పవన్ కల్యాణ్‌కు… నలభై కోట్లు ఇస్తామంటూ ప్రపోజల్!

461

పవన్ కల్యాణ్… ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో ఓ హాట్ స్టార్. సినిమాల్లో ఉన్నప్పటి నుంచి ఆయనకు సూపర్ క్రేజున్నా… తీరా ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళి, సినిమా రంగంలో మళ్ళీ కాలు మోపాక ఆయనకున్న క్రేజు మరింత పెరిగింది. కుటుంబ పోషణ, రాజకీయ పార్టీ నిర్వహణ నిమిత్తం సినిమాలు చేయడం తప్పదని గ్రహించి, మళ్ళీ కెమెరా ముందుకు వచ్చిన దగ్గర నుంచి పవన్ కల్యాణ్ తెగ బిజీగా ఉన్నారు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు.

ఇప్పటికే… ఒకటికి మూడు సినిమాలు!

          ఓ పక్క రాజకీయ పర్యటనలు, ప్రకటనలు చేస్తూనే… మరోపక్క హిందీ హిట్ ‘పింక్’ చిత్రం తెలుగు రీమేక్ ‘వకీల్ సాబ్’‌తో పవన్ కల్యాణ్ తీరిక లేకుండా గడుపుతున్నారు. హిందీ మాతృకను కొద్దిగా మార్చి, తమిళంలో అజిత్‌తో ఈ సినిమాను ‘నెర్కొండ పార్వై’ పేరిట రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తమిళ మార్పులను అనుసరిస్తూ, ఈ తెలుగు రీమేక్‌లోనూ పవన్ కల్యాణ్ పోషిస్తున్న వకీలు పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్, ఆ పాత్రకు ఓ భార్య పాత్ర (తెలుగులో ఇప్పుడు శ్రుతీహాసన్ చేస్తున్నారు) కూడా కలిపారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ సినిమాతో పాటు మరో పక్క క్రిష్ దర్శకత్వంలో మరో విభిన్న చారిత్రక కథా చిత్రం షూటింగులో కూడా పవన్ కల్యాణ్ పాల్గొంటున్నారు. ఈ వేసవిలో ‘వకీల్ సాబ్’ విడుదల. క్రిష్ సినిమా కూడా చకచకా షూటింగ్ చేసేస్తున్నారు. ఈ రెండు సినిమాల తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రం ఉంటుంది.

40 కోట్లిస్తామంటున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

          అలా ఇప్పటికే పవన్ కల్యాణ్ చేతిలో ఒకటికి మూడు సినిమాలున్నాయి. అయితే, ఇంతలోనే మరో నాలుగో సినిమాకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. మూడు సినిమాలు ఇంకా అవక ముందే నాలుగో సినిమా ఏమిటని ఆశ్చర్యపోకండి. ఇప్పుడు పవన్ కల్యాణ్ తో సినిమా కోసం నిర్మాతలు అలా అర్రులు చాస్తున్నారు మరి! ఇంతకీ ఆ కొత్త ప్రతిపాదన ఎవరిదంటారా… ఇటీవల వరుసగా సినిమాలు నిర్మిస్తూ, తాజాగా అనుష్కతో నిశ్శబ్దం అనే బహుభాషా చిత్రాన్ని ముందుకు తెస్తున్న చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఆ సంస్థ అధినేత – టి.జి. విశ్వప్రసాద్. అమెరికాలో టెక్నాలజీ వ్యాపారం చేస్తూ, వేల కోట్ల రూపాయలు సంపాదించిన ప్రవాస భారతీయుడు విశ్వప్రసాద్ మన అచ్చతెలుగు రాయలసీమ బిడ్డ. కర్నూలు ప్రాంతానికి చెందిన ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన ఆయన సినిమా పట్ల ప్రేమతో అయితేనేమి, మరే ఇతర వ్యక్తిగత కారణాలతో అయితేనేం… జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. మరో సినీ ప్రముఖుడు వివేక్ కూచిభొట్ల ఆయనకు కుడిభుజంగా నిలబడి, ఇండియాలో చిత్రనిర్మాణ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. రాజకీయ నాయకులతో కూడా వీలైనంత మంచిగా ఉంటూ, వారికి సాయం చేయడంలో, ఆంతరంగికంగా భుజాలు రాసుకుంటూ గడపడంలో నేర్పున్న విశ్వప్రసాద్ ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

‘డిస్కోరాజా’ నిర్మాత కూడా లైన్‌లో…?

          ఆ ప్రతిపాదనపై ప్రస్తుతం చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ కొత్త సినిమా కోసం పవన్ కల్యాణ్‌కు ఏకంగా 40 కోట్లకు పైగా పారితోషికం ఇవ్వడానికి కూడా విశ్వప్రసాద్ సారథ్యంలోని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ముందుకొచ్చింది. పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం… తరువాతి పనులు చేయడానికి సంస్థ ప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. కాగా, మరోపక్క ఇటీవలే రవితేజతో ‘డిస్కో రాజా’ చిత్రం తీసిన మరో ప్రవాస భారతీయుడు రామ్ తాళ్ళూరి సైతం పవన్ కల్యాణ్‌తో సినిమా తీసే ప్రతిపాదనలో ఉన్నారు. జనసేన పార్టీకి సన్నిహితుడని పేరున్న రామ్ తాళ్ళూరి తో సినిమాకు పవన్ కల్యాణ్ కూడా సుముఖంగానే ఉన్నారని ఆంతరంగిక వర్గాలు చెబుతున్నాయి. అదే గనక వాస్తవమైతే, అప్పుడు ఏకంగా అయిదో సినిమా పవన్ కల్యాణ్ చేస్తున్నట్టు లెక్క. మళ్ళీ ఎన్నికలు, రాజకీయాల వేడి మొదలయ్యే లోగా పవర్ స్టార్ ఈ సినిమాల్లో ఎన్ని పూర్తి చేస్తారో చూడాలి. ఆ మాట ఎలా ఉన్నా… ఇలా వరుసగా పవన్ కల్యాణ్ సినిమా ప్రతిపాదనలు, వాటి వివరాలు మీడియాలో వస్తుండడంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.