Aswathama Movie Review- ఉడికీ… ఉడకని క్రైమ్ వంట ‘అశ్వత్థామ’

108

          సినిమాకు కథ కావాలి. ఆ కథకు ఒక హీరో కావాలి. మరి, హీరోనే కథా రచయితగా మారితే? అప్పుడు వచ్చే కథ ఎలా ఉంటుంది? కచ్చితంగా హీరో సెంట్రిక్‌గా, కథలో ఆ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా తయారవుతుంది. కావాలంటే, కొత్తగా రిలీజైన అశ్వత్థామ చిత్రం చూడండి. ఎక్కువగా ప్రేమకథలు చేస్తూ వచ్చిన యువ హీరో నాగశౌర్య ఇప్పుడు ఆ పనే చేశారు. తానే స్వయంగా ఒక కథ అల్లుకొని, తానే హీరోగా ఆ కథను తెర మీదకు తీసుకొచ్చారు.

………………………………………

చిత్రం: అశ్వత్థామ, తారాగణం: నాగశౌర్య, మెహరీన్ పిర్జాదా, సర్గుణ్ కౌర్, జిషూసేన్ గుప్తా, హరీశ్ ఉత్తమ్, కాశీ విశ్వనాథ్, పోసాని కృష్ణమురళి, సి.వి.ఎల్. నరసింహారావు, కథ:  నాగశౌర్య, సంగీతం: శ్రీచరణ్ పాకాల, నేపథ్య సంగీతం: జిబ్రాన్, కెమేరా: మనోజ్ రెడ్డి, కూర్పు:  గ్యారీ బి.హెచ్, లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి, సమర్పణ: శంకర్ ప్రసాద్ మల్పూరి, నిర్మాత:  ఉషా మల్పూరి, దర్శకత్వం: రమణతేజ, నిడివి: 133 నిమిషాలు, రిలీజ్ తేదీ: 2020 జనవరి 31, శుక్రవారం

…………………………………………

          ఆసక్తికరమైన పాయింటే…

          విశాఖపట్నంలో ఒక కుటుంబం. ఆ తల్లితండ్రులకు (పవిత్రా లోకేశ్ దంపతులు) కొడుకు గణ (హీరో నాగశౌర్య), కూతురు ప్రియ (సర్గుణా కౌర్). అయిదేళ్ళ క్రితం అమెరికా వెళ్ళి అక్కడ ఉంటున్న హీరో తన చెల్లెలి నిశ్చితార్థం, పెళ్ళికని ఇండియా వస్తాడు. కాలేజీ స్నేహితురాలైన నేహ (మెహరీన్)ను కూడా కలుస్తాడు. నిశ్చితార్థమైపోయిన చెల్లెలు తీరా ఒక రాత్రి ఉరి పోసుకొని, ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంది. అనుకోకుండా అది చూసి, హీరో షాక్ అవుతాడు. కారణం అడిగితే, తనకు తెలియకుండానే తాను గర్భం దాల్చినట్టు హీరోకు అతని చెల్లెలు చెబుతుంది. కాబోయే బావ రవి (ప్రిన్స్) సాయంతో ఆ గర్భం తీసేయించి, అనునయించి చెల్లెలి పెళ్ళి చేసేస్తాడు హీరో. ఇక అక్కడ నుంచి తన చెల్లెలిని అలా చేసినవాళ్ళు ఎవరని రకరకాల కోణాల్లో వెతకడం మొదలుపెడతాడు. ఆ క్రమంలో అతనికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఊళ్ళో ఎంతోమంది ఆడపిల్లలు కనిపించకుండా పోవడం, కళ్ళు తిరిగి కిందపడిపోయిన ఈ టీనేజ్ ఆడపిల్లలను అంబులెన్సులో ఎవరో హాస్పటల్‌లో చేర్చడం, ఆ తరువాత మూడు నెలలకు వాళ్ళు గర్భం దాల్చడం – ఇలా ఒకే పద్ధతిలో అనేకమందికి జరుగుతోందని హీరో గ్రహిస్తాడు. ప్రేక్షకులకు ఆసక్తిగా అనిపించే ఈ గుట్టును ఛేదించడానికి ప్రయత్నం మొదలుపెడతాడు. ఇక్కడికి సినిమా ఫస్టాఫ్.

          కథ మంచి పట్టులో ఉండగా సెకండాఫ్ మొదలవుతుంది. ఈ అమ్మాయిలు, వాళ్ళ మిస్సింగ్ వెనుక ఉన్న వ్యక్తి, అతని తాలూకు మనుషుల కథాకమామిషు ఈ సెకండాఫ్‌లో చూపిస్తారు. చివరకు ఆ రహస్యాన్ని ఛేదించిన హీరో, విలన్ ఆట ఎలా కట్టించాడన్నది మిగతా సినిమా.

          కొట్టొచ్చిన అనుభవ రాహిత్యం

ఇదో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. దర్శకుడు రమణ తేజకు ఇదే తొలి చిత్రం కూడా. గతంలో కొన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాలు చేసిన హీరో నాగశౌర్య  యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకొనేందుకు చేసిన ప్రయత్నం ఇది. మొదటే చెప్పుకున్నట్టు ఈ చిత్రానికి కథా రచయిత కూడా హీరో నాగశౌర్యే. కొన్ని నిజజీవిత ఘటనలను ఆధారంగా చేసుకొని, ఈ కథను అల్లుకున్నట్టు సినిమా ట్రైలర్‌లోనే ప్రకటించారు. కానీ, దాన్ని కథగా అల్లుకోవడంలో అనుభవ రాహిత్యం, కథలో సామాన్యుడికి వచ్చే మామూలు సందేహాలను తీర్చి, లాజికల్‌గా చూపించే ప్రయత్నం జరగలేదు. అది ఈ సినిమాలో పెద్ద లోపం. రచయిత కథతో పాటు, సినిమా తీసిన దర్శకుడికి కూడా ఇదే తొలి సినిమా కావడం మరో పెద్ద లోటుగా మారింది. కెమెరామన్ మరికొంత జాగ్రత్తలు తీసుకొని ఉంటే, యాక్షన్ పార్ట్ మరికొంత ఎలివేట్ అయ్యే అవకాశం ఉండేది. ముఖ్యంగా, వినాయక నిమజ్జనం సందర్భంలో జరిగే ఛేజ్ సీన్ ప్రస్తుతం బాగున్నా, మరో రేంజ్‌కి వెళ్ళే అవకాశం పోయింది.

మొదట కాసేపు టీవీ సీరియలే! హడావిడి ఎక్కువ… ఆసక్తి తక్కువగా… సెకండాఫ్!!

నిర్మాణ విలువలు బాగున్న ఈ చిత్రం అంతా ప్రధానంగా హీరో పాత్ర చుట్టూరానే నడుస్తుంది. నాగశౌర్య బాగానే శ్రమించారు. హీరోయిన్ మెహరీన్ సహా మిగతా పాత్రధారులవి కథానుసారం వచ్చి, వెళ్ళిపోతుంటాయి. ప్రధాన విలన్‌గా చేసిన జిష్షు సేన్ గుప్తా (ప్రముఖ బెంగాలీ నటుడు, ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ ‘కథానాయకుడు’లో దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ వేషం వేసిన నటుడు, జాతీయ అవార్డు విజేత)  బాగున్నాడు. అతని నటన, చూపిన విలనీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే, సినిమా మొదట కాసేపు అచ్చం తెలుగు టీవీ సీరియల్‌ లాగా అనిపిస్తుంది. దానికి తోడు ఒక డ్యూయెట్, ఆ వెంటనే ఒక ఇంట్లో సంగీత్ లాంటి పాట వచ్చి, సహనానికి పరీక్ష పెడతాయి. అటుపైన అసలు కథ మొదలయ్యాక కానీ, సినిమా ఆసక్తికరంగా అనిపించదు.

అన్నాచెల్లెళ్ళ అనుబంధంతో మొదలైనా… ఆనక కనిపించకుండా పోయిన అమ్మాయిల లాంటి అంశాలు ప్రేక్షకులను ఫస్టాఫ్ కాసేపయిన దగ్గర నుంచి ఆసక్తిగా హాలులో కూర్చోబెడతాయి. అయితే, ఆ తరువాత కూడా అదే టెంపోను కొనసాగిస్తే బాగుండేది. అమ్మాయిల మిస్సింగ్ కేసులు అన్ని నమోదవుతున్నా పోలీసు శాఖలో అది పెద్దగా ఫోకస్ కాలేదనడం, కళ్ళు తిరిగి కిందపడిన ప్రతి ఆడపిల్లా గర్భవతిగా తేలడం లాంటివి కథగా రాసుకోవడానికి బాగున్నా… కథనంలో లాజికల్‌గా చెప్పలేకపోయారు. ప్రేక్షకులను కన్విన్స్ చేయలేకపోయారు. ఇక, విలన్ తాలూకు ఇల్లే ఒక పెద్ద ముఠా డెన్‌ లాగా నడుస్తుంటే, భద్రపరచిన శవాలతో నిండి ఉంటే ఎక్కడా బయటకు పొక్కకపోవడం, ఎవరికీ ఏ అనుమానమూ కలగలేదనడం కూడా ఫక్తు తెలుగు సినిమా లిబర్టీయే!

మొత్తం మీద, నాగశౌర్యకు కొత్తదైన యాక్షన్ ఇమేజ్ తెచ్చే ఉడికీ ఉడకని వంటగా ఈ ‘అశ్వత్థామ’ మిగిలిపోతుంది. శవసంభోగం సహా అనేకానేక శాడిస్టు సంఘటనలు, మాటలు, దృశ్యాలు చూసే ధైర్యం చేయగలిగిన సువిశాల, సుదృఢ మనస్కులకు కొండొకచో ఈ సినిమా బాగుందని అనిపించినా అనిపించవచ్చు. కానీ, ఎంత సొంత సినిమా అయినా, దాదాపు 15 కోట్ల పైచిలుకు ఖర్చును ఈ అశ్వత్థామ ఎంతవరకు వెనక్కి రాబడతాడన్నది మాత్రం అక్షరాలా అన్నే కోట్ల విలువైన ప్రశ్న.

కొసమెరుపు:

మహాభారతంలో అశ్వత్థామ పాత్రకూ, కథానాయక పాత్ర గణ (నాగశౌర్య)కూ మధ్య లేనిపోని పోలికలు బలవంతాన తెచ్చే ప్రయత్నం జరిగింది. సినిమాలో దర్శకుడి కోరిక మేరకో ఏమో డైలాగ్ రైటర్ కూడా రామాయణ, భారతాల ప్రస్తావన కూడా అడపాదడపా తెస్తాడు. కానీ, ఇంతకీ ‘అశ్వత్థామ’ అనేది తెలుగులో అసలు స్పెల్లింగ్ అయితే, దాన్ని కంప్యూటర్ తెలుగు కంపోజింగ్ లో సైతం రాని ‘అశ్వథాథమ’ (రెండూ పొట్టలో చుక్క ఉన్న థా లు, పైగా ఒకదాని కింద మరొకటి) గా టైటిల్ రాసి మరీ సినిమా తీయడం విడ్డూరం. (నోట్… ఈ రివ్యూలో మాత్రం తెలుగు భాష మీద ప్రేమతో, తప్పులు లేకుండా అశ్వత్థామ అనే పదం ఎలా రాస్తారో, ఆ విధానాన్నే అంతటా వాడాం). అన్నట్టు ఏ భారతంలోనే కాదు… ఏ భాషలోనూ లేని విధంగా సినిమాలో ఒక చోట అశ్వద్ధాముడు అని కూడా చెప్పిస్తారు. దే…వుడా!

………………………

బలాలు….

  • ఆసక్తికరమైన పాయింట్.
  • కొత్త ఇమేజ్ కోసం నాగశౌర్య చేసిన ఫైట్లు, నటన
  • జిబ్రాన్ నేపథ్య సంగీతం, యాక్షన్ థ్రిల్లర్ సినిమా జానర్ కావడం
  • నిర్మాణ విలువలు, విలన్‌గా బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తా అభినయం

………..

బలహీనతలు…

– దర్శక, కథా రచయితల అనుభవరాహిత్యం

– సినిమా మొదట కాసేపు టీవీ సీరియల్‌లా సాగడం

– కథకు అడ్డం పడ్డ పాటలు

– అసలు కథలోని పాయింట్‌ను వివరించాల్సిన సెకండాఫ్‌లో తడబాట్లు

– క్లైమాక్స్‌ ఆసక్తికరంగా లేకపోవడం

………..

రేటింగ్ – 2 / 5

………………………