులర్ పాటలూ కూడా పెట్టారు. దాంతో, ఉన్నట్టుండి డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగినా ఆశ్చర్యం లేదు. ఈ పోపు సామాన్లన్నీ బాగున్నా, అసలు కథలో పస లేకపోవడంతో అంతా వృథా ప్రయాసే అయింది.

రవితేజ హుషారు సరిపోతుందా?

‘డిస్కో రాజా’ చిత్రం పైన హీరో రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ మధ్య మరీ సన్నబడిపోయి, కంటికి నదురుగా లేని రవితేజ మళ్ళీ కొంత మునుపటి రూపురేఖలతో కనిపించారు. ఈ సినిమా కోసం ఆయన తనకు అలవాటైన ఫక్కీలో హుషారుగా చేశారు. ఫైట్లు కూడా బాగా చేశారు. కానీ, అది ఈ సినిమాకు సరిపోలేదు. పేరుకు ముగ్గురు హీరోయిన్లున్నా, కథలో వాళ్ళకు పెద్దగా పాత్రలు లేవు. తమిళనాట ప్రసిద్ధుడైన తెలుగు వాడు బాబీ సింహా విలన్‌గా బాగున్నాడు. అతని సొంత తెలుగు డబ్బింగ్ కూడా, గంభీరమైన కంఠంతో బాగుంది. కానీ, అతనికి ఇది తెలుగులో బ్రేకిస్తుందా అన్నది సందేహమే. కమెడియన్ సునీల్ ఇప్పుడు తగిన క్యారెక్టర్ల కోసం చూస్తున్నాడని ఈ సినిమాతో అర్థమవుతుంది. అతని సర్ ప్రైజింగ్ పెర్ఫార్మెన్స్ బాగున్నా, జనం నుంచి అంగీకారం ఎలా వస్తుందన్నది ప్రశ్నార్థకం.

దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఇది ఒక వెరైటీ సైన్స్ ఫిక్షన్ చిత్రమని చెబుతూ వచ్చారు. కథ, కథనం అంతా అదే పద్ధతిలో పోయినా సరిపోయేది. కానీ, 1980ల నాటి నేపథ్యంలో జరిగే గ్యాంగ్ స్టర్ వార్ కథను ఆ సైన్స్ ఫిక్షన్‌కు కలిపారు. దాంతో సినిమా అతుకుల బొంతలా తయారైంది. మొదటి సైన్స్ ఫిక్షన్ ఆలోచన నిజానికి కొత్తగా అనిపించినా, సినిమా గడిచికొద్దీ నీరసంగా మారి మామూలు రొటీన్ యాక్షన్ డ్రామాగా మిగిలి, ప్రేక్షకులకు నీరసం తెప్పిస్తుంది. ఒక మంచి ఆలోచన ఉన్నా… దాన్ని ఒక కమర్షియల్ చిత్రంగా ఎలా నడపాలన్న దానిపై దర్శకుడి వైఫల్యం కనిపిస్తోంది. పైగా, గతానికీ, వర్తమానానికీ మధ్య ముందుకూ, వెనక్కూ సాగే కథాకథన కొత్త ధోరణిని అనుసరించడంతో దర్శక, నటీనటులు ఆ స్థలకాలాలు, ఆ భావావేశాల కంటిన్యుటీలో ఇబ్బంది పడ్డారు. వెరసి ప్రేక్షకులను కూడా బాగానే ఇబ్బంది పెట్టారు.

1980ల నాటి నేపథ్యంలో నడిచే ఈ చిత్రంలో ఆ కాలపు సంగీతం, పాట కూడా చోటుచేసుకున్నాయి. అప్పట్లో వీరవిజృంభణలో ఉన్న సంగీత జ్ఞాని ఇళయరాజా పాటల ఫక్కీలో ఈ సినిమాలో కూడా ఒక పాట పెట్టారు. ‘నువ్వు నాతో ఏమన్నావో… నేనేం విన్నానో…’ అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతులో సాగే సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన చెవులకు మెత్తగా ఉంటుంది. చాలాకాలం పాటు ఆడియోగా మనసును వెంటాడుతుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ‘దిల్లీ వాలా…’ కాస్త హుషారైన పాట. ఆదిత్యా అయ్యంగార్, గీతా మాధురి, రాహుల్ నంబియార్‌లు పాడిన ఈ పాట కూడా ఫరవాలేదనిపిస్తుంది. ఒకప్పటి డిస్కో డ్యాన్సర్ తరహా పాప్ పాటలు, ఆ తరహా డిస్కో డ్యాన్సులు కూడా పెట్టారు. అయితే, అవన్నీ సినీ పరిభాషలో ‘ఐటమ్‌లు’ గానే మిగిలాయి తప్ప, సినిమాను ముందుకు పరిగెత్తించలేకపోయాయి. ప్రేక్షకులను ఇన్ వాల్వ్ చేయలేకపోయాయి.

కొసమెరుపు…
అన్నట్టు హాలులో నుంచి బయటికొస్తుంటే, ఎవరో అంటున్న మాట… “ఒరేయ్… ఈ సినిమా పబ్లిసిటీ పోస్టర్ లోనే ఉన్నట్టు… దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ లోనో, ఎక్కడ కావాలో అక్కడకు రివైండ్ చేసో చూడాలే తప్ప, ఆద్యంతం ప్లే చేసి చూడాలనుకుంటే, కిల్ అయిపోతావురో!” దాదాపు రెండేళ్ళు కష్టపడి, శ్రమించి చేసిన సినిమాకు ఇది బాధాకరమైన కామెంట్ అయినా, డబ్బిచ్చి, టికెట్ కొన్న ప్రేక్షకులు తెర మీది గ్యాంగ్ స్టర్ ‘డిస్కో రాజా’ల కన్నా వయెలెంట్ గా ఉంటారు మరి!

బలాలు…

 • కాన్సెప్టులోని కొత్తదనం
 • రవితేజ నటనలోని హుషారు
 • వెన్నెల కిశోర్ కామెడీ, విలన్‌గా బాబీ సింహా నటన
 • పాత తరం సంగీతాభిమానుల్ని అలరించే ‘నువ్వు నాకేం చెప్పావో…’ పాట

బలహీనతలు…

 • సాగదీసిన ప్రథమార్థం, కథా కథనంలోని గందరగోళం
 • ద్వితీయార్ధంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్, 1980ల నాటి సీక్వెన్సులు
 • ఇద్దరు రవితేజలున్నా… (రెట్రో లుక్ అప్పుడు మినహా మిగతా) వారికి సరైన వేరియేషన్ లేకపోవడం
 • ముగ్గురు హీరోయిన్లున్నా, వారికి సరైన పాత్రలు లేకపోవడం.
 • ఒక్కటి మినహా మినహా మిగతా పాటలేవీ గుర్తుండేలా లేకపోవడం

పంచ్‌లైన్

 • తీసినవారికే కాదు… చూసేవారికీ… ఇది యమ ‘రిస్కే’ రాజా!

రేటింగ్

 • 2 / 5