ఊహించని మలుపులతో… మనసు దోచే అనుభవం… ‘కనులు కనులను దోచాయంటే’ – ‘Kanulu Kanulanu Dochayante’ Movie Review and Rating

130

కొన్ని సినిమాల టైటిల్స్ విన్నప్పుడే కొంత వైవిధ్యం అనిపిస్తాయి. చూసినప్పుడు కూడా అలాగే ఉంటే, ఆశ్చర్యం, ఆనందం అనిపిస్తాయి. బహుశా, ఇటీవల అలా అనిపించిన సినిమా ‘కనులు కనులను దోచాయంటే…’ ఒకప్పటి సూపర్ హిట్ ఏ.ఆర్. రెహమాన్ స్వరాలకు, రాజశ్రీ రాసిన పాట తాలూకు పల్లవిలోని మాటలవి. నిజానికి ఇది తమిళ చిత్రం ‘కన్నుమ్ కన్నుమ్ కొళ్ళై అడిత్తాల్’ కి అనువాద రూపం. అయితేనేం, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి డబ్బింగ్ అన్నదేమీ అడ్డు, అభ్యంతరం కాలేదు. వయాకామ్ 18 స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రం ఒకే రోజున తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.              

……………………………………………..

చిత్రం – ‘కనులు కనులను దోచాయంటే’, తారాగణం – దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ, కెమెరా – కె.ఎం. భాస్కరన్, సంగీతం – మసాలా కాఫీ, నేపథ్య సంగీతం – హర్షవర్ధన్ రామేశ్వర్, ఎడిటర్ – ప్రవీణ్ ఆంటోనీ, ఆర్ట్ – ఆర్.కె. ఉమాశంకర్, నిర్మాణం – వయాకామ్ 18 స్టూడియోస్ – ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, రచన – దర్శకత్వం – దేసింగు పెరియసామి , వ్యవధి – 162 నిమిషాలు, రిలీజ్ తేదీ – 2020 ఫిబ్రవరి 28

……………………………………………..

మలుపులు తిరిగే దొంగల కథ

          కథగా చెప్పాలంటే…  సిద్ (‘మహానటి’ చిత్రం ఫేమ్ దుల్కర్ సల్మాన్), అతని స్నేహితుడు కలసి ఘరానా మోసాలు చేస్తుంటారు. పైకి మాత్రం ఇంజనీర్, యానిమేటెడ్ గేమ్ డెవలపర్లం అని చెప్పుకుంటూ, కంపెనీ ల్యాప్ టాప్ల లోపలి పార్టులు మార్చేయడం, ఆధునిక సాంకేతికతతో కారు డోర్లు తెరిచి వాటిలోని ఖరీదైన సామాన్లు కొట్టేసి, అమ్మేయడం లాంటివి చేస్తుంటారు. ఆ రకంగా బోలెడు సంపాదిస్తుంటారు. వాళ్ళకు పరిచయమవుతారు మీరా (రీతూవర్మ), ఆమె స్నేహితురాలు. వారిద్దరినీ హీరో, అతని ఫ్రెండు పీకల లోతు ప్రేమిస్తారు. ఒక ల్యాప్ టాప్ విషయంలో పోలీసులు (పోలీస్ ఆఫీసర్‌గా దర్శకుడు గౌతమ్ మీనన్) అనుమానిస్తున్నారని తెలియగానే హీరో, అతని స్నేహితుడు తమ ప్రేయసులతో కలసి గోవాకు బిచాణా ఎత్తేస్తారు. అక్కడే హోటల్ వ్యాపారం చేస్తూ, స్థిరపడాలని అనుకుంటారు. ఇంతలో సదరు పోలీసు అధికారి వీళ్ళను వెతుక్కుంటూ… గోవాకు వచ్చి, హీరోనూ, అతని స్నేహితుణ్ణీ అదుపులోకి తీసుకుంటారు. కానీ, అక్కడే ఒక ఊహించని ట్విస్టు. అది ఏమిటన్నది ఎవరికి వాళ్ళు హాలులో చూస్తేనే అందం. వాళ్ళు తెచ్చిన లక్షలాది సొమ్ము కాస్తా కనిపించకుండా పోతుంది. దాంతో, ఇంటర్వెల్.

          డబ్బులు పోయి, రోడ్డున పడ్డ హీరో, అతని స్నేహితుడు సెకండాఫ్ మొదలైన దగ్గర నుంచి… పోయిన తమ డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ క్రమంలో వాళ్ళు ఢిల్లీ దాకా వెళతారు. అక్కడ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ప్రేయసులు ఏమయ్యారు? వాళ్ళ ప్రేమలో బలమెంత? వెంటాడిన పోలీసులు ఢిల్లీ దాకా వచ్చి, ఏం చేశారు? లాంటివన్నీ ఆసక్తికరమైన మలుపుల మధ్య సెకండాఫ్‌లో చూడవచ్చు.

మొదటి పావుగంటే… కొద్దిగా…

ఎప్పటికప్పుడు ఊహించని మలుపులతో, చూస్తున్న ప్రేక్షకులకు ఆద్యంతం థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించే కథలకు ఎప్పుడూ ఒక సానుకూలత ఉంటుంది. ఏ మాత్రం ప్రేక్షకులకు నచ్చినా, వాటిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు. కానీ, ఇలాంటి కథల్లో ఇతివృత్తం కన్నా కథాకథనం కీలకం. అది పుష్కలంగా ఉన్న సినిమా ఇది. నిజానికి, సినిమా మొదలైన పావుగంట, ఇరవై నిమిషాలు నిదానంగా, ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయితే, పోలీసు అధికారిగా గౌతమ్ మీనన్ ప్రవేశించినప్పటి నుంచి కథలో, కథనంలో వేగం, ఆసక్తి – రెండూ పుంజుకుంటాయి. అక్కడ నుంచి సినిమా ఒక్కో మెట్టూ పైకి ఎక్కుతూ వెళుతుంది. ఇంటర్వెల్ ఒక ట్విస్టు అయితే, ఆ తరువాత కూడా సినిమా క్లైమాక్స్ ముందు దాకా ఊహించని ట్విస్టులు రాసుకొని, వాటిని కన్విన్సింగ్‌గా చూపడం దర్శకుడి ప్రతిభ.

మలయాళ దుల్కర్ నోట… మళ్ళీ మన తెలుగు మాట

ఈ సినిమాలో తెలివైన మోసగాడిగా దుల్కర్ సల్మాన్, అతని ప్రేయసిగా రీతూ వర్మ – ఇద్దరూ బాగున్నారు. సహజంగా ఉన్నారు. పాత్రలోని బలం, వారి నటనకు తోడు తెలుగు డబ్బింగ్ కూడా వాళ్ళే చెప్పుకోవడం సినిమాకు ఒక కొత్త అందాన్ని తెచ్చింది. కథకు కీలకమైన మిగతా రెండు పాత్రలకు కూడా నటీనటులు సరిగ్గా సరిపోయారు. పోలీసు అధికారిగా గౌతమ్ మీనన్ అతికినట్టున్నారు. దర్శకత్వం మాటెలా ఉన్నా… ఆయనకు ఇక మరిన్ని యాక్టింగ్ అవకాశాలు దక్షిణాది చిత్రాలన్నిటిలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెకండాఫ్‌లో వచ్చే మరో స్పెషల్ పాత్రలో అనీశ్ కురువిల్లా నటించారు.

ఆకట్టుకొనే దృశ్యాలు…

రోడ్ ట్రావెల్ లాంటి దృశ్యాలు, అందమైన గోవా పరిసరాలు, డ్రోన్ కెమెరాలో బంధించిన ఢిల్లీలోని విల్లా దృశ్యాలు వగైరా తెరపై నిండుగా, కనువిందుగా అనిపిస్తాయి. అలాగే, హీరో బృందం అందరూ కలసి గోవాలో ప్రయాణిస్తూ పాడే పాట హాయిగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు, కెమెరా వర్క్, నేపథ్య సంగీతం, ఒకటి రెండు పాటలు ఆకట్టుకుంటాయి.

లాజిక్కులు లేకపోయినా… కట్టిపడేసే మ్యాజిక్కే!

ఒక రకంగా ఈ సినిమా చూస్తున్నప్పుడు తెలియకుండానే మణిరత్నం ఒకప్పుడు తీసిన ‘తిరుడా… తిరుడా…’  (తెలుగులో ‘దొంగ… దొంగ…‘ – 1993) గుర్తొస్తుంది. మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ కలసి కథ రాసుకోగా, ప్రశాంత్, ఆనంద్, హీరా, అనూ అగర్వాల్ నటించిన ఆ సినిమా ప్రభావం ఈ చిత్ర రూపకర్తపై చాలానే ఉన్నట్టుంది. అందుకే, ఈ సినిమాకు మణిరత్నం చిత్రంలోని ఏ.ఆర్. రెహమాన్ సూపర్ హిట్ పాట ‘కనులు కనులను దోచాయంటే…’ (తమిళంలో ‘కన్నుమ్ కన్నుమ్ కొళ్ళై అడిత్తాల్’) అని పేరు పెట్టారు. అప్పట్లో అందరినీ ఊపేసిన పాట అది. అందుకు తగ్గట్టే, ఇప్పుడీ సినిమా కథ ఆద్యంతం ఒక ఛేజింగ్ తరహాలో, పాత్రల మధ్య ఊహించని రేసులా సాగడంతో ప్రేక్షకులు కూడా వాళ్ళతో లీనమై, ఆ ప్రయాణం సాగిస్తారు. అందుకే, సినిమాలో పాటలు పెద్దగా లేకపోయినా, ఫైట్లు, ఐటమ్ సాంగుల లాంటివి లేకపోయినా… ఎక్కడా విసుగనిపించదు. కొన్ని సన్నివేశాలు కుర్చీల అంచున కూర్చొని మరీ, సీట్లకు అతుక్కుపోయి చూస్తారు. ఆ అనుభూతిలో పడిపోయి, సినిమాలో లాజిక్కులు లేని అనేక అంశాలను క్షమించి వదిలేస్తారు. అది ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. అందుకే, ఈ ‘కనులు కనులను దోచాయంటే…’ చిత్రం ప్రేక్షకుల కనులు దోచే… మనసు దోచే అనుభవం. చాలాకాలం తరువాత రెండున్నర గంటల పైగా ఉత్కంఠభరితంగా సాగిన సినిమా.

బలాలు

  • ఊహించని మలుపులతో కూడిన కథనం
  • పాత్రలు వేసే ఎత్తులు, పైయెత్తులు ప్రేక్షకులలో కలిగించే ఉత్కంఠ
  • దుల్కర్ సల్మాన్, రీతూ వర్మల ఆకట్టుకొనే అభినయం
  • నిర్మాణ విలువలు, కెమెరా వర్క్, కొన్ని పాటలు, నేపథ్య సంగీతం,
  • హీరో బృందం చేసే రకరకాల మోసాలు, వాటికి పన్నే పన్నాగాలు. మరీ ముఖ్యంగా, సెకండాఫ్‌లో వచ్చే లాకర్ దోపిడీ సన్నివేశం.

బలహీనతలు

  • ఫస్టాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల చిత్రం
  • సాంకేతికత పేరుతో అనేక చోట్ల లాజిక్కుకు అందని అంశాలు, సంఘటనలు
  • సెకండాఫ్‌లో హీరో బృందం వేసిన ప్లాన్‌లో అనీశ్ కురువిల్లా భార్యకూ, హీరో గ్యాంగ్‌లోని సభ్యురాలికీ మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తెలియదు. ఎడిటింగ్ కత్తెరకు ఆ ఘట్టం బలైందని ప్రేక్షకులే ఊహించుకోవాలి.
  • పూర్తిగా తెలుగు సినిమా అనిపించనివ్వని డబ్బింగ్ డైలాగులు, హాస్యం

పంచ్ లైన్కనులతో పాటు… మనసునూ దోచేస్తుంది!

రేటింగ్ – 2.75/ 5