ఇండియాలోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ రాజమౌళిదే!

67

ఇప్పుడు దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడు ఎవరో తెలుసా..? ఇంకెవరు… మన తెలుగువాడైన ఎస్.ఎస్. రాజమౌళి!

అవును. ఇది నిజం. ఈ విషయమే ఇప్పుడు కృష్ణానగర్‌లో గట్టిగా వినిపిస్తున్న మాట. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళి ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ఆయన అందుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే… ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఇప్పుడు నివ్వెరపోతున్నారు. ‘బాహుబలి’ రెండు భాగాలకూ కలిపి, రాజమౌళి అందుకున్న రెమ్యూనరేషన్ అక్షరాలా రూ. 238 కోట్లు అట. ఇంతవరకు తెలుగులోనే కాదు… దేశంలోనే ఏ దర్శకుడికీ దక్కనంతటి పారితోషికం ఇది అని కృష్ణానగర్ టాక్.

వివరాల్లోకి వెళితే… కొద్దికాలంగా రాజమౌళి తన చిత్రాలకు నేరుగా పారితోషికం తీసుకోవడం లేదు. సినిమా అంతా పూర్తయ్యాక, ఆ సినిమాల్లో వచ్చిన లాభాలు, రకరకాల హక్కులు, అమ్మకాల ఆదాయంలో వాటాలు – ఈ పద్ధతిలో తన రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్‌లతో కొత్తగా చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రానికే కాదు… అంతకు ముందు ‘బాహుబలి’కీ ఆ పద్ధతే అనుసరించారు. దాంతో, ‘బాహుబలి’ చిత్రానికి రాజమౌళి అందుకున్న పారితోషికం ఎంతో అప్పటికప్పుడు తెలియలేదు. తాజాగా ఆ సినిమా వ్యాపారం, ఖర్చులు, లాభాల లెక్కలన్నీ తిరగేస్తుంటే, ఒక విషయం బయటకొచ్చింది. ఆ సినిమాకు రాజమౌళికి అన్నీ కలిపి అక్షరాలా రూ. 238 కోట్ల మేర రెమ్యూనరేషన్ వచ్చిందట. ఇది దేశవ్యాప్తంగా ఏ దర్శకుడూ (స్వీయ నిర్మాణ సంస్థలో సినిమా తీస్తున్నవాళ్ళను పక్కనపెట్టేద్దాం) కనీవినీ ఎరుగని అంకె.

ఇంతకీ, అంత పారితోషికం రాజమౌళి ఏం చేసుంటారు. ఇది ఎవరికైనా ఆసక్తికరమైన అంశమే. నిజమో… అబద్ధమో కానీ… ఆ డబ్బుతో రాజమౌళి బృందం హైదరాబాద్ దాటి వెళ్ళాక జడ్చర్ల ప్రాంతంలో ఏకంగా 75 ఎకరాల స్థలం కొన్నదట. ఈ గాలివార్త ఇప్పుడు కృష్ణానగర్‌లో బలంగా వినిపిస్తోంది. ఎంత డబ్బు అయినా, భూమి మీద పెడితే అతి ఇంతకు అంత అవుతుందని మనవాళ్ళకు బాగా తెలుసు. ఈ స్థలాలు, పొలాల కొనుగోలు వార్తల్లో నిజానిజాలు ఎలా ఉన్నా… మొత్తానికి, ఇవాళ తెలుగులోనే కాదు… దేశంలోనే పారితోషికం రీత్యా నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి అనుకోవచ్చు. మరి, రాబోయే ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రానికి ఆ రెమ్యూనరేషన్ ఏ శిఖరాన్ని చేరుతుందో?

…………………………..