ఆ హీరోయిన్ ఎందుకు తప్పుకుంది… మాస్టారూ!? ఆ దర్శకుడి దెబ్బకేనా..?

199

అనగనగా ఓ పెద్ద సినిమా… పెద్ద హీరో… పెద్ద నిర్మాత. దర్శకుడు కూడా వరుస విజయాలతో ఊపు మీద ఉన్నవాడే. తీరా ఆ సినిమాలో నుంచి కథానాయిక పాత్రధారిణి పక్కకు తప్పుకుంది. ఆమెతో చేయాల్సిన సన్నివేశాలు దగ్గరకు వచ్చేసరికి ఇలా జరిగింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇంతలో సందట్లో సడేమియాగా కరోనా వైరస్ వ్యవహారం వచ్చిపడింది. ఆ దెబ్బ వల్లే షూటింగ్ కాస్తా ఆపేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

    చాలా వరకు తెలుగు సినిమాల షూటింగులు ఆగిపోయాయి. అయితే, ఈ భారీ సినిమా తాజా షెడ్యూల్‌కు వచ్చిన బ్రేక్ గురించి మాత్రం సినీ వర్గాల్లో చర్చ ఆగట్లేదు. అదేమంటే, పెద్ద హీరో… పెద్ద సినిమా…. అయినా సరే ఆ సినిమా నుంచి… పేరున్న ఆ హీరోయిన్ ఎందుకు బయటకొచ్చినట్టు చెప్మా అని చర్చించుకుంటున్నారు. సహజంగానే, ఇలాంటి సినిమాల నుంచి బయటకు వస్తున్నప్పుడు ఏ పెద్ద నటులైనా సరే, ‘సృజనాత్మక విభేదాలు’ లాంటి మాటలు సాకుగా చెబుతుంటారు. ఈసారి కూడా అదే సాకు వినిపించింది. కానీ, నిజమైన కారణం అదేనా అన్నది ప్రశ్న.

     దీనికి సంబంధించి కారణాలను అన్వేషిస్తే, రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వాటిలోని నిజానిజాలను నిగ్గుతేలుద్దాం.

ఒకటో వాదన:

       ఆ హీరోయిన్ పారితోషికం భారీగా అడిగిందట! అందువల్లే, సినిమా నుంచి ఆమెను తప్పించారట!

        ఇందులో నిజమెంత? :

        తెలుగు, తమిళాల్లో నటించే ఆ హీరోయిన్‌కు సర్వసాధారణంగా మన తెలుగులో కోటి నుంచి కోటిన్నర దాకా పారితోషికం ఇస్తుంటారు. ఇప్పుడు ఈ పెద్ద హీరో సినిమాకూ ఆమెకు అంతే ఇస్తున్నారట. కాబట్టి, పారితోషికం భారీ అనుకోవడం నిజం కాదు. నిజానికి, ఈ పెద్ద హీరో గత సినిమాకు కూడా ఇలానే హీరోయిన్‌ను వెతుక్కోవాల్సి వచ్చింది. అప్పుడు తీసుకున్న ఒక హీరోయిన్‌కు పారితోషికం రూ. 1.75 కోట్లు ఇచ్చారు. మామూలు రూ. 60 – 70 లక్షలు తీసుకొనే అమ్మాయికి 1.75 కోట్లు ఇవ్వగా లేనిది… ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు హీరోయిన్‌కు కోటిన్నర ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడారని అనుకోలేం. కాబట్టి, ఆమె తప్పుకోవడానికి రెమ్యూనరేషన్ కారణం కాదనేది స్పష్టం.

        రెండో వాదన:

        ఆ హీరోయిన్‌కూ, యూనిట్ కూ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. ఆమె పాత్ర మొదట చెప్పిన విధంగా లేదట!

          ఇందులో నిజమెంత? :

          సినిమాలో నుంచి పక్కకు తప్పుకుంటూ సదరు కథానాయిక ఆ మాటే చెప్పింది. మొదట అనుకున్న విధంగా, తరువాత లేనప్పుడు ఎవరి దోవలో వాళ్ళు వెళ్ళడం తప్పదన్నట్టు వ్యాఖ్యానించింది. కానీ, అది నమ్మశక్యంగా లేదు. ఆ సినిమాలో ఆ హీరోయిన్‌ది, ప్రత్యేక పాత్ర వేసే యువ హీరోకు ఆంటీ లాంటి పాత్ర అంటున్నారు. పెద్ద హీరో… అతనిది కాస్తంత పెద్ద వయసు పాత్ర కాబట్టి, అతని పక్కన సీనియర్ హీరోయిన్‌గా వేస్తున్నప్పుడు ఇలాంటివి సహజంగానే స్క్రిప్టులో ఉంటాయి. సినిమాలో ఛాన్స్ రాగానే ఒప్పుకుంటున్నప్పుడు అవేవీ ఆ సీనియర్ హీరోయిన్‌ ఊహించలేదని అనుకోలేం. అదే సమయంలో దాదాపు ఇరవై ఏళ్ళుగా సినీరంగంలో ఉంటున్న హీరోయిన్ కు, ఓ పెద్ద వయసు హీరో పక్కన పాత్ర ఎలా ఉంటుందో తెలియదనీ అనుకోలేం. కాబట్టి, ఆ వాదన కూడా సరికాదు. క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేది వట్టి సాకు మాత్రమే అనేది స్పష్టం.

          మూడో వాదన:

సదరు చిత్ర దర్శకుడు, ఆ హీరోయిన్‌ విషయంలో కమిట్‌మెంట్ అడిగాడట! కృష్ణానగర్‌లో ఆ గాలివార్త ఇప్పుడు ప్రబలంగా వినపడుతోంది.

          ఇందులో నిజమెంత? :

          నిజానిజాల మాటెలా ఉన్నా… ఇప్పుడు కృష్ణానగర్‌లో వినిపిస్తున్న మాట ఇది. గమ్మత్తేమిటంటే… సదరు చిత్ర దర్శకుడు పెద్ద పేరున్నవ్యక్తి. సినిమాల్లో… సమాజానికి తెగ నీతులు చెప్పే పటిమ ఉన్నవాడు. తెరపై హీరోలను తెగ ఆదర్శంగా చూపిస్తుంటారు. కానీ, ఆంతరంగిక వర్గాల కథనం మాత్రం మరోలా ఉంది. కెమెరా వెనుక ఆయన ప్రవర్తన మాత్రం కథానాయికల విషయంలో అంత ఆదర్శంగా ఉండదని సినిమా వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ముంబయ్ సినీ వర్గాలలోనూ మన దర్శకుడికి అలాంటి పేరుందని ఇప్పుడు ఒక్కొక్కరూ చెప్పుకొస్తున్నారు. శారీరక సాన్నిహిత్యాన్ని ‘కమిట్ మెంట్’గా కోరడంతోనే ఈ తాజా చిత్ర హీరోయిన్ కూడా పక్కకు తప్పుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు చెప్పేవి శ్రీరంగ నీతులు… చేసేవి ఇలాంటి పనులు… అంటూ నోరు పారేసుకుంటున్నవారూ లేకపోలేదు.

          అన్నట్టు గతంలో ఆయన జరిపిన సరస సంభాషణల ఆడియో రికార్డింగులు తన వద్ద ఉన్నాయంటూ, కొన్నాళ్ళ క్రితం ఓ వివాదాస్పద నటి బాహాటంగా రచ్చ చేసింది. అప్పట్లో ‘మీ టూ’ ఉద్యమానికి పోస్టర్ గర్ల్ గా మారిన ఆ సంచలనాత్మక నటి మాటలకు ఈ దర్శకుడు డొంక తిరుగుడు వివరణలే ఇచ్చారు. అంతేతప్ప, ప్రత్యేకించి ఏమీ చెప్పలేదు. ఈ నేపథ్యంలో తెరపై ఆదర్శాలు వల్లించడంలో ముందుండే ఆ దర్శకుడిపై కొత్తగా ఈ పుకారు వినపడ్డాయి. దీంతో, తెలియని జనం నివ్వెరపోతున్నారు. అయితే, వింటున్న వివరాలను బట్టి చూస్తే, ఇది గాలివార్త అంటూ మరీ కొట్టిపారేయలేం.

          ఇంతకీ ఈ వాద వివాదాల మాటెలా ఉన్నా, మళ్ళీ అదే ప్రశ్న. ఆ హీరోయిన్ ఎందుకు తప్పుకుంది… మాస్టారూ!? దర్శకుడితో ఇబ్బంది పడలేకనేనా? లేక మరేదైనా కారణమా? ఫిల్మ్ నగర్ లో ఇప్పుడు ఇదో బేతాళ ప్రశ్న.