Bheeshma Movie Review and Rating

48
Bheeshma Movie Review and Rating
Bheeshma Movie Review and Rating

Rating: 2.25/5

తొలి సినిమాతో హిట్టు కొట్టిన దర్శకుడి రెండో సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రేక్షకులకు, సినీ విమర్శకులకు ఓ రకమైన ఆసక్తి ఉంటుంది. ద్వితీయ విఘ్నాన్ని దాటుతాడా? ఎలాంటి కథతో రెండో సినిమా వస్తున్నది అనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉంటాయి. అలాగే వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయిన హీరో నుంచి మరో సినిమా వస్తుంటే ఈసారైనా హిట్టు కొడుతాడా? వరుస విజయాలు సొంతం చేసుకొంటున్న హీరోయిన్ సినిమా వస్తుంటే.. మళ్లీ సక్సెస్‌ను అందిపుచ్చుకొంటుందా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉండటం సహజం. ఇలాంటి ఫీలింగ్స్‌ మధ్య రిలీజ్ అయిన చిత్రం భీష్మ. ఛలో మూవీతో వెంకీ కుడుముల, సక్సెస్‌లతో దూసుకెళ్తున్న రష్మిక మందన్న.. విజయం కోసం వెంపర్లాడుతున్న నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ చిత్రం ఎలా ఉందంటే..

భీష్మ ఆర్గానిక్ కంపెనీ, ఫీల్డ్ సైన్స్ కంపెనీల మ‌ధ్య సేంద్రియ వ్య‌వ‌సాయం, ర‌సాయ‌నాల‌తో పంట దిగుబ‌డి విష‌యంలో ఆధిప‌త్య పోరాటం కొన‌సాగుతుంటుంది. భీష్మ కంపెనీ అధినేత భీష్మ (అనంత నాగ్‌) వ‌య‌సు పైబ‌డ‌టంతో సంస్థ‌కు వార‌సుడిని వెతికే ప‌నిలో ఉంటాడు. ఈ క్ర‌మంలో డిగ్రీ కూడా పాస్ కాకుండా అమ్మాయి ప్రేమ‌కు ప‌రిత‌పించే యువ‌కుడు భీష్మ‌ను కంపెనీ సీఈవోగా ప్ర‌క‌టించ‌డంతో అంద‌రూ షాక్ గుర‌వుతారు. అయితే 30 రోజుల్లో తాత్కాలిక సీఈవో భీష్మ త‌న ప‌నితీరును నిరూపించుకొంటాడ‌ని సీనియ‌ర్ భీష్మ‌ భ‌రోసా ఇస్తాడు.

ఇలాంటి పరిస్థితుల్లో చైత్ర (ర‌ష్మిక మంద‌న్న)తో ప్రేమ వ్య‌వ‌హారం ఎలా కొన‌సాగింది. తొలిచూపులోనే ప్రేమించిన చైత్ర ప్రేమ‌ను ఎలా ద‌క్కించుకొన్నాడు? ఫీల్డ్ సైన్స్ కంపెనీ అధినేత (జిషు సేన్ గుప్తా) వేసే ఎత్తుల‌ను ఎలా చిత్తు చేశాడు? ఈ క‌థ‌లో వెన్నెల కిషోర్‌, సంప‌త్ రాజ్‌, ర‌ఘుబాబు, న‌ర్రా శ్రీనివాస్ పాత్ర‌లు కీల‌కంగా మారాయ‌నే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే భీష్మ సినిమా క‌థ‌.

ఆర్గానిక్ అగ్రిక‌ల్చ‌ర్ అనే పాయింట్ త‌ప్పా..మిగితా అంతా రొటీన్ స‌ర‌కే. రెగ్యుల‌ర్ ప్రేమ క‌థ‌కు వినోదాన్ని జోడించి రెండు గంట‌ల‌పాటు ఆడియెన్స్‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డ‌మే సినిమాలో కాస్తా ఊర‌ట‌. నితిన్ బాడీ లాంగ్వేజ్ కొత్త‌గా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. ర‌ష్మిక‌తో కెమిస్ట్రీ బాగానే పండింద‌ని చెప్ప‌వ‌చ్చు. గ్లామ‌ర్‌తోపాటు యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో ర‌ష్మిక ఒదిగిపోయింది.

వెన్నెల కిషోర్ త‌న ఫార్మాట్‌లో కామెడీని పండించ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్ప‌వ‌చ్చు. కాక‌పోతే ద‌ర్శ‌కుడు రాసుకొన్న డైలాగ్స్ కొత్త‌గా ఉన్నాయి. న‌ర్రా శ్రీను, ర‌ఘుబాబు, వీకే న‌రేష్ మార్కు కామెడీ ఆక‌ట్టుకొంటుంది. ఇక సంప‌త్ రాజ్‌, నితిన్ మ‌ధ్య మందుకొట్టే స‌న్నివేశం, సెకండాఫ్‌లో కారు ప్ర‌యాణంలో సొరంగంలో వ‌చ్చే సీన్లు, చివ‌ర్లో అజ‌య్‌, హెబ్బా ప‌టేల్ వినోద స‌న్నివేశాలు మ‌రింత హాస్యాన్ని పంచాయి.

ఇక భీష్మ, ఫీల్డ్ సైన్స్ కంపెనీల మ‌ధ్య వైరానికి సంబంధించిన బ‌ల‌మైన స‌న్నివేశాలు లేక‌పోవ‌డం సినిమాను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్ల‌లేక‌పోయాయ‌నిపిస్తుంది. అనంత్‌నాగ్‌, జిషు మ‌ధ్య సీన్లలో ప‌స లేక‌పోవ‌డం, అలాగే జిషు, నితిన్ మ‌ధ్య స‌న్నివేశాలు బ‌ల‌హీనంగా ఉండ‌టం సినిమాకు మైన‌స్‌గా మారాయి. బ్లాక్ బ‌స్ట‌ర్‌కు కావాల్సినంత స్కోప్ ఉండే అంశాలున్నా.. స్క్రిప్టు ప‌రంగా జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల భీష్మ యావ‌రేజ్ కంటే కొంత బెట‌ర్‌గానే మిగిలిపోయింద‌ని చెప్ప‌వ‌చ్చు.

సితార ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ పాటించిన‌ సాంకేతిక విలువ‌లు బాగున్నాయి. మ్యూజిక్ ప‌రంగా మ‌హ‌తి సాగ‌ర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. ఒక్కపాట త‌ప్ప మిగితా పాట‌లు అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. సినిమాటోగ్ర‌ఫి, ఎడిటింగ్ ప్ర‌మాణాలు బాగున్నాయి.

Rating: 2.25/5