సమంత, శర్వానంద్‌ల జంట… ఇక మహాసముద్రం

63

హీరోయిన్ సమంత, హీరో శర్వానంద్‌ల జంట ఇప్పుడిక ‘మహాసముద్రం’. అవును. ఆ ఇద్దరి కాంబినేషన్ ఇప్పుడు మంచి హాట్. వారిద్దరి కాంబినేషన్‌లో తమిళ సూపర్ హిట్ ‘96’ చిత్రానికి రీమేక్‌గా ఈ ఫిబ్రవరిలో ‘జాను’ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇంకా ప్రచారం దశలో ఉండగానే, ఈ జంట మరో సినిమాకు కమిటయ్యారు. అదే – ‘మహాసముద్రం’.

ఈ పేరెక్కడో విన్నట్టుందా. నిజమే. యువ దర్శకుడు అజయ్ భూపతి చాలాకాలంగా చేతిలో పట్టుకొని తిరుగుతున్న సబ్జెక్ట్. ‘ఆర్.ఎక్స్. 100’ లాంటి హిట్ చిత్రం అందించిన తరువాత దాదాపు ఏణ్ణర్ధంగా మరో సినిమా చేయకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చిన అజయ్ భూపతి కథ ఎట్టకేలకు ఓకె అయింది. గతంలో రవితేజ, రామ్, నాగచైతన్య లాంటి పలువురు హీరోలకు ఈ ‘మహాసముద్రం’ స్క్రిప్టును అజయ్ భూపతి వినిపించారు. రవితేజతో సినిమా మొదలైపోతుందని కూడా అనుకున్నా, ఆఖరి దశలో ఆగిపోయింది. మిగతా హీరోలతోనూ ఈ సబ్జెక్ట్ ఎందుకనో వర్కౌట్ కాలేదు.

ఎట్టకేలకు ఇప్పుడు ఈ ‘మహాసముద్రం’ కథకు మోక్షం వచ్చింది. సమంత, శర్వానంద్ జంటగా, అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ కథ తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వేసవి ఆరంభంలో ఈ చిత్రాన్ని ప్రారంభించి, డిసెంబర్‌కి కానీ, వచ్చే సంక్రాంతికి కానీ జనం ముందుకు తీసుకురావాలని ప్లాన్. మొత్తానికి, ఇప్పుడు సమంత, శర్వానంద్ ల జంటకు బాగానే క్రేజ్ ఉన్నట్టు కనిపిస్తోంది. రానున్న ‘జాను’… ఆ వెంటనే ‘మహాసముద్రం’. జాను హిట్టయితే, ఇక… ఆకాశమంత సమంత… మహాసముద్రమంత శర్వానంద్… అని రాయడం ఖాయం.