అల్లు అర్జున్, శర్వానంద్‌ల లాస్… విజయ్ దేవరకొండకు గెయిన్!

91
Vijay Deverkonda
Vijay Deverkonda with Arjun Reddy

కొన్నిసార్లు అంతే… ఎవరికో అనుకున్నది మరెవరి చేతికో వస్తుంది. ఎవరి చేతిలోదో… ఇంకెవరి నోటికో చేరుతుంది. అందుకే, హిందీలో ‘దానే… దానే.. పే ఖానేవాలే కా నామ్ హై’ అని ఓ సామెత. అంటే, ప్రతి గింజ మీదా అది తినేవాడి పేరు రాసి ఉంటుందని అర్థం. సినిమాల విషయంలో అది అక్షరాలా నిజం. ఈ వారం ప్రేమికుల దినోత్సవానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్‌’గా అలరించడానికి సిద్ధమవుతున్న విజయ్ దేవరకొండను చూస్తే ఆ మాటే అనిపిస్తుంది. ఇవాళ సినిమారంగంలో బలమైన లవర్ పాత్రలంటే విజయ్ గుర్తుకొస్తున్నారు. అందుకు కారణం ఆయన చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా. కానీ, ఆ స్క్రిప్టుకు ఫస్ట్ ఛాయిస్ ఆయన కాదని తెలిస్తే షాకవుతారు. ఆ ప్రాజెక్టును మిస్సయిన మరో స్టార్ హీరో అల్లు అర్జున్ అని తెలిస్తే మరీ షాకవుతారు. ఆ షాకింగ్ కబుర్లు… మిస్సయిన మంచి ప్రాజెక్టు విశేషాలు…

        ఇవాళ అల్లు అర్జున్ పేరు చెప్పగానే… లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ‘అల వైకుంఠపురములో’  చిత్రం గుర్తొస్తుంది. కెరీర్ లోని ఈ అతి పెద్ద హిట్ చిత్రం కన్నా ముందు దాదాపు అలాంటి మరొకటి ఆయన చేతుల దాకా వచ్చి, జారిపోయింది. తెలుసా? ఆ సినిమా మరేదో కాదు… ‘అర్జున్ రెడ్డి’.

        చాలామందికి తెలియని విషయం ఏమిటంటే – దర్శక, రచయిత సందీప్ రెడ్డి వంగా నిజానికి, ‘అర్జున్ రెడ్డి’ కథను మొట్టమొదట చెప్పింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు. ఆ కథ అల్లు అర్జున్‌కు బాగా నచ్చింది. కానీ, ఎక్కడో ఓ చిన్న సందేహం. కొంత బోల్డ్ గా ఉండే ఈ కథను తీరా తెర మీదకు ఎక్కిస్తున్నప్పుడు తనకు ఏవైనా సందేహాలు వచ్చి, కరెక్షన్లు చెబితే? అప్పుడు దర్శకుడు సందీప్ వంగా అనవసరంగా ఇబ్బంది పడతాడని అల్లు అర్జున్‌కు అనిపించింది. దాంతో, ఆ ప్రాజెక్టు చేయకుండా బన్నీ పక్కకు తప్పుకున్నారు.

        ఇవాళ శర్వానంద్ నటించిన ‘జాను’ చూసి, మంచి ప్రేమకథ చేశాడని అంటూ ఉన్నాం. కానీ, దీనికి ముందు ‘అర్జున్ రెడ్డి’ సైతం అతని దగ్గరకు వచ్చింది. శర్వానంద్ కు కూడా అప్పట్లో ఆ స్క్రిప్టు బాగా నచ్చింది. కానీ, తన ఇమేజ్ కు సరిపడదేమోనని లోపల అనుమానం పీకింది. దాంతో, శర్వానంద్ కూడా ‘అర్జున్ రెడ్డి’ ప్రాజెక్టును అలా మిస్సయ్యాడు.

        కొంతకాలంగా సినిమాలకు దూరం జరిగి, మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు మంచు మనోజ్. ఒకవేళ ఒకప్పుడు తన చేతి దాకా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ స్క్రిప్టుకు మనోజ్ ఓకే చెప్పి ఉంటే, అసలిప్పుడు ఇంత గ్యాప్ వచ్చేది కాదేమో! కానీ, అప్పట్లో మంచు మనోజ్ కూడా ఆ స్క్రిప్టును జడ్జ్ చేయలేక వదిలేసుకున్నాడు.

        అలాంటి పరిస్థితుల్లో సందీప్ వంగా ఆ కథను అనిష్టంగానే విజయ్ దేవరకొండకు చెప్పారు. ఆ కథ విజయ్ దేవరకొండకు బాగా నచ్చింది. మొదట ఏమో అనుకున్నా, దర్శకుడు సందీప్ సైతం విజయ్‌ దేవరకొండతో బాగా దగ్గరయ్యారు. అలా వాళ్ళిద్దరూ కలసి, కష్టపడి తీర్చిదిద్దుకున్న సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో, వివాదాలతో ఎంత సంచలనం రేపిందో, ఎన్నెన్ని భాషల్లోకి వెళ్ళిందో… ఇవాళ ఓ పెద్ద చరిత్ర. అందరికీ తెలిసిన విషయం. ఆ ఒక్క సినిమాతో తెలంగాణ ప్రాంతం నుంచి విజయ్ దేవరకొండ అనే సామాన్యుడు సూపర్ స్టార్ అయ్యాడు. ఫలానా కుటుంబం, ఫలానా వాళ్ళ అబ్బాయి, మనుమడు లాంటి తోకలేమీ లేకుండానే ఇవాళ పరిశ్రమలో ఓ స్టార్ హీరో స్టేటస్ అనుభవిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ స్క్రిప్టు మీద విజయ్ దేవరకొండ అని విధి రాసి పెట్టి ఉంటే, అది మరొకరికి ఎలా వెళుతుంది లెండి!

………………………….