ఇలా తీస్తున్నారేమిటప్పా… ‘నారప్ప’ !?

144

తెలుగు సినిమాకు ఇప్పుడు రీమేక్‌ల కాలం. వరుసగా బోలెడు రీమేక్స్ వస్తున్నాయి.

వరుసగా బోలెడు రీమేక్‌లు…

పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ (హిందీ ‘పింక్’ కు రీమేక్), రామ్ ‘రెడ్’ (తమిళ హిట్ ‘తడమ్’ కు రీమేక్), వెంకటేశ్ ‘నారప్ప’ (తమిళ ‘అసురన్’ కు రీమేక్), తెలుగు నేటివిటీతో ‘కేరాఫ్ కంచరపాలెం’ తీసిన వెంకటేశ్ మహా తీస్తున్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (మలయాళ ‘మహేషింటె ప్రతీకారమ్’ కు రీమేక్), నితిన్ కొత్త సినిమా (హిందీ ‘అంధా ధున్’ కు రీమేక్) – ఇలా రాగల కొద్దినెలల్లో వరుసగా అనేక రీమేక్ చిత్రాలు రానున్నాయి. వీటన్నిటిలోకీ సహజంగానే పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’, తమిళంలో సంచలనం రేపిన ‘అసురన్’ కు రీమేక్‌గా వెంకటేశ్ చేస్తున్న ‘నారప్ప’ – అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

రీమేక్స్ రాజా… వెంకటేశ్ కోసమా?

        కెరీర్‌లో ఎక్కువ భాగం రీమేక్ చిత్రాలకు ఓటేసిన హీరో వెంకటేశ్. ఆయన తాజా రీమేక్ ‘నారప్ప’ షూటింగ్ శరవేగంతో సాగుతోంది. దళిత జీవితాల ఆధారంగా తమిళంలో వచ్చిన ఓ నవలను తీసుకొని, దర్శకుడు వెట్రిమారన్ ధనుష్ హీరోగా ‘అసురన్’ తీశారు. అక్కడ సంచలన హిట్టయిన ఆ సినిమా రీమేక్ కోసం తమిళ ఒరిజినల్ నిర్మాత కలైపులి ఎస్. ధాను కష్టపడుతున్నారు. తెలుగు రీమేక్‌ కోసం వెంకటేశ్ పక్షాన నిర్మాణ భాగస్వామి అయిన సురేశ్ ప్రొడక్షన్స్ డి. సురేశ్ బాబు అచ్చం అలాగే తమిళం లానే ఉండాలని చూస్తున్నారు. ఆ చిత్ర నిర్మాణం గురించి గమ్మత్తైన అనేక సంగతులు విశ్వసనీయంగా తెలిశాయి.

        ప్రస్తుతం మదురై దగ్గరలో…

        ఇప్పటికి దాదాపు రెండు నెలలుగా నారప్ప షూటింగ్ ఏకధాటిన సాగుతోంది. ప్రస్తుతం తమిళనాడులోని మదురైకి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని కోవిల్ పట్టి ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నారు. ఒక ఫ్లాష్ బ్యాక్ ఘట్టం మినహా సినిమాలో అత్యధిక భాగం అక్కడే చిత్రీకరిస్తున్నారు. తమిళంలో ధనుష్ చేసిన పాత్రను వెంకటేశ్ చేస్తుంటే, అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టు పశుపతి చేసిన పాత్రను ఇక్కడ రాజీవ్ కనకాల పోషిస్తున్నారు. మరి కొద్ది రోజులు అక్కడే షూటింగ్ జరగనుంది. మార్చి 20 ప్రాంతాలకు కానీ ఆ యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి రాదని సమాచారం.

        ఫ్రేమ్ టు ఫ్రేమ్ జిరాక్స్ రీమేకే! అంతేగా… అంతేగా…?

        ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల దర్శకుడైన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి అంతకు మించిన విశేషం ఒకటుంది. అదేమిటంటే, తమిళ ఒరిజనల్‌ను పక్కనపెట్టుకొని మరీ మక్కికి మక్కీగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఈ చిత్రం తీస్తున్నారట. పాత్రధారుల కట్టుబొట్టు దగ్గర నుంచి సెట్ ప్రాపర్టీలు, లైటింగ్ దాగా ప్రతి షాటూ తమిళ ఒరిజనల్‌లో ఉన్నట్టే తెలుగు రీమేక్‌లోనూ ఉండేలా అతి జాగ్రత్త తీసుకుంటూ ఉండడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. హిట్ లేకపోవడంతో సరైన విజయం కోసం అర్రులు చాస్తున్న దర్శకుడు, ఒరిజినల్ లాగానే రీమేక్ కూడా ఉండాలనే హీరో, నిర్మాతలు తోడయ్యేసరికి ఈ రకమైన జిరాక్స్ రీమేక్ తయారవుతోందని కృష్ణానగర్‌లో చెప్పుకొంటున్నారు.

            రీమేక్… కాస్తా పెద్ద మేకు కాకుండా ఉండాలంటే…

ఆ మాట ఎలా ఉన్నా… ఒకటి మాత్రం అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎంత రీమేక్ అయినా మరీ అంతగా మానిటర్‌లో చూసుకుంటూ ఫ్రేముకు ఫ్రేము యథాతథంగా తీయాలా? సినిమా లాంటి సృజనాత్మక కళారూపాలు ఆకట్టుకొనేది కేవలం దృశ్యాల వల్ల కాదు… అవి ప్రేక్షకులలో సృష్టించే భావసంచలనం వల్ల అనే వాస్తవం మన వాళ్ళకు ఎప్పుడు తెలుస్తుందో? ఫ్రేమ్ టు ఫ్రేమ్ జిరాక్సు లాగా ఉండే రీమేక్‌లను కాకుండా… ఆ సన్నివేశం, కథ తాలూకు సారాన్ని, భావాన్ని మనసుకు హత్తుకొనేలా చెప్పడం కీలకమని ఎప్పుడు అర్థమవుతోందో? ఆ చిన్న లాజిక్‌ను మర్చిపోయి జిరాక్సు రీమేక్‌లు తీస్తే, తయారయ్యేది జీవం ఉట్టిపడే అందమైన శిల్పం కాదు… ప్రాణ విహీనమైన అందమైన గాజు బొమ్మ. దర్శక, నిర్మాతలూ ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మానిటర్ పక్కన పెట్టుకొని ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ తీయాలనే తాపత్రయం మాని, మాతృకలోని ఆత్మను తెరపై ఆవిష్కరిస్తే… వాళ్ళకూ, ప్రేక్షకులకూ కూడా మేలు. ఆత్మ లేని శరీరంలా… రీమేకు కాస్తా పెద్ద బండ మేకు అయ్యే ప్రమాదం ఉంది. అంతేగా… అంతేగా…! వెంకటేశ్ జీ… వింటున్నారా?