పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఇక లేనట్టేనా? సుధీర్ బాబు ఆశలపై నీళ్ళు!?

323

పుల్లెల గోపీచంద్… ప్రపంచ ప్రసిద్ధ బ్యాడ్మింటన్ కళాకారుడు. మన దేశం పక్షాన ఎంతోమంది బ్యాడ్మింటన్ తారలను తయారు చేసిన తెలుగు తేజం. ఇలాంటి ఓ క్రీడాకారుడు, ఉత్తమ కోచ్ కథను తెర మీదకు తీసుకురావాలని చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆ బయోపిక్ అటకెక్కినట్టే!

        గోపీచంద్ జీవితంపై ఓ స్పోర్ట్స్ బయోగ్రఫీ ఫిల్మ్ పూర్తి నిడివి చలనచిత్రంగా తీయాలని జరిగిన ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆ స్పోర్ట్స్ బయోపిక్ ఇక లేనట్టే అనిపిస్తోంది. ఆ ప్రాజెక్టు పూర్తిగా అటకెక్కిందని విశ్వసనీయ సమాచారం.

చాలాకాలంగా చెబుతున్న కథే…

        వివరాలలోకి వెళితే… చందమామ కథలు లాంటి సెన్సిబుల్ సినిమా, గరుడవేగ లాంటి యాక్షన్ సినిమా తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో పుల్లెల గోపీచంద్ జీవిత కథా చిత్రం తీయడానికి బోలెడు ప్రయత్నాలు జరిగాయి. స్వయంగా బ్యాడ్మింటన్ కళాకారుడు, పుల్లెల గోపీచంద్ దగ్గర నేర్చుకున్న శిష్యుడూ అయిన హీరో సుధీర్ బాబుతో తెరపై గోపీచంద్ పాత్ర చేయించాలని కూడా అనుకున్నారు. కొన్నేళ్ళుగా ఈ వార్త నలుగురిలో నానుతూ వచ్చింది. సుధీర్ బాబు సైతం తన ప్రతి ఇంటర్వ్యూలో ఆ ప్రాజెక్టు గురించి చెప్పుకుంటూ వస్తున్నారు.

బడ్జెట్ పరిమితుల వల్లేనా…?

అయితే, ఆ స్పోర్ట్స్ బయోపిక్‌కు బడ్జెట్ భారీగా అవుతుందని తేలింది. వీలైనంత వరకు బడ్జెట్‌ను నియంత్రించాలని ప్లాన్ వేసినా, అవేవీ కాగితం మీద కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. ఈ చిత్రం నిర్మాణానికి సహకరిస్తామంటూ ముందుకు వచ్చిన హిందీ చిత్ర నిర్మాణ సంస్థ సైతం బడ్జెట్ నిమిత్తం ఒక నిర్ణీత అంకెను నిర్ణయించింది. అన్ని కోట్ల రూపాయల లోపలే సినిమా పూర్తవ్వాలని షరతు పెట్టింది. కానీ, బడ్జెట్ అంతకు మించి చాలా అయ్యేలా కనిపించింది. దాంతో, చివరకు ఈ స్పోర్ట్స్  బయోపిక్ ప్రాజెక్టు చిక్కుల్లో పడింది.

మహేశ్, రామ్ ‌ల డేట్ల కోసం ప్రవీణ్ సత్తారు

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం… ప్రస్తుతానికైతే ఈ టీమ్ ఈ చలనచిత్రాన్ని నిర్మించనట్టే. ఈ ప్రాజెక్టు అటకెక్కడంతో, దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పటికే హీరో మహేశ్ బాబు, రామ్, తదితరులకు కొత్త కథలు చెబుతానంటూ అప్రోచ్ అవుతున్నారు. మరో పక్క ఈ స్పోర్ట్స్ బయోపిక్ లేకపోవడంతో, సుధీర్ బాబు సైతం తదుపరి చిత్రం కోసం ఇతర దర్శకులతో సంప్రతింపులలో పడ్డారు. సినిమా వాళ్ళ జీవితాల మాట అటుంచితే… తెలుగువారందరికీ గర్వకారణమైన పుల్లెల గోపీచంద్  జీవితం సినిమాగా రాకపోవడం బాధాకరమే. మేరీ కోమ్ లాంటి క్రీడా తారల సరసన నిలిచే మనవాడి జీవితానికి ఆ వెండితెర యోగం ఎప్పుడుందో చూడాలి.