Sankarabharanam reminiscences – ఒక్కసారి నలభై ఏళ్లు వెనక్కి వెళ్ళిన దర్శకుడు కె. విశ్వనాథ్

89

”మా అన్నయ్య దర్శకుడు కె. విశ్వనాథ్ ‘శంకరాభరణం’ చిత్ర రూపకల్పనలో అక్షరాలా తపస్సు చేశారు. ప్రతి మాటలో, దృశ్యంలో, అభినయంలో ఆయన పూర్తిగా లీనమై, అందరితో కలసి పనిచేశారు. చేయించుకున్నారు. నిర్మాతలు, నటీనటులం, సాంకేతిక నిపుణులం అందరం సమష్టిగా కృషి చేసి, విశ్వనాథ్ చెప్పినట్లు, ఆయనకు కావాల్సినట్టు చేశాం. అందుకే, ఇప్పటికీ ఆ సినిమా సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసినా, ఇలాంటివే మాకు ఆత్మతృప్తినీ, చిరకీర్తినీ ఇస్తాయి” అని సీనియర్ నటుడు చంద్రమోహన్ అన్నారు. సినీ కళాఖండం ‘శంకరాభరణం’ విడుదలై, నలభై ఏళ్ళు నిండిన సందర్భంగా జరిగిన ‘శంకరాభరణం – నలభై వసంతాల ఆనందోత్సవం’లో పాల్గొంటూ, చంద్రమోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఎన్నో ప్రివ్యూలు వేసినా, వ్యాపారం జరగని ఆ చిత్రం ఆ తరువాత తెలుగునేలపైనే కాక, తమిళనాడు, కర్ణాటక, కేరళతో సహా దేశదేశాల్లో ఎంతటి అఖండ ఆదరణ సాధించినదీ ఆయన వివరించారు. పూలు, పచ్చటి మామిడి ఆకుల అలంకరణతో ఆత్రేయపురానికి చెందిన ‘బాపు – రమణ అకాడెమీ’ పక్షాన బ్నిమ్, వేగిరాజు సుబ్బరాజు నిర్వహించిన ఈ వేడుకతో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ పండుగ కళను సంతరించుకుంది. బుధవారం నాడు దర్శకుడు కె. విశ్వనాథ్ పుట్టినరోజు రానుండడంతో, విశ్వనాథ్ దంపతులను అందరూ అభినందనలతో ముంచెత్తారు.

తరాలు మారినా… ఇప్పటికీ …

ముందుగా ‘శంకరాభరణం’ డిజిటల్ వెర్షన్‌ను ప్రదర్శించి, అనంతరం నట, సాంకేతిక నిపుణులకు సత్కారం నిర్వహించారు. క్రిక్కిరిసిన ప్రేక్షకులు, వివిధ రంగాల పెద్దల మధ్య, సినిమాకు ఆద్యంతం చప్పట్లు, కేరింతలు, ఆగని కన్నీటి ఉద్విగ్నక్షణాలతో ఈ ఉత్సవం సాగింది. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారులు ఏడిద రాజా, శ్రీరామ్‌లతో పాటు వారి కుటుంబసభ్యులు, కె.విశ్వనాథ్ కుటుంబ సభ్యులు, అభిమానులు, సినిమా పెద్దలు పలువురు ఈ వేడుకలో పాల్గొన్నారు. సభికులందరూ కలసి చివరలో పుష్పాభిషేకం చేయడంతో, దర్శకుడు కె. విశ్వనాథ్ తన స్పందన తెలియజేస్తూ, ”ఇవాళ ఇంతమంది మాటలు, వారి జ్ఞాపకాలు, అనుభూతులు వింటూ ఉంటే, మళ్ళీ ఒక్కసారి నలభై ఏళ్ళు కాలం వెనక్కి వెళ్ళినట్టుంది” అని ఆనందం వ్యక్తం చేశారు. ఏడిద రాజా – ఏడిద శ్రీరామ్‌లు మాట్లాడుతూ, తరాలు మారినా, ఇవాళ్టికీ పిల్లలు చూసి, ఆనందిస్తున్న సినిమా ‘శంకరాభరణం’ అంటూ తమ కుటుంబ సభ్యుల అనుభవాన్ని తెలిపారు.

అలాంటి సినిమాలు మళ్ళీ రావా?

అంతకు ముందు సినీ గీత రచయిత సీతారామశాస్త్రి మాట్లాడుతూ, “కాలానికి అతీతమైన దివ్యానుభూతి ‘శంకరాభరణం’. గంగను దివి నుంచి భువికి తీసుకురావడానికి బృహత్తర ప్రయత్నం చేసిన భగీరథుడి లాగా కళావృష్టి అనే గంగ కోసం నిర్మాతలు ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు కృషి చేస్తే, గంగను ధరించి, భరించి, భువికి పంపిన విశ్వనాథుడిలా కె. విశ్వనాథ్ సినీ ప్రపంచానికి ‘శంకరాభరణం’ అందించారు. ఆ సినిమా చూసి, నేను రాసిన ‘గంగావతరణం’ గీతం వల్లే, ఆ తరువాత నాకు సినీ రంగప్రవేశం, ‘సిరివెన్నెల’ చిత్రంలో అవకాశం దక్కాయి. భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఈ చిత్రం విడుదల తేదీని సాంస్కృతిక పునరుజ్జీవనం, జాగృతికి సంబంధించిన జాతీయ దినంగా ప్రకటించాలి” అని అభిప్రాయపడ్డారు.

రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ, ”ఇవాళ హాలులో ‘శంకరాభరణం’ చిత్రాన్ని చూస్తున్నా, ప్రేక్షకుల స్పందన నలభై ఏళ్ళ క్రితం లాగానే ఉండడం అపూర్వ”మన్నారు. ”పరిశ్రమ ఇంత పెరిగినా, ఇలాంటి చిత్రాలు, వాటిని తీసే దర్శకులు, నిర్మాతలు లేకపోవడం, రాకపోవడం శోచనీయం. సోషల్ మీడియా పెరిగిపోయి, సెల్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దర్శకుడైపోతున్న వేళ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్లలో ‘శంకరాభరణం’ చిత్రాన్నిపాఠ్యాంశంగా పెట్టాలి” అని ఆయన అన్నారు. “సినీ పరిశ్రమకే కాదు… మన జాతికీ, సంస్కృతికే ఆభరణం కె. విశ్వనాథ్. ఆయన లాంటి మరో దర్శకుడు లేరు, ఆయన తీసిన ‘శంకరాభరణం’ లాంటి సినిమాలు మళ్ళీ రావు. మా తరం నుంచి మళ్ళీ అలాంటి సినిమాలు ఆశిస్తే, నిరాశ ఎదురవుతుంది” అని దర్శకుడు హరీశ్ శంకర్ కుండబద్దలు కొట్టారు.

ఎన్టీఆర్ లేకుండా… కోటి రూపాయలు

‘శంకరాభరణం’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ, కీబోర్డ్ ప్లేయర్‌గా సంగీత శాఖలో పనిచేసిన మాధవపెద్ది సురేశ్, ఛాయాగ్రహణ శాఖలో బాలూ మహేంద్ర సహాయకుడిగా ఆయన తప్పుకున్నాక సినిమా ఛాయాగ్రహణ బాధ్యతలు మొత్తం నిర్వహించిన కస్తూరి, నటులు చంద్రమోహన్, భీమేశ్వరరావు, తులసి, డబ్బింగ్ జానకి, జిత్ మోహన్ మిత్రా తదితరులు ప్రత్యేకంగా ఈ ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. చిన్నవేషమైనా ‘శంకరాభరణం’ చిత్రం తన కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చిందని డబ్బింగ్ జానకి అన్నారు. ఇంట్లో భోజనం లేని పరిస్థితుల్లో చైల్డ్ ఆర్టిస్టుగా (మాస్టర్ తులసీరామ్ పేరిట) అవకాశమిచ్చి ఇంత స్థాయికి తెచ్చింది విశ్వనాథేనంటూ నటి తులసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. లొకేషన్ల వేట మొదలు ‘హల్లో శంకరశాస్త్రి..’ పాట రచన, గానం, నటన ద్వారా తన బహుపాత్రపోషణ గురించి జిత్ మోహన్ మిత్రా చెప్పారు. సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చిన అనుభవాల మొదలు అమెరికాలో జరిగిన దాదాపు పాతిక శంకరాభరణం సంగీత విభావరుల దాకా అనేక విశేషాలను మాధవపెద్ది సురేశ్ పంచుకున్నారు. దాంతో, సభికులు అందరూ నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళి, ఆనాటి ‘శంకరాభరణం’ జ్ఞాపకాలలో మునిగిపోయారు.

కమర్షియల్ చిత్రాల హోరు మధ్య చేసిన సాహసం, ఎన్టీఆర్ నటించకుండా తెలుగులో కోటి రూపాయల వసూళ్ళు సాధించిన తొలి సినిమా ‘శంకరాభరణ’మే అంటూ, అప్పట్లో ప్రముఖుల అభిప్రాయాలతో వినూత్న డిజైన్లు, కె. బాలచందర్ లాంటి వారితో ప్రత్యేక రేడియో కార్యక్రమాలతో లక్ష్మీ ఫిలిమ్స్ చేసిన పబ్లిసిటీ సంగతులను విశ్లేషకుడు రెంటాల జయదేవ గుర్తుచేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ ఉత్సవానికి రాజకీయ ప్రతినిధి పరకాల ప్రభాకర్, ప్రసాద్ ల్యాబ్స్ రమేశ్ ప్రసాద్, నిర్మాతలు అచ్చిరెడ్డి, శివలెంక కృష్ణప్రసాద్, డాక్టర్ కె. వెంకటేశ్వరరావు, దర్శకులు కాశీవిశ్వనాథ్, జనార్దన మహర్షి, కె. దశరథ్, బి.వి.ఎస్. రవి, నటులు తనికెళ్ళ భరణి, అశోక్ కుమార్, అనంతు, వంశీ చాగంటి, స్మితామాధవ్, ఆశ్రిత వేముగంటి, రచయితలు సాయినాథ్, జలంధర, జర్నలిస్టులు స్వప్న, ‘మా’ శర్మ, లక్ష్మీ మేడపాటి, ఇందిరా పరిమి తదితరులు హాజరయ్యారు.