40 years of sankarabharanam: ఆ జిల్లాలో… పాతిక వేలకు కొంటే… పాతిక లక్షలొచ్చింది!

178

        

          కొన్ని సినిమాల కథ చాలా చిత్రంగా ఉంటుంది.

          రిలీజు కోసం అతి చిన్న మొత్తాలకు కూడా ఎన్ని కష్టాలు పడతాయో… తీరా రిలీజయ్యాక అంతకు పదింతలు సంతోషం పంచి, కొన్ని పదుల రెట్లు లాభాలు ఆర్జించిపెడతాయి. అందుకు బ్రహ్మాండమైన ఉదాహరణ… కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ‘శంకరాభరణం’. ఇప్పటికి సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం విడుదల కోసం నానా ఇబ్బందులు పడి, తీరా విడుదలయ్యాక అఖండ ఆదరణనూ, ఆ స్థాయిలో ఆదాయాన్నీ తెచ్చిపెట్టిన కళాత్మక చిత్రం అది.

          అప్పట్లో ‘శంకరాభరణం’ కొనేవాళ్ళే లేరు!

          జె.వి. సోమయాజులు లాంటి ఓ పెద్ద వయసు నటుడు శాస్త్రీయ సంగీత విద్వాంసుడైన శంకరశాస్త్రి ప్రధానపాత్ర. వ్యాంప్ వేషాలు, డ్యాన్సులు చేస్తున్న మంజుభార్గవిదేమో కథకు కీలకమైన, పవిత్రమైన తులసి పాత్ర.. ‘శంకరాభరణం’ లాంటి క్లాసిక్ టైటిల్. అలా ఒక సంగీత ప్రధాన చిత్రం తీయడం ఆ రోజుల్లో సాహసమే. జంధ్యాల మాటలు, వేటూరి పాటలు, కె.వి. మహదేవన్ సంగీతం, ఎస్పీబీ – వాణీ జయరామ్‌ల గాత్రమాధుర్యం. అంతా బాగానే ఉంది. కానీ, సినిమా నిర్మాణం పూర్తయ్యాక కొనేవాళ్ళే లేరు.

          సినిమాను కొనుక్కొని, పంపిణీ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లకు షోల మీద షోలు వేస్తూనే ఉన్నారు. చూసినవాళ్ళంతా బ్రహ్మాండం అంటున్నారు. కానీ, కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. చివరకు, అప్పట్లో ప్రధాన సినీ పంపిణీసంస్థ అయిన విజయవాడ లక్ష్మీఫిలిమ్స్ వారు ముందుకొచ్చారు. ఆ సంస్థ అధినేత లింగమూర్తి సినిమాకు సంబంధించిన ల్యాబ్ బాకీలన్నీ కట్టేసి, రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. తమిళనాడుకు నటుడు మేజర్ సౌందర్ రాజన్, నటి మనోరమ హక్కులు కొన్నారు.

                చంద్రమోహన్ బాకీకి జమగా…

          రిలీజుకు సిద్ధమవుతుండగా… లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు ఓ చిన్న సర్దుబాటు చేయాలన్నారు. నెల్లూరు జిల్లా వరకు మాత్రం మరెవరికైనా సినిమా పంపిణీ ఇమ్మన్నారు. మరోపక్క నిర్మాత ఏమో, తమ చిత్రంలో మరో ప్రధాన పాత్ర ధరించిన నటుడు చంద్రమోహన్‌కు పారితోషికం విషయంలో పాతికవేలు బాకీ. ఆ బాకీ కింద నెల్లూరు జిల్లా హక్కులు తీసుకోమని చంద్రమోహన్‌ను అభ్యర్థించారు. కానీ, ఆయన మాత్రం సినిమా రిలీజు వ్యాపారం తనకొద్దంటూ ససేమిరా అన్నారు.

          చంద్రమోహన్ వద్దన్నారు! మల్లెమాల సై అన్నారు!!

          పనిలో పనిగా మద్రాసు సవేరా హోటల్ వారికీ, మల్లెమాలకూ షో వేశారు. చివరకు ‘మల్లెమాల’గా పేరొందిన నిర్మాత ఎం.ఎస్. రెడ్డికి ‘శంకరాభరణం’ తెగ నచ్చేసింది. నెల్లూరు జిల్లా హక్కులు తీసుకోవడానికి ముందుకొచ్చారు. అయితే, అప్పటికే చిత్రనిర్మాణంలో నష్టాల పాలైన ‘మల్లెమాల’ లాంటి వాళ్ళకు అప్పులిచ్చిన సాక్షాత్తూ చంద్రమోహన్ లాంటి వాళ్ళేమో అది దుస్సాహసం అవుతుందేమో అని హెచ్చరించారు. అయినా, మల్లెమాల మాత్రం, ఇలాంటి మంచి సినిమాకు మనం అండగా నిలబడకపోతే ఎలా? మహా అయితే, ప్రొడక్షన్‌లో డబ్బు పోయిందనుకుంటా అని తనకు తానే నచ్చజెప్పుకున్నారు. నిర్మాత ఇవ్వాల్సిన బాకీ మల్లెమాల ద్వారా చంద్రమోహన్‌కు వచ్చేసింది. మల్లెమాలేమో తమ శాంతి పిక్చర్స్ ద్వారా నెల్లూరు జిల్లాలో ఆ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్ళారు.

          ఎట్టకేలకు ‘శంకరాభరణం’ రిలీజైంది.  1979 చివరలో సెన్సార్ జరుపుకొన్న చిత్రం ఎట్టకేలకు 1980 ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైంది. రిలీజు రోజు ఉదయం విజయవాడ అప్సరా ఏ.సి. థియేటర్‌ వద్ద షామియానాలు వేసి, డోలు, సన్నాయి, మంగళవాద్యాలతో సుస్వర సంగీతంతో ప్రేక్షక జనాన్ని ఆహ్వానించారు. జనం పల్చగా ఉన్నా… సినిమా చూసి, బయటకు వచ్చినవాళ్ళంతా బరువెక్కిన గుండెలతో, కంట తడితో ఇంటి దారి పట్టారు. మొదటి రెండు రోజులు జనం సో… సో. కానీ, ఆ తరువాత అసలు అద్భుతం జరిగింది.

          రెండు రోజుల్లో మౌత్ టాక్ కార్చిచ్చు అయింది. హాళ్ళు పట్టనంత జనం… అసలు టికెట్లే దొరకనంత క్రేజు… రిక్షా వాడి నుంచి సంగీత రసికుల వరకు అందరి నోటా ఆహా ఓహోలు… సినిమా ఏడాది పైనే ఆడింది. లక్షల్లో ఆదాయం వచ్చింది. తెలుగులోనే కాదు… భాష, ప్రాంతాల సరిహద్దులను చెరిపేసి, తమిళ, కన్నడ, మలయాళ సీమల్లోనూ ‘శంకరాభరణం’ పాటలు, సినిమా జనాన్ని ఊపేశాయి. ఎక్కడ విన్నా అవే పాటలు… ఎవరి నోట విన్నా అదే సినిమా.

           మల్లెమాల దశ మార్చిన ‘శంకరాభరణం’

           ఆ రోజుల్లో ‘అడవి రాముడు’ లాంటి బ్లాక్ బస్టర్ కమర్షియల్ సినిమాకు తీసిపోని వాణిజ్య విజయం ‘శంకరాభరణం’ది అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రోజుల్లో సినిమా రిలీజుకు ఒక ప్రింటుకు రెండు వేల చిల్లర ఖర్చయ్యేది. స్థానికంగా పబ్లిసిటీకి మరో రెండు, మూడు వేలు. ఆ రోజుల్లో పాతికవేల రూపాయలకు ఇస్తానంటే చంద్రమోహన్ వద్దన్న నెల్లూరు జిల్లాలో ‘శంకరాభరణం’ ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే షాక్ అవుతాం. 25 వేలకు కొన్న ఆ ఒక్క జిల్లాలో ‘శంకరాభరణం’ దాదాపు 25 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. అప్పట్లో అది ఓ సంచలనం. సినిమా ప్రొడక్షన్‌లో తరచూ నష్టాల పాలవుతూ వచ్చిన ఎమ్మెస్ రెడ్డి ఆ ఒక్క సినిమాతో బ్రహ్మాండంగా నిలదొక్కుకున్నారు.

          తెలుగు సినిమాకు ఇంటర్నేషనల్ పాస్‌పోర్ట్!

          ఇక, అవార్డుల మాటకొస్తే… ఎన్నెన్నో. ‘శంకరాభరణం’తో తెలుగు సినిమాకు తొలిసారిగా జాతీయ స్థాయిలో స్వర్ణకమలం (ఉత్తమ చిత్రం కేటగిరిలో ప్రత్యేక ప్రశంసగా) దక్కింది. జాతీయ, రాష్ట్రస్థాయుల్లో ఎన్నెన్నో అవార్డులు. నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావుకు పేరూ, డబ్బూతో పాటు అపారమైన గౌరవం వచ్చింది. అప్పటికే పేరున్న దర్శకుడు కె. విశ్వనాథ్‌ను సినీ శిఖరాగ్రానికి చేర్చింది. ‘కళాతపస్వి’గా మార్చింది.

          ఇవాళ్టికీ ఆ దర్శక, నిర్మాతలకు, నటీనటులకూ, సాంకేతిక నిపుణులకూ దేశ విదేశాల్లో పాస్‌పోర్టు, వీసా ఒకటే – ‘శంకరాభరణం’. ఇటీవల ‘బాహుబలి’ వచ్చేంత వరకూ సమకాలీన కలర్ తెలుగు సినిమాకు ఇంటర్నేషనల్ అడ్రస్ కూడా ఆ సినిమానే! నలభై ఏళ్ళే కాదు… మరో నూట నలభై ఏళ్ళయినా తెలుగు సినిమా చిరకీర్తి పతాక… ‘శంకరాభరణం’. ఆ సినిమాకు వేటూరి రాసిన పాటల పద్ధతిలోనే చెప్పాలంటే… మళ్ళీ… ‘దొరకునా ఇటువంటి’ సినిమా!

             (‘శంకరాభరణం’ చిత్రం విడుదలై నలభై ఏళ్ళయిన సందర్భంగా… చాలామందికి తెలియని ఓ జ్ఞాపకం)