‘ఓ పిట్ట కథ’… అమ్మో దిసీజ్ ఎ టూ… లాం….గ్ స్టోరీ! – O… Pitta Katha – Movie Review and Rating

172
O-Pitta-Katha
O-Pitta-Katha

సినిమా పేరు దగ్గర నుంచి ఇతివృత్తం, తీసే విధానం దాకా ప్రతి దాంట్లో కొత్తదనం కోరుకొనే తరం మొదలయ్యాక చిత్ర రూపకల్పన మెదడుకు మేతే. అలా కొత్త తరహాలో, కొత్త వాళ్ళతో సినిమా తీయాలనుకోవడం ఏటికి ఎదురీత అయినా, ఇప్పుడు తప్పనిసరి. అలా చేసిన తాజా ప్రయత్నం ‘ఓ పిట్ట కథ.’

………………………….

చిత్రం – ‘ఓ పిట్ట కథ’, తారాగణం – సంజయ్ రావు, విశ్వంత్, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, సంగీతం – వివేక్ సాగర్, కెమెరా – ప్రవీణ్ లక్కరాజు, కెమెరా – నిర్మాత – వి. ఆనంద ప్రసాద్, రచన – దర్శకత్వం – చెందు ముద్దు, రిలీజ్ తేదీ – 6 మార్చి 2020

…………………………..

అవతలివ్యక్తులకు ఎవరి పిట్టకథ వారు వినిపించడం సహజం. ఎవరి కథ వింటే, వాళ్ళదే కరెక్ట్ లాగా అనిపిస్తూ, అసలు నిజం మాత్రం మరేదో ఉంటే… అప్పుడేమవుతుంది? మన కంటికి కనిపించే దృశ్యం, దాని ద్వారా మనకు కలిగే అభిప్రాయాలు అన్ని వేళలా నిజం కావు. కంటికి కనిపించినదానికి భిన్నంగా అసలు వాస్తవం మరేదో ఉండవచ్చు. చూసినవన్నీ నిజాలు కావు అనే ఈ రకమైన ఆలోచనతో రాసుకున్న చిత్రం – ‘ఓ పిట్ట కథ’.

ఊహించని మలుపులతో… చివరి దాకా సాగే సస్పెన్స్

కాకినాడలో వెంకటలక్ష్మీ టాకీస్ ఓనర్ వీర్రాజు (శ్రీనివాస్ భోగిరెడ్డి). భార్య పోయినా, కూతురు వెంకట లక్ష్మి అలియాస్ వెంకీ (నిత్యా శెట్టి)ని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటాడు. కాలేజీ చదువు చదువుకున్న వెంకట లక్ష్మి ఒక రోజు కారులో అరకు ప్రాంతానికి బయలుదేరి, అనుకోకుండా కనిపించకుండా పోతుంది.  

పోలీసు ఎస్సై (బ్రహ్మాజీ)కి వీర్రాజు, రష్యా నుంచి వచ్చిన అతని మేనల్లుడు క్రిష్ (విశ్వాంత్) కలసి కంప్లయింట్ చేస్తారు. సినిమా హాలులో తన మామయ్య దగ్గర పనిచేసే ప్రభు (బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు తెరంగేట్రం) మీద క్రిష్ అనుమానం వ్యక్తం చేస్తాడు. అందుకు తాను చూసిన సంఘటనలను వివరిస్తాడు. పోలీసులు వేట మొదలవుతుంది. ప్రభును పట్టుకుంటారు. తీరా ప్రభు కూడా తనదైన వెర్షన్‌ను వినిపిస్తాడు. ఇలా ఎవరికి వారు తమదైన కథనాలు చెప్పడంతో, ఇందులో ఏది నిజం, ఎవరు దోషి అనే ఆసక్తి కొనసాగుతుంది. ఒక దశలో ప్రభు దోషి అనిపిస్తే, మరోదశలో వెంకటలక్ష్మి కిడ్నాప్ వీడియో దొరకడంతో క్రిష్ దోషిగా అనిపిస్తాడు. ఆ ఇద్దరిలో ఎవరు దోషి అని ఉత్కంఠ రేపుతూ ఫస్టాఫ్ ముగుస్తుంది.

సెకండాఫ్‌లో ఈ ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం దర్శకుడు చేశారు. ఫస్టాఫ్‌లో కనిపించే అనేక సన్నివేశాలకు కంటికి కనిపించని మరో కొత్త కోణం ఉందంటూ, రివర్స్ యాక్షన్ చూపిస్తారు. ఆ క్రమంలో జరిగే ఆసక్తికర సంఘటనలు, ప్రభు, క్రిష్ పాత్రల తాలూకు నేపథ్యాల వివరణలతో సినిమా సాగిపోతుంది. చివరకు అసలు దోషి ఎవరనేది తెలుస్తుంది. కథ కంచికి వెళుతుంది.

అక్కడక్కడే గుడుగుడు గుంజం…

ఆఖరు దాకా అసలు దోషి ఎవరనేది ఊహకు అందనివ్వకుండా, రకరకాల మలుపులతో ముందుకు తీసుకెళ్ళిన చిత్రం ఇది. స్క్రీన్ ప్లే కూడా ఆ రకంగానే రాసుకున్నారు. కానీ, ఒక దశకు వెళ్ళాక… మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో పాత సన్నివేశాల రివర్స్ యాక్షన్ వ్యవహారం వచ్చాక కథ అక్కడక్కడే గుడుగుడు గుంజం తిరుగుతున్నట్టు ఉంటుంది. వెరసి, తెరపై విషయం ముందుకు వెళ్ళట్లేదనే భావన ప్రేక్షకులకు కలిగితే తప్పు పట్టలేం.

కెమెరా వర్క్, పాటలు బాగున్నా…

 అయితే, నిర్మాణ విలువలు, కోనసీమ అందాలను చూపించే డ్రోన్ కెమెరా వర్క్ లాంటివి బాగున్నాయి. సంగీతం ఫరవాలేదనిపిస్తుంది. ఈ సినిమాలో పాటలన్నీ గీతఖండికలే తప్ప, పూర్తిస్థాయి పాటలు వాకువు. పల్లవి, ఒక చరణానికే పరమితమైన ఈ సంక్షిప్త గీతాలలో కూడా ఒకటి రెండు బాగున్నాయి. ‘నీదన్నదే నీకందదా… మనిషి ముసుగులోనే అసురాంశ దాగి ఉంటే…’ అంటూ వచ్చే శ్రీజో రచన, ‘ఓ కొంటెదానా…’ లాంటివి వినడానికి బాగున్నాయి.

 గతంలో చిరంజీవి ‘అంజి’ చిత్రంలో బాలనటిగా చేసిన నిత్యాశెట్టి ఈ సినిమాలో హీరోయిన్. చూడడానికి ఒకప్పటి అవికా గోర్‌ను తలపించిన ఈ అమ్మాయి బాగానే నటించింది. బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావుకు ఇది తొలి చిత్రం. ఒడ్డూ పొడుగూ బాగానే ఉన్నా, నటనలో తను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని ఈ సినిమా చెప్పకనే చెప్పింది. గతంలో కేరింత తదితర చిత్రాలలో నటించిన విశ్వాంత్ ఫరవాలేదనిపిస్తాడు. హీరోయిన్ తండ్రి పాత్రలో శ్రీనివాస్ భోగిరెడ్డి తన వాచికం, నటనతో కొన్నాళ్ళు గుర్తుంటారు.

  పక్కదారి పట్టిన కథా కథనం…             

అయితే, కొత్త వాళ్ళను తీసుకొని చేసిన ఈ ప్రయత్నాన్ని మరీ పూర్తిగా కొట్టిపారేయలేం. గతంలో ‘మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే..’, ‘ఈ సినిమా హిట్టు… ఇది గ్యారెంటీ’ లాంటి ఒకటి, రెండు చిత్రాలు అందించిన దర్శక, రచయిత చెందు ముద్దు ఈసారి ఈ కొత్త తరహా కథ, కథన శైలిని ఎంచుకున్నందుకు అభినందించాలి. అయితే, రచనలో, దర్శకత్వంలో అతనింకా రాటుదేలాల్సి ఉందని అతకని కామెడీ టైమింగ్ లాంటి చోట్ల అనిపిస్తుంది. కొన్నిచోట్ల మంచి డైలాగులు రాసుకున్నా, సందర్భాన్ని అవి ఎలివేట్ చేయలేకపోవడం మరో లోపం. సినిమాలో బలవంతాన జొప్పించిన కామెడీ కూడా అక్కడక్కడ కథనానికి అడ్డుపడింది. అసలు కథను వదిలేసి, విషయం పక్కదారి పట్టిందనే భావన కూడా కలుగుతుంది.

ఆ రకంగా చూసినప్పుడు పేరుకే ఇది పిట్టకథ… నిజానికి ఇది అక్కడక్కడే తిరుగుతూ, కొన్నిసార్లు విసుగు తెప్పేంచే లాం…గ్ స్టోరీ! ఆ రకంగా సినిమాకు పెట్టిన ‘ఎ లాంగ్ స్టోరీ’ అనే ట్యాగ్ లైన్ సరిగ్గా అతికినట్టు సరిపోతుంది.

కొసమెరుపు –

సినిమా చివరకు వచ్చేసరికి ఒక కమెడియన్ పాత్ర, హీరో హీరోయిన్లను ఉద్దేశించి ‘ఇంక చాల్లే ఆపండి! చూడలేక చచ్చిపోతున్నాం!’ అంటుంది. అచ్చంగా ఆ సమయానికి అది ప్రేక్షకుల మనసులోని మాటే. హాలులోని ప్రేక్షకులు ఆ మాటతో ఏకీభవించి, నవ్వుకోవడమే అందుకు నిదర్శనం.

బలాలు

          – ఎవరు తప్పు చేశారన్నది తెలియనివ్వకుండా కథలో చివరి దాకా సాగే సస్పెన్స్

          – సంగీతం (రీరికార్డింగ్), కెమెరావర్క్, నిర్మాణవిలువలు

          – కొత్త నటీనటులైనా, ఫరవాలేదనిపించడం.

          – ఫస్టాఫ్‌లో వచ్చే ప్రతి కీలక సన్నివేశానికీ సెకండాఫ్‌లో ఊహించని ఒక రివర్స్ యాక్షన్ చూపించడం.

బలహీనతలు

          – అసలు కథ కొంచెమైతే, కొసరు సన్నివేశాలు ఎక్కువైపోవడం. కథ ఎంతసేపటికీ అక్కడక్కడే తిరగడం.

          – ప్రతి సన్నివేశానికీ వచ్చే ఊహించని రివర్స్ యాక్షన్ ఒక దశకు వెళ్ళాక మొనాటనీ అనిపించడం.

          – అక్కడక్కడా పంచ్ డైలాగులుగు బాగున్నా, అవి సందర్భానికి అంతగా అతకకపోవడం.

          – సాగదీత కథనం. కామెడీ టైమింగ్, డైలాగ్ టైమింగ్ కుదరకపోవడం.

పంచ్ లైన్ – పిట్ట కొంచెం… నిడివి ఘనం! అమ్మో… దిసీజ్ రియల్లీ… ఎ లాం…గ్ స్టోరీ!!

రేటింగ్ – 2/ 5