రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’ రిలీజ్ వాయిదా… తెర వెనుక కారణాలేమిటి?

66
RRR
RRR release date

ఇటీవల అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా – రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’ హఠాత్తుగా ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తూ వచ్చిన ప్రకటనతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల చేయనున్నామంటూ ఇటీవలే ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలసి నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎందుకు పోస్ట్ పోన్ అయ్యిందన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ. ఆ తెర వెనుక కారణాలు ఏమిటంటే…

నిజానికి, ‘ఆర్.ఆర్.ఆర్.’ సినిమా గత ఏడాది ప్రారంభమయ్యాక, మొదట్లో విలేఖరుల ముందుకు వచ్చినప్పుడే ఆ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా దర్శక, నిర్మాతలు ప్రకటించేశారు. ఆ లెక్కన నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్.’ ఈ ఏడాది జూలై 30న విడుదల కావాలి. అయితే, సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయంటూ మొదటి నుంచి అనుకుంటున్నదే. ఇటీవల కొంత కాలంగా రానున్న దసరా సెలవుల కానుకగా, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి సినిమా రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. తీరా చూస్తే, దసరా, దీపావళి కాదు… ఏకంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2021 జనవరి 8వ తేదీకి ‘ఆర్.ఆర్.ఆర్.’ పోస్ట్ పోన్ చేస్తున్నామంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది. అంటే, సినిమా రిలీజ్‌కు దాదాపుగా మరో సంవత్సరం సమయం ఉందన్నమాట.

‘ఆర్.ఆర్.ఆర్.’ రిలీజు వాయిదా గురించి కృష్ణానగర్‌లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

జక్కన్న చెక్కుడు వల్లనేనా…?

అందులో ఒకటి – రాజమౌళి పర్ఫెక్షనిజమ్. ఏ సినిమానైనా రిలీజు ముందు క్షణం వరకు ఓ అందమైన శిల్పంలాగా చెక్కి, చెక్కి తీర్చిదిద్దడం రాజమౌళికి ఉన్న అలవాటు. సెట్లోనూ, బయటా ఆయనకున్న ఈ అలవాటు వల్లే చిత్ర యూనిట్ ఆయనను అభిమానంగా జక్కన (అమరశిల్పి జక్కన పేరుతో…) అని పిలిస్తుంటారు. ‘ఆర్.ఆర్.ఆర్.’ విషయంలో కూడా రాజమౌళి తొందరపడదలచుకోలేదు. సినిమాను తీర్చిదిద్దడానికి ఆయన సమయం తీసుకుంటున్నారు. పైగా, రాజమౌళి ఫక్కీలో ఆర్.ఆర్.ఆర్. కు కూడా షూట్లు, రీషూట్లు తప్పట్లేదు. అందుకే, ఆయనకు సంతృప్తికరంగా రావడం కోసమే ఈ రిలీజు వాయిదా అంటున్నారు.

అలియా భట్ డేట్లు… అద్భుతమైన గ్రాఫిక్స్‌ తో సమస్య?

మరొకటి – షూటింగ్‌లో జాప్యం కారణమంటున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రీకరణ మొదలై చాలాకాలమైనా, ఇప్పటి వరకు అనేక షెడ్యూల్స్ షూటింగులు జరిగాయి కానీ, సినిమా పూర్తయింది మాత్రం తక్కువేనట. ఇప్పటికీ చాలా భాగం షూట్ చేయాలట. కీలకమైన విలన్ పాత్రలో అజయ్ దేవ్‌గణ్, అతని భార్యగా శ్రియ ఇటీవలే సెట్స్‌ మీదకు వచ్చారు. వాళ్ళ పోర్షన్లు కూడా తీయాల్సినవి చాలానే ఉన్నాయి. మరోపక్క ఈ చిత్రంలో కీలకమైన కథానాయిక పాత్ర పోషిస్తున్న హిందీ నటి అలియా భట్ డేట్ల సమస్య ఉండనే ఉంది. ఆమె డేట్లకు తగ్గట్టుగా సినిమా తీసేందుకు దర్శక, నిర్మాతలు సిద్ధమయ్యారు. సర్వసాధారణంగా హీరో డేట్లను బట్టి మిగతా ఆర్టిస్టులందరూ ఎడ్జస్ట్ అవుతారు. ఒక్కోసారి హీరో కోసం సహనంతో ఎదురుచూస్తారు. కానీ, ‘ఆర్.ఆర్.ఆర్.’ హీరోల పరిస్థితి రివర్స్ అయింది. అలియా భట్ డేట్స్ కోసం అగ్ర తెలుగు హీరోలు ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. ఇది కూడా సినిమా ఆలస్యానికీ, రిలీజ్ వాయిదాకూ కారణం అంటున్నారు.

రిలీజ్ వాయిదాకు గ్రాఫిక్స్ వర్క్ కూడా ఒక కారణమే. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చారిత్రక కథానేపథ్యపు కాల్పనిక ఊహాచిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. సహజంగానే ఆ కాలాన్ని తెరపై తీసుకువచ్చేందుకు బోలెడన్ని గ్రాఫిక్స్ అవసరం. ఆ వర్క్ కూడా జరుగుతోందంట. కానీ, ముందుగా ఉనుకున్న జూలై డేట్‌కు షూటింగ్, గ్రాఫిక్స్ అన్నీ పూర్తిచేయడం కష్టమని రాజమౌళి బృందానికి అర్థమైంది. దాంతో, అనివార్యంగా సినిమా రిలీజు వాయిదా వేశారని మరో కథనం.

బాలీవుడ్ పెద్దలు ఇచ్చిన సలహా?

బాహుబలి తరువాత మళ్ళీ ఆ స్థాయిలో అఖిల భారత సినిమాగా ‘ఆర్.ఆర్.ఆర్.’ను ప్రమోట్ చేసుకోవాల్సి ఉంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడం, హిందీ భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్.ఆర్.ఆర్.’ను విడుదల చేయనున్నారు. కాబట్టి, అన్ని భాషల్లో వీలు చూసుకొని, ఒకే తేదీకి, పెద్ద ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చేలా రిలీజ్ చేయాలని యూనిట్ భావించింది. ఆ మేరకు హిందీ చిత్ర సీమకు సంబంధించిన కరణ్ జోహార్, తదితర బృందం కూడా రాజమౌళి టీమ్‌కు సలహా ఇచ్చిందని ఫిల్మ్ నగర్ గాలివార్త. ఇవన్నీ ఆలోచించాక, చివరకు దసరా కన్నా జనవరి 8న రిలీజ్ చేస్తే బెస్ట్ అనుకుంది. దానివల్ల కనీసం పది రోజుల పైగా సెలవులు కలిసొచ్చి, భారీ ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

సంక్రాంతికి సింగిల్ గానే…

మొత్తం మీద కారణాలు ఏమైనా, ఎన్నయినా ‘ఆర్.ఆర్.ఆర్.’ కోసం అభిమానులు అందరూ కోసం మరో ఏడాది పాటు వెయిట్ చేయక తప్పదు! రిలీజుకు ఇంకా ఏడాది సమయం ఉందనగా… ఇప్పుడే ఎందుకు ప్రకటించేశారంటే… దసరా, దీపావళికి రిలీజు కావాల్సిన ఇతర పెద్ద హీరోల చిత్రాలకు లైన్ క్లియర్ చేయడం కోసమే. అలాగే, వచ్చే ఏడాది జనవరికి సంక్రాంతి కానుకగా తమ ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రం వస్తోందని చెప్పడం ద్వారా సంక్రాంతి బరికి ముందుగానే కర్చీఫ్ వేసుకోవాలన్న ప్లాన్ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్లలో ‘ఆర్.ఆర్.ఆర్.’ రిలీజ్ ఖాయం కాబట్టి, వచ్చే సంక్రాంతికి ఇక పోటీగా సినిమాలు రాకపోవచ్చు. మహేశ్ బాబు సినిమా సహా అనేకం వస్తే డిసెంబర్‌కో, లేదంటే ‘ఆర్.ఆర్.ఆర్.’ రిలీజైపోయి, హడావిడి తగ్గాక మరో డేట్‌ కో వస్తాయన్నమాట.
…………………..