కరోనా దెబ్బతో… ఓవర్సీస్ మార్కెట్ ఇక జీరో? సినీ వెబ్‌సైట్లకు ఇది గ్రేట్ అమెరికా బ్లో??

488

           కరోనా వైరస్ ఏమో కానీ… దాని దెబ్బకు ఇప్పుడు ప్రపంచం మొత్తంతో పాటు సినిమా పరిశ్రమ కూడా క్యా కరోనా అని దిగులుగా కూర్చొని ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో సినిమాలు, టీవీల షూటింగులు ఆగిపోవడం, పనిలేకపోవడం సినీ కార్మికులకు జీవన సమస్య తెచ్చిపెట్టింది. అసలు ఈ పరిస్థితి ఎప్పటికి మామూలు అవుతుందో అంచనా తెలియకపోవడం దిగులుతో పాటు గుబులు పుట్టిస్తోంది. ఏప్రిల్ 14 దాకా ఉన్న లాక్ డౌన్‌ను ఆ తరువాత కూడా పొడిగిస్తారో, ఆ పైన ఎన్నాళ్ళకు జనజీవితం మామూలు అవుతుందో తెలియని పరిస్థితుల్లో సినిమా పరిశ్రమపై ఆధారపడ్డ బడుగు ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

        నిజం చెప్పాలంటే, ఇప్పుడు సినీ పరిశ్రమలోని కార్మికులే కాదు… పరిశ్రమ మొత్తం సంక్షోభంలో ఉంది. కరోనా వైరస్ ధాటికి తెలుగు సినిమా ఎదుర్కొనే తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయి? పరిశ్రమ మళ్ళీ మునుపటిలా కళకళలాడుతుందా?

ఇది… సినిమాలు లేని సమ్మర్ కానుందా?

        ఏప్రిల్ 14 తరువాత దేశంలో లాక్ డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తివేత సాధ్యం కాకపోవచ్చు. కొన్ని సడలింపులు వచ్చినా, షరతులతో జన ప్రవాహం మీద నియంత్రణ కొనసాగవచ్చు. ఏ రకంగా చూసినా అది సినిమాల నిర్మాణానికి కానీ, విడుదల, ప్రదర్శనలకు కానీ అనుకూలం కానే కాదు. పైపెచ్చు. లాక్ డౌన్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్టేట్ సిలబస్ లో పదో తరగతి పరీక్షలు ఇంకా పూర్తి కానే లేదు. డిగ్రీ, యూనివర్సిటీ పరీక్షలు అంతే. కాబట్టి, రేపు లాక్ డౌన్ ఎత్తేశాక కూడా పిల్లల పరీక్షలు, ఆ వెంటనే కాలేజీలో కొత్త అడ్మిషన్లతో పిల్లలు, తల్లితండ్రులు బిజీగా ఉంటారు. ఆ రకంగా చూస్తే, మే, జూన్ నెలలు సైతం ఎవరూ సినిమాలు చూసే మూడ్ లో ఉండరు. కాబట్టి, కరోనా తగ్గి, సినిమా హాళ్ళు తెరిచినా, ఈ సమ్మర్ లో చెప్పుకోదగ్గ కొత్త సినిమాల సందడి ఉండదు. మరోపక్క ఇప్పటికే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ 5, ఆహా లాంటి ఓ.టి.టి. ప్లాట్ ఫారమ్‌లు జనానికి బాగా అలవాటయ్యాయి. లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఇలా సినిమాలు చూడడం అలవాటైంది కాబట్టి, చిన్న సినిమాలను థియేటర్లలో కాకుండా, ఇంట్లోనే కూర్చొని చూసే వీలున్న ఈ ఓ.టి.టి. ప్లాట్ ఫారమ్‌లలో నేరుగా రిలీజు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా కొందరు నిర్మాతలు యోచిస్తున్నారు. అయితే, పెద్ద సినిమాలు ఆ పని చేసే పరిస్థితి ఉండదు కాబట్టి, ఈ సమ్మర్ కు తెలుగు నాట సినీ వినోదం దాదాపు లేనట్టే లెక్క. ఇప్పటికే ఉగాది, శ్రీరామనవమి లాంటి పెద్ద పండుగలను కూడా నిరాడంబరంగా జరుపుకొన్న జనం… సమ్మర్ సినీ పండుగను కూడా అలాగే కానిచ్చేయక తప్పదు.

మారనున్న షూటింగుల లెక్క…

మరోపక్క షూటింగుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. దేశంలో లాక్ డౌన్ ఎత్తేశాక కూడా చిత్ర నిర్మాణం ఇప్పుడిప్పుడే మునుపటి స్థాయిలో జరగకపోవచ్చు. సర్వసాధారణంగా సినిమా షూటింగ్ అంటే, ఆ చిత్రం స్థాయిని బట్టి ప్రతిరోజూ లొకేషన్‌లో 50 నుంచి 150 మంది దాకా యూనిట్ సభ్యులుంటారు. కానీ, అందరం సన్నిహితంగా ఉంటూ, సమష్టిగా పనిచేయాల్సిన సెట్లలో కరోనా వైరస్ దెబ్బతో సోషల్ డిస్టెన్సింగ్ అనే సూచన కొద్దిగా కష్టమే. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ఎంతమంది అలా షూటింగ్ చేస్తారన్నది ఒక ప్రశ్న. కరోనా వైరస్ కు మందో, టీకానో వచ్చే దాకా చాలామంది తటపటాయిస్తారు. కాబట్టి, ఏ రకంగా చూసినా మరో మూడు నుంచి నాలుగు నెలలు షూటింగులకు గడ్డు కాలమే. ఒకవేళ షూటింగ్ చేసినా, ఒకప్పటిలా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఫెఫ్సీ) లాంటి సంఘాలు కనీసం ఇంతమంది కార్మికులకు ఉపాధి ఇవ్వాల్సిందే అంటూ గతంలో పెట్టిన నిబంధనలను నిర్మాతలు గాలికి వదిలేసి, పరిమిత యూనిట్ నే పెట్టుకొనే సూచనలున్నాయి. ఇక, సందట్లో సడేమియాగా ఇప్పుడు నిర్మాత రోజువారీ షూటింగ్ బడ్జెట్‌లో భాగంగా సెట్ లో శానిటైజర్లు, టిస్యూలు, సబ్బులకు అదనపు ఖర్చు వచ్చి చేరనుంది.  

        కొద్ది నెలలు ఓవర్సీస్ లేనట్టేనా?

భారత్‌లోనే కాదు… అమెరికా, బ్రిటన్, యూరప్ సహా అనేక గల్ఫ్ దేశాల్లోనూ కరోనా విజృంభణతో తెలుగు సినిమా ఓవర్సీస్ మార్కెట్ పరిస్థితి ఏంటి? దాని ప్రభావం మన సినిమాల నిర్మాణం, రిలీజులపై ఎలా ఉంటుందన్నది ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న.

        కొత్త మిలీనియమ్‌లో గడచిన ఇరవై ఏళ్ళ కాలంలో తెలుగు సినిమాకు ఓ పెద్ద బిజినెస్ మార్కెట్ – ఓవర్సీస్. వివిధ దేశాల్లో స్థిరపడ్డ భారతీయుల పుణ్యమా అని… ఈ విదేశీ సినీ ప్రదర్శన మార్కెట్ ఎప్పటికప్పుడు విస్తరిస్తూ వచ్చింది. మాస్ హీరోలకు ఓవర్సీస్ మార్కెట్ తక్కువే. కానీ సూపర్ స్టార్లకూ, క్లాస్ హీరోలకూ, రాజమౌళి, త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల లాంటి క్లాస్ దర్శకులకూ అక్కడ మార్కెట్ ఎక్కువే. సగటున చూస్తే, చెప్పుకోదగ్గ హీరో నటించిన, దర్శకుడు తీసిన తెలుగు సినిమా వ్యాపారంలో దాదాపు పదిశాతం దాకా ఓవర్సీస్ బిజినెస్ ఉంటుంది. ఇది ట్రేడ్ వర్గాల ఉజ్జాయింపు లెక్క. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఇప్పటికే అమెరికా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, దుబాయ్ సహా తెలుగు సినిమాకు ఆదరణ ఉన్న దేశాలన్నీ ప్రకటితమైనా, అప్రకటితమైనా లాక్ డౌన్ పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రాణనష్టం, ఆరోగ్య భయంతో పాటు తీవ్రమైన నిరుద్యోగం, ఆర్థిక అభద్రతల్లో చిక్కుకుపోయాయి. సినిమా హాళ్ళు మూతబడడం అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో దేశంలో లాక్ డౌన్ ఎత్తివేశాక కూడా ఎన్ని కొత్త సినిమాలు వస్తాయి, వస్తే ఎలా వస్తాయి, వాటిని చూసేందుకు ఎంతమంది జనం గుంపుల మధ్యకు సినిమా హాళ్ళలోకి వస్తారు లాంటి ఎన్నెన్నో జవాబు తెలియని ప్రశ్నలున్నాయి. ఓవర్సీస్‌లో సినిమాకు జనాన్ని ఆశించే పరిస్థితులు కనుచూపు మేరలో కనపడడం లేదు.

        బడ్జెట్లు… హీరోల రెమ్యూనరేషన్లకు రీ-చెక్!

అలాగే పెరిగిపోయిన ఆరోగ్యభయం, ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో రాగల కొద్ది నెలలు విదేశాల్లో తెలుగు సినిమాల నిర్మాణం జరిగే పరిస్థితులు కూడా లేవు. విదేశీ షూటింగుల కోసం ప్రణాళిక వేసుకున్న సినిమాలు సైతం ఇప్పుడు కథలను మార్చుకొనే పనిలో పడ్డాయి. ఎగబడి చూసే జనమూ ఉండరు గనక, ఓవర్సీస్‌లో మన సినిమాల భారీ రిలీజును కొద్ది కాలం పాటు మర్చిపోవచ్చు. అమెరికా లాంటి చోట్ల ప్రీమియర్లు, అక్కడ ఫస్ట్ వీకెండ్ లో ఇన్ని మిలియన్ల కలెక్షన్లు అని చెప్పుకోవడం కూడా ఒకప్పటి సంగతిగా మారనుంది. దాంతో, హీరోల ఓవర్సీస్ మార్కెట్ కు ఇదో పెద్ద దెబ్బ కానుంది. ఫలితంగా, సదరు హీరోల భారీ రెమ్యూనరేషన్లు, వారి సినిమాల వందల కోట్ల బడ్జెట్లు ఇక దివి నుంచి భువికి దిగి రాక తప్పదు.

ఓ సూపర్ స్టార్ తమతో సినిమా చేయడం కోసం ఏకంగా అర్ధశత కోటి మొత్తం ఆఫర్ చేసిన ఓ చిత్ర నిర్మాణ సంస్థ గురించి ఆ మధ్య వార్తలు విన్నాం. బహుశా, కరోనా మునుపటి కాలపు ఆ లెక్కలేవీ ఇప్పుడు పనిచేయకపోవచ్చు. అలాంటి చెక్కు ప్రతిపాదనలు, వచ్చిన సినిమా ప్రకటనలు రీ-చెక్‌కు వస్తాయి. ఆ పాత లెక్కలతో ముందుకు సాగడం కరోనా కాలంలో కష్టమే. వెరసి, కరోనా అనంతర కాలంలో హీరోల పారితోషికం కూడా దాదాపు 30 నుంచి 50 శాతం దాకా తగ్గక తప్పదు. డబ్బు రొటేషన్ లేని వేళ… పలువురు నిర్మాతలు సైతం భారీ బడ్జెట్ లు భరించే సత్తా లేక మరోసారి చిన్న కథలు, చిన్న సినిమాల వైపు చూడక తప్పదు. దాంతో, ఆ తరహా సినిమాలకు ఊహించని రీతిలో కొత్త ఊపిరి వచ్చే సూచనలున్నాయి.

        వెబ్ సైట్లకు గ్రేట్ అమెరికా దెబ్బ!

        ఓవర్సీస్ మార్కెట్ దెబ్బ తినిపోవడం వల్ల సినిమా నిర్మాతలకూ, దర్శకులకూ, హీరోలకూ ఎంత దెబ్బ ఉందో, అంతకు మించిన దెబ్బ చాలా భాగం సినిమా వెబ్ సైట్ల పై ఉండనుంది. ఇప్పటి దాకా ఓవర్సీస్ మార్కెట్లు, అక్కడి జనాన్ని ఆకర్షించడం కోసం రివ్యూ రేటింగుల కోసం సినీ ప్రముఖులు అనేక వెబ్ సైట్లను పెంచి, పోషిస్తున్నారు. ఇష్టమున్నా, లేకపోయినా కొన్ని బ్లాక్ మెయిలింగ్ వెబ్ సైట్లను నిత్యం మచ్చిక చేసుకుంటూ వచ్చారు. వెబ్ సైట్లకు వాణిజ్య ప్రకటనలు, స్పెషల్ వార్తల షేరింగులు, చందన తాంబూలాది సత్కారాలు చేస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడసలు ఓవర్సీస్ మార్కెట్టే లేకపోయాక ఆ బతిమాలుడు అగత్యం సినీ దర్శక, నిర్మాతలకు ఉండదు. ఫలితంగా, ఇప్పటి దాకా నెగటివ్ వార్తలు, రివ్యూ రేటింగులే బలంగా బతికిన వెబ్ సైట్లకు ఊహించని దెబ్బ తగలనుంది.

        వెబ్ మీడియాకు లక్షల్లో నష్టం!

        ప్రింట్ మీడియాకే ప్రకటనలు లేని పరిస్థితుల్లో… పేరున్న వెబ్ సైట్లకు కూడా వాణిజ్యం భారీగా పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మచ్చుకు ఓ ఉదాహరణగా చెప్పాలంటే… గ్రేట్ ఆంధ్రా డాట్ కామ్ లాంటి విస్తృత పాపులారిటీ ఉన్న బలమైన వెబ్ సైట్‌కు కేవలం ల్యాండింగ్ పేజ్ యాడ్ ఒక్కదానికే ప్రతిరోజూ 60 వేల రూపాయలు (18 శాతం జి.ఎస్.టి. కాక) నిర్మాతలు చెల్లించేవారు. ఇప్పుడు సినిమాల రిలీజులే కనాకష్టం కనక, ఆ ఆదాయం వెబ్ సైట్లకు పోయినట్టే. పేరున్న సైట్లకు దాదాపు ప్రతి రోజూ ఇలాంటి ల్యాండింగ్ పేజీ యాడ్ ఉంటుంది కనుక నెలకు రూ. 18 లక్షల ఆదాయం కేవలం ల్యాండింగ్ పేజీ మీదే వాటికి పోయినట్టు. గ్రేట్ ఆంధ్రా లాంటి పేరున్న సైట్లకే ఇంత ఆర్థిక నష్టం అంటే, కేవలం చిన్నా చితకా యాడ్స్ మీద నడుస్తూ, సినిమా రిలీజంటే బ్యానర్ యాడ్స్ లాంటివి బాంధవ్యాలతో, బెదిరింపులతో తీసుకొనే కొన్ని చిల్లర మల్లర సైట్ల మనుగడ ఏమిటన్నది ప్రశ్నార్థకమే.

            నిర్మాతలు లైట్ తీసుకోవడం ఖాయం!

        నిజానికి, ఇవాళ ఒక మాదిరి చిన్న సినిమాకు సైతం కోటి రూపాయలు పబ్లిసిటీ ఖర్చవుతోంది. ఇక, ఓ మోస్తరు పెద్ద సినిమాకైతే ఆ బడ్జెట్ ఏకంగా 2 కోట్ల దాకా ఉంటోంది. అంత ఖర్చు చేయనిదే ఆసలు ఆ సినిమా రిలీజైందన్న విషయమే జనంలోకి తెలియడం లేదు. కానీ, ఇప్పుడీ కరోనా కాలంలో నిర్మాతలు ఆ బడ్జెట్లను నియంత్రించక తప్పదు. సినిమా హాళ్ళకు వచ్చి చూసేవాళ్ళు లేక, హక్కులు కొనేవాళ్ళు లేక ఓవర్సీస్ మార్కెట్టే దాదాపు శూన్యమైపోతుండడంతో, వెబ్ సైట్లను దర్శక, నిర్మాతలు ఇక తేలికగా తీసుకోవడం ఖాయం. నెగటివ్ వార్తలకూ, రివ్యూ రేటింగులకూ భయపడాల్సిన పనిలేదు కాబట్టి, వాటికి యాడ్స్ తప్పనిసరిగా ఇవ్వాలనీ అనుకోరు. దాంతో, ఇప్పటి దాకా రాజవైభోగాలు అనుభవించిన సినిమా వెబ్ సైట్లకు గడ్డుకాలం తప్పేలా లేదు. కొందరు ప్రముఖ నిర్మాతలు ఇప్పటికే ఈ ఆలోచనపై సన్నిహితులతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. పబ్లిసిటీ బడ్జెట్‌ను, అందులోనూ మొహమాటాలకో, భయాలకో పోయి సాగిస్తున్న కొన్ని రకాల వెబ్ పబ్లిసిటీలకూ ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలని వాళ్ళు భావిస్తున్నారు. అందుకు తగిన సమష్టి ప్రణాళికా రచన కోసం ప్రయత్నిస్తున్నారని ఫిల్మ్ నగర్ భోగట్టా.

        పరిశ్రమలో ప్రక్షాళనకు సువర్ణావకాశం!

        ‘ఒకరికి తెద్దునా… ఇద్దరికి తెద్దునా… అందరికీ తెద్దునా…’ అని  పాత కాలపు నానుడి ఒకటి ఉంది. మొత్తానికి, కరోనా వైరస్ కాదు కానీ,  ఒకటి, రెండూ కాదు… ప్రపంచంలో ప్రతి రంగమూ దెబ్బతినిపోయింది. సినిమా రంగం, దాని మీద ఆధారపడ్డ అలవిమాలిన వెబ్ సైట్లకు కూడా దెబ్బ గట్టిగానే పడింది. ఒకరకంగా పాజిటివ్ గా చూస్తే, పరిశ్రమలోని అనేక అనారోగ్యకరమైన ధోరణుల ప్రక్షాళన కోసం ఇది ఊహించని రీతిలో ప్రకృతి ఇచ్చిన అవకాశం. బడ్జెట్ ను అదుపులో ఉంచుకోవడానికీ, వీలైనంత తక్కువ మంది యూనిట్ తోనే చిత్ర నిర్మాణం సాగించడానికీ, వెబ్ సైట్లు సహా అనేక అనవసరపు పబ్లిసిటీ ఖర్చు తగ్గించుకోవడానికీ అనుకోకుండా అందివచ్చిన వరం. మరి, ఇప్పటికైనా అదుపు తప్పిన సినిమా బడ్జెట్లు, హీరోల అనూహ్యమైన రెమ్యూనరేషన్లు, ప్రాఫిట్ షేరింగులు, అనవసరపు పబ్లిసిటీ ఖర్చుల విషయంలో పరిశ్రమతో పాటు దాని అనుబంధ విభాగాలూ పాఠాలు నేర్చుకుంటాయా? కరోనా కాలంలో నిష్పాక్షికంగా ఆత్మవిమర్శ చేసుకుంటాయా?